తన డ్రీమ్ రోల్ ఏమిటో చెప్పిన మెగాస్టార్ చిరు !


మెగాస్టార్ చిరంజీవి.. 2 దశాబ్దాల పాటు తెలుగు సినీ రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించి ఇప్పటికీ తనకు పోటీ, సాటీ లేదని చెబుతూ 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ తో రీ ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు 151వ సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని చేస్తున్నారు. ఇన్నేళ్ల కెరీర్లో ఆయన ప్రతి నాయకుడి దగ్గర్నుంచి ఎన్నో రకాల విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు. ఇక చేయడానికి ఏమీ లేవనే స్థాయికి ఎదిగారు. అలాంటి ఆయనకు కూడా ఒక డ్రీమ్ రోల్ ఉంది.

నిన్న పుట్టినరోజు సందర్బంగా ఆయన ఇచ్చిన వీడియో మెసేజ్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు చిరు. ఎన్నాళ్ళ నుండో తనకు స్వాతంత్ర్య సమరయోధుడి చరిత్రను సినిమాగా చేయాలని అది కూడా భగత్ సింగ్ పాత్రను చేయాలని ఆశగా ఉండేదని కానీ ఎందుకో అది కుదరలేదని తన మనసులో మాటను బయటపెట్టారు చిరు.

అయినా కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి గొప్ప వ్యక్తి పాత్రను చేసే అదృష్టం దక్కిందని, దీంతో తన కోరిక తీరిందని చెప్పారు. ఈ పాత్ర చేయడం గొప్ప అవకాశం మాత్రమే కాక తనకు ఛాలెంజ్ లాంటిదని, సినిమా అత్యున్నత సాంకేతిక బృందంతో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపొందుతోందని అన్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.