గ్రాండ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్న మెగా అభిమానులు !


మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి చేసిన చిత్రం ‘ఖైదీ నెం 150’ అభిమానుల అంచనాలకు తగ్గట్టే భారీ విజయాన్ని నమోదు చేసింది. రూ. 100 కోట్ల క్లబ్లో చేరి మెగాస్టార్ ఛరీష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ విజయానికి గుర్తుగా ఖైదీ సక్సెస్ ఈవెంట్ నిర్వహించాలని మెగా టీమ్ ప్లాన్ చేసినా ఎందుకో అది వర్కౌట్ కాలేదు. దీంతో ఫాన్స్ అంతా కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అందుకే స్వయంగా వారే రంగంలోకి దిగి భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.

జనవరి 11న రిలీజైన ఖైదీ మార్చి 1వ తేదీతో 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్బంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని అభిమాన సంఘాలు ఎవరికి వారు ఈ 50 రోజుల పండుగను గ్రాండ్ గా చేయాలని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. పలు ప్రధాన ప్రాంతాల్లో జరగబోయే వేడుకలకు మెగా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యే అవకాశముంది. ఇకపోతే చిరు తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం చేయనున్నారనే బలమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి.