
సూపర్ స్టార్ మహేష్ బాబు – ‘మిర్చి’ ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇటీవలే పొల్లాచ్చిలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రసతుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర టీం అభిమానులకు ఒక శుభవార్తని అనౌన్స్ చేసింది. అదే ఈ సినిమా రిలీజ్ డేట్. ఈ చిత్ర పి.ఆర్.ఓ బిఎ రాజు చెప్పిన సమాచారం ప్రకారం ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చెయ్యడానికి సన్నాహలు చేస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతానికి టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాని ఈ సినిమాకి ‘శ్రీ మంతుడు’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ స్టంట్ మాస్టర్ యాక్షన్ అణల్ అరసు యాక్షన్ కంపోజర్ గా పనిచేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మహేష్ బాబుతో మొదటి సారి శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఫ్రాన్స్ లో ఉంటుందని సమాచారం.

