ప్రభాస్ సినిమా కోసం లెజెండరీ డైరెక్టర్ !

Published on Sep 21, 2020 11:47 am IST

నేషనల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమాకి లెజెండరీ డైరెక్టర్ పని చేయనున్నారు. తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో వైవిధ్యానికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్ గా పని చేస్తున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ అధికారికంగా తెలుపుతూ ‘మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల చివరకు నెరవేరనుంది. సింగీతం శ్రీనివాస రావు గారును మా ఎపిక్ చిత్రానికి స్వాగతిస్తున్నందుకుగానూ మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆయన సృజనాత్మక సూపర్ పవర్స్ ఖచ్చితంగా మాకు మార్గదర్శకంగా ఉంటాయి’ అని పోస్ట్ చేశారు.

ఇక ఇప్పటి జనరేషన్ కూడా సింగీతం శ్రీనివాసరావు తీసిన అప్పటి సినిమాలను బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా ‘పుష్పక విమానం, ఆదిత్య 369, అపూర్వ సోదరులు’ లాంటి భిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలు ఇప్పటికీ గొప్ప వైవిధ్యమైన చిత్రలుగా నిలుస్తున్నాయి. తన అభిరుచి ఇప్పటికీ కొత్తగానే అనిపించేలా ముద్ర వేసిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన ప్రభాస్ సినిమాకి పని చేయడం నిజంగా విశేషమే. ఇక ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది.

కాగా నాగ్ అశ్విన్ ఓ పురాణ కథలోని పాత్రల ఆధారంగా.. నేటి సమాజానికి తగ్గట్లు కథ రాసుకున్నాడని.. ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా సినిమాలా కాకుండా, పాన్ వరల్డ్ సినిమాలా తీసుకురానున్నారు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More