సమీక్ష : లా- సాగదీసిన రివెంజ్ డ్రామా !

సమీక్ష : లా- సాగదీసిన రివెంజ్ డ్రామా !

Published on Nov 24, 2018 3:52 AM IST
 LAW movie review

విడుదల తేదీ : నవంబర్ 23, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు : కమల్ కామరాజ్ , మౌర్యాణి, పూజా రామచంద్రన్ తదితరులు.

దర్శకత్వం : గగన్ గోపాల్ . ముల్క

నిర్మాత : రమేష్ బాబు మున్నా

సంగీతం : సత్య కశ్యప్

సినిమాటోగ్రఫర్ : పి. అమర్ కుమార్

కమల్ కామరాజ్ , మౌర్యాణి, పూజా రామచంద్రన్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు గగన్ గోపాల్ తెరకెక్కించిన చిత్రం ‘లా’. రమేష్ బాబు మున్నా నిర్మించిన ఈ చిత్రం, ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

విక్రమ్ (కమల్ కామరాజ్) పోలీస్ ట్రైయినింగ్ పూర్తి అయి, జాయినింగ్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ‘విక్రమ్ చెల్లి’ ఫ్రెండ్ రాధ (మౌర్యాణి) విక్రమ్ ని చూడగానే ఇష్టపడుతుంది. ఇక అతని చుట్టూనే తిరుగుతూ లైన్ వేస్తుంది. దాంతో విక్రమ్ కూడా రాదని ఇష్టపడతాడు. అలా ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతుండగా… రాధను ‘రుద్ర’ అనే ఓ వాచ్ మెన్ ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాడు. చివరికి రాధ ఉండే అపార్ట్ మెంట్స్ కే అతను వాచ్ మెన్ గా వస్తాడు.

ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. ఆ అపార్ట్స్ మెంట్స్ లో ఉండే నలుగురు కుర్రాళ్ళల్లో.. ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. వాళ్లు ఎందుకు చనిపోతున్నారు ? వాళ్ళను ఎవరు చంపుతున్నారు అని అర్ధం కానీ పరిస్థితుల మధ్య ‘యస్.ఐ’ గా డ్యూటీలో జాయిన్ అయిన విక్రమ్ ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేశాడు ? ఈ కేసుకు వాచ్ మెన్ ‘రుద్ర’కు ఏమిటి సంబంధం ? అసలు ‘రుద్ర’ (హీరోయిన్) రాధను ఎందుకు ఫాలో అవుతున్నాడు ? ఆ కుర్రాళ్ళ చావులకు రాధకు ఏమైన సంబంధం ఉందా ? ఇంతకీ ఆ కుర్రాళ్లను చంపుతుంది ఎవరు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన కమల్ కామరాజ్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా ఫిట్ గా చాలా బాగున్నాడు. తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాని నిలబెట్టడానికి తన వంతుగా శతవిధాలుగా ప్రయత్నించాడు. అలాగే హీరోయిన్ కి, తనకి మధ్య సాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో మరియు క్లైమాక్స్ సన్నివేశంలో కూడా చాలా బాగా నటించాడు.

‌ఇక హీరోయిన్ గా నటించిన మౌర్యాణి తన గ్లామర్ తో పాటు తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. రెండు వేరియేషన్స్ ను ఒకే ఎక్స్ ప్రెషన్ లో చూపించాల్సిన కొన్ని హర్రర్ సన్నివేశాల్లో… ఆమె చూపించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. అలాగే కథలో మరో కీలక పాత్ర అయిన ‘ప్రమీల పాత్ర’ను చేసిన పూజా రామచంద్రన్ కూడా చక్కగా నటించింది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో.. ముఖ్యంగా తన తండ్రిని తన కళ్ళ ముందే చంపుతున్న సన్నివేశంలో ఆమె చాలా బాగా ఎమోషనల్ గా నటించింది.

అపార్ట్స్ మెంట్స్ ప్రెసిడెంట్ గా నటించిన నటుడు కూడా తన కామెడీ డైలాగ్ డెలివరీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

ఆడవారి పై నేటి సమాజంలో చాలా రకాలుగా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకు బలైపోయిన ఓ అభాగ్యురాలు పగ బడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అనే అంశాన్నే తన సినిమా కాన్సెప్ట్ గా రాసుకున్న దర్శకుడు, ఆ కాన్సెప్ట్ కు తగ్గట్లు కథ కథనాలను మాత్రం ఆసక్తికరంగా రాసుకోవడంలో విఫలమైయ్యాడు.

సినిమాలో బలమైన పాయింట్ కనిపిస్తున్నా, ఆ పాయింట్ ని ఎలివేట్ చేసే క్యారెక్టైజేషన్స్ మాత్రం అంత బలంగా ఎస్టాబ్లిష్ కాలేదు. కొన్ని కీలక సన్నివేశాలను ఇంకా క్లారిటీగా చూపెడితే బాగుండేది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కాన్సెప్ట్ తో కూడిన సన్నివేశాలు సరిగ్గా ఎలివేట్ కాలేదు.

పైగా చాలా సన్నివేశాల్లో లాజిక్స్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా సినిమా తీశారా అనిపిస్తోంది. వీటికి తోడు ఇంట్రస్ట్ గా సాగని స్క్రీన్ ప్లే, సినిమా పై ఉన్న ఆసక్తిని నీరుగారిస్తోంది.

ఓవరాల్ గా ఈ చిత్రం ప్రేక్షకుడికి ఆసక్తి రేకెత్తించకుండా సాగుతూ.. బోర్ కొట్టిస్తోంది. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం కథ కథనాలను మాత్రం లాజిక్స్ లేకుండా.. మరీ సినిమాటిక్ గా రాసుకున్నాడు.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు గగన్ గోపాల్ . ముల్క మంచి ఎమోషనల్ కంటెంటే తీసుకున్నప్పటికీ, ఆ కంటెంట్ ని ఎలివేట్ చేసే విధంగా స్క్రిప్ట్ ని రాసుకోలేకపోయారు. సంగీత దర్శకుడు సత్య కశ్యప్ అందించిన పాటలు బాగున్నాయి. ఈ సినిమాకి పాటలే హైలెట్ గా నిలుస్తాయి. అయితే నేపధ్య సంగీతం మాత్రం అవసరానికి మించి.. అనవసరమైన బిల్డప్ మ్యూజిక్ తో సాగుతుంది.

ఇక కెమెరా బాధ్యతలను నిర్వహించిన పి. అమర్ కుమార్ కెమెరా వర్క్ పర్వాలేదు. అపార్ట్స్ మెంట్స్ లోని హర్రర్ సన్నివేశం లాంటి కొన్ని సన్నివేశాల్లో ఆయన పనితనం ఆకట్టుకుంటుంది.

ఎడిటర్ ఎస్. ఎస్. సుంకర ఎడిటింగ్ సినిమాకి తగ్గట్లుగానే ఉంది. నిర్మాత రమేష్ బాబు మున్నా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

గగన్ గోపాల్ దర్శకత్వంలో కమల్ కామరాజ్, మౌర్యాణి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం ఏ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. కాకపోతే కథలోని కీలక మైన ఎమోషనల్ కంటెంట్ బాగుంది. కానీ, ఆ కంటెంట్ కి తగట్లు కథ కథనాలను మాత్రం దర్శకుడు ఆకట్టుకున్నే విధంగా రాసుకోలేకపోయాడు. పైగా సినిమా ఆసాంతం ఆసక్తి రేకెత్తించకుండా సాగుతూ.. బోర్ కొట్టిస్తోంది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

 

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు