సమీక్ష : మళ్ళీ మళ్ళీ చూశా – ఆకట్టుకోని ప్రేమ కథ

Published on Oct 19, 2019 2:02 am IST

విడుదల తేదీ : అక్టోబర్ 18, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : అనురాగ్ కొణిదెన,శ్వేతా అవస్థి, కైరవి టక్కర్, అన్నపూర్ణమ్మ, అజయ్, మధుమణి, ప్రభాకర్, టి.ఎన్. ఆర్, మిర్చి కిరణ్, కరణ్, బాషా, ప్రమోద్, పావని, జయలక్మి, మాస్టర్ రామ్ తేజస్, బంచిక్ బబ్లూ, తదితరులు.

దర్శకత్వం : హేమంత్ కార్తీక్

నిర్మాత‌లు : కె. కోటేశ్వరరావు

సంగీతం : శ్రవణ్ భరద్వాజ్

సినిమాటోగ్రఫర్ : సతీష్ ముత్యాల

ఎడిటర్ : సత్య గిడుతూరి

అనురాగ్‌ కొణిదెన హీరోగా పరిచయమవుతూ హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ”మళ్ళీ మళ్ళీ చూశా”. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్టైన్మెంట్ నేడు విడులైంది. మళ్ళీ మళ్ళీ చూశా చిత్రం తో ఈ కొత్త టీం చేసిన ప్రయత్నం ఎంత వరకు ఫలించిందో సమీక్షలో చూద్దాం.

 

కథ:

 

గౌతమ్(అనురాగ్ కొణిదెన)ఆర్మీ మేజర్ (అజయ్) ఇంట్లో పెరిగిన ఓ అనాధ.స్వప్న (స్వప్న అవస్థి) రాసిన ఓ ప్రేమకథకు సంబందించిన బుక్ అతనికి దొరుకుతుంది. ఆ ప్రేమకథలోని పాత్రలో తననే ఊహించుకుంటూ, ఆ పుస్తకం రాసిన స్వప్న ప్రేమలో పడిపోతాడు. ఆ పుస్తకం స్వప్నకు ఇవ్వాలని, ఆమెను కలవాలని వైజాగ్ నుండి హైదరాబాద్ వెళతాడు. మరి గౌతమ్, స్వప్న ను కలిశాడా? ఆ పుస్తకం తనకు అందించాడా? గౌతమ్ ప్రేమను స్వప్న అంగీకరించిందా? చివరికి వీరి కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

మళ్ళీ మళ్ళీ చూశా చిత్రంతో హీరోగా మొదటి ప్రయత్నం చేసిన అనురాగ్ ఆకట్టుకున్నారు. మాస్ హీరో రేంజ్ లో ఆయన యాక్షన్ సీన్స్ లో ఇరగదీశాడు. అలాగే ఎమోషనల్ మరియు కామెడీ సన్నివేశాలలో పేస్ ఎక్స్ప్రెషన్స్, టైమింగ్ విషయంలో కూడా అతను పర్వాలేదని పించారు.

మేజర్ పాత్రలో అజయ్ తక్కువ నిడివి గల పాత్రలో ఫిలసాఫికల్ డైలాగ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

కొత్తగా వెండి తెరకు పరిచమైన స్వప్న మెయిన్ లీడ్ హీరోయిన్ గా కొంత మేర ఆకట్టుకుంది.ఆమె చాలా అందంగా కనిపించారు. అలాగే ఇక స్వప్న కథలో హీరోయిన్ గా చేసిన కైరవి టక్కర్ తన పాత్ర పరిధి మేర పర్లేదు అనిపించారు. యూట్యూబ్ కమెడియన్ బంచిక్ బాబ్జి, చిట్టి బాబు పాత్ర చేసిన జబర్దస్త్ కమెడియన్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక సీనియర్ నటి అన్నపూర్ణ ఉప్మా బామ్మగా తెలంగాణా యాసలో డైలాగ్స్ చెప్పిన విధానం బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

 

గతంలో అనేక సినిమాలలో చూసిన డైరీ ప్రేమ కథల స్ఫూర్తి తో దర్శకుడు రాసుకున్న కథకు ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా బోరింగ్ గా సాగింది. ఒక సన్నివేశానికి మరొక సన్నివేశాన్ని సంబంధం లేకుండా పోయే ఈ చిత్రం ప్రేక్షకులకు అగ్ని పరీక్షే.

మూవీలో ఒక్క సన్నివేశం కూడా కొత్తగా అనిపించదు, బుక్ చదువుతూ కథలో తనని ఊహించుకొనే సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నట్లుగా అనిపిస్తాయి. మొదటి సగం స్వప్న రాసిన లవ్ స్టోరీ లోని పాత్రలతో నడిపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ మొత్తం పాత చింతకాయ పచ్చడి కాలేజీ ప్రేమ కథతో ముగించాడు.

హీరో ఇజం ఎలివేషమ్ కోసం, ఫైట్స్ కోసం పెట్టినట్టున్న రౌడీ గ్యాంగ్ లు, ర్యాగింగ్ గ్రూప్ లు కథలో భాగంగా అనిపించవు. అసలు ఐదు వందలు డబ్బులిచ్చేసి కాలేజీ లో సీట్ సంపాదించిన హీరో సన్నివేశం నమ్మబుద్ది కాదు.. కనీసం కామెడీ కూడా అలరించదు.

ఇక ఈ మూవీ క్లైమాక్స్ కూడా ఏమాత్రం ప్రభావం లేకుండా చకచకా లాగించేశారు. క్లైమాక్స్ లో బావోద్వేగమైన లవ్ సీన్ చూస్తున్న భావన ప్రేక్షకుడికి కలుగదు.

 

సాంకేతిక విభాగం:

 

స్టోరీ పాతదైనప్పటికీ చక్కని ఆకట్టుకొనే స్క్రీన్ ప్లే కారణంగా హిట్ అయిన సినిమాలు అనేకం. రెండు భిన్నమైన ప్రేమకథలను చూపించే ప్రయత్నంలో దర్శకుడు హేమంత్ కార్తీక్ ఎటుపోయి ఎటువచ్చారో ఎవరికీ అర్థం కాదు. కొన్ని సన్నివేశాలు తెరకెక్కించిన తీరు చూస్తే ఆయన అసలు ట్రెండ్ ఫాలో అవుతున్నారా లేదా? అనిపిస్తుంది.

సంగీత దర్శకుడు శ్రవణ్ భార్గవ్ పాటలు పర్లేదు అనిపించినా, బీజీఎమ్ మాత్రం ఆకట్టుకోదు, కొంత మేర సినిమాటోగ్రఫీ అలరిస్తుంది, ఎడిటింగ్ ఘోరం గా ఉంది. నిర్మాణ విలువలు ఒక చిన్న సినిమాకి తగ్గట్లు పర్లేదు అన్నట్లుగా ఉన్నాయి.

 

తీర్పు:

 

ఒక తీరు తెన్నూ లేకుండా సాగిపోయే మళ్ళీ మళ్ళీ చూశా చిత్రం ఈ కోణంలో కూడా ఆకట్టుకోదు.ఫీల్ లేని ప్రేమ కథను రొటీన్ సన్నివేశాలతో పరమ బోరింగ్ గా చెప్పడం జరిగింది. ఎటువెళుతుందో తెలియని ఫస్ట్ హాఫ్ తరువాత మొదలయ్యే సెకండ్ హాఫ్ ఇంకా పరీక్ష పెడుతుంది. కాబట్టి ఈ ‘మళ్ళీ మళ్ళీ చూశా’ మూవీ ఒకసారి చూడడమే కష్టం.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :