నృత్య దర్శకత్వం నుంచి నేరుగా సినిమా దర్శకత్వానికి షిఫ్ట్ అయిన రాఘవ లారెన్స్ దర్శకుడిగానూ మంచి విజయాలను నమోదు చేశారు. ఇక ఆయన దర్శకత్వం వహించిన ‘ముని’, దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కాంచన’ సినిమాలైతే సూపర్ హిట్లుగా నిలిచి లారెన్స్ కెరీర్‌లో గుర్తుండే సినిమాలుగా నిలిచాయి. హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ఈ సినిమాలు ఆ తర్వాత విడుదలైన హర్రర్ సినిమాలకు ఆదర్శంగా నిలిచాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడీ కోవలోనే ముని సిరీస్‌లో మూడో భాగంగా ‘కాంచన-2’ రానుంది.
’కాంచన 2’కి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రెండింటిని ఈమధ్యే విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక పోస్టర్‌లో పూర్తిగా పసుపు మీద జల్లుకొని పెద్దబొట్టుతో, చేతినిండా దారాలతో ఉన్న లారెన్స్‌ను చూడొచ్చు. ఇక ఈ పోస్టర్ విడుదలైన కొన్ని రోజులకే మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక ముసలావిడ గెటప్‌లో ఉన్న లారెన్స్‌ను ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఈ పోస్టర్‌లో లారెన్స్ లుక్, మేకప్ చూడగానే భయపెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కాంచన 2, ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.


