మహేష్ తదుపరి సినిమా వంశీ పైడిపల్లితోనే!

MAHESH
సూపర్ స్టార్ మహేష్, సౌతిండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను ఇలా మొదలుపెట్టేసిన మహేష్, అప్పుడే మరో సినిమా కోసం కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మురుగదాస్ తర్వాత మహేష్, వంశీపైడిపల్లితో ఓ సినిమా చేయనున్నారన్న ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని పీవీపీ సంస్థ అధికారికంగా ప్రకటించేసింది. దీంతో మహేష్ తదుపరి సినిమా వంశీ పైడిపల్లితోనే అన్నది ఖరారైపోయింది.

మహేష్ కోసం ఇప్పటికే మంచి కథను సిద్ధం చేసిన వంశీ, ప్రస్తుతం పూర్తి స్థాయిలో స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. మురుగదాస్ సినిమా అయిపోగానే వంశీ పైడిపల్లి సినిమా సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. వంశీ గత చిత్రం ‘ఊపిరి’లానే జీవితాన్ని పరిచయం చేసే ఓ కొత్త కథతో, కమర్షియల్ పంథాలోనే సినిమా నడుస్తుందని సమాచారం. నేడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా పీవీపీ సంస్థ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాను ప్రకటించింది. ఇక ఈ సందర్భంగానే మహేష్‌కు 123తెలుగు తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.