‘జ్యో అచ్యుతానంద’ ఇంట్లో సందడి చేయనున్న మహేష్ బాబు
Published on Sep 15, 2016 8:48 am IST

mahesh-babu
మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. దీని తరువాత హైదరాబాద్ లో నెల రోజులపాటు టీమ్ కొత్త షెడ్యూల్ జరపనుంది. కథ ప్రకారం ఈ షెడ్యూల్ షూటింగ్ అంతా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో జరగాల్సి ఉంది. అందుకోసం దర్శకుడు మురుగదాస్ 90వ దశకంలో ఇళ్లను పోలిన మిడిల్ క్లాస్ ఇంటిని సెట్ గా వేయాలనుకున్నాడు. ఇటీవలే ‘జ్యో అచ్యుతానంద’ టీమ్ ఫిలిం నగర్లో అటువంటి ఇంటినే రూపొందించి సినిమా చేసింది.

సినిమా ఎక్కువ భాగం ఆ ఇంట్లోనే జరిగింది. ప్రేక్షకులకు కూడా ఆ ఇల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఆ ఇల్లు వారాహి చలన చిత్రం ఆధీనంలోనే ఉంది. ఆ సెట్ ను గమనించిన మురుగదాస్ ఆ ఇల్లు అయితే తమకు సరిగ్గా సరిపోతుందని భావించి దాన్ని వాడుకోవాలని చూస్తున్నాడట. ఇదే విషయాన్ని వారాహి అధినేత సాయి కొర్రపాటి కూడా తెలిపాడట. ఇక అన్నీ కుదిరితే ఆ ఇంట్లోనే మహేష్ – మురుగదాస్ ల టీమ్ నెలరోజుల పాటు కీలక సన్నివేశాల షూటింగ్ చేస్తారని తెలుస్తోంది.

 
Like us on Facebook