ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చే వారిని కఠినంగా శిక్షించాలంటున్న మెహ్రీన్ !

ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చే వారిని కఠినంగా శిక్షించాలంటున్న మెహ్రీన్ !

Published on Jul 3, 2018 1:57 PM IST

గోపిచంద్, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ‘పంతం’ చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కాగా మెహరీన్‌ ఈ చిత్ర ప్రమోషన్లలో మీడియాపై మండిపడ్డారని, మీడియా తనను చికాగో వివాదంలోకి లాగాలని చూస్తోందని అన్నారని కొన్ని వార్తలొచ్చాయి. వీటిపై స్పందించిన మెహ్రీన్ తాను ఎవ్వరిపైనా కోపగించుకోలేదని, అసలు చికాగో వివాదం గురించి తాను ఎవ్వరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదని ట్విట్టర్ ద్వారా చెబుతూ అమెరికాలో తను ఎదుర్కున్న పరిస్థితుల గురించి పూర్తిగా వివరిస్తూ పోస్ట్ లు చేశారు.

వాటిలో ‘‘నేను ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కొన్ని పత్రికల్లో ఏవేవో వార్తలు రాస్తున్నాయి. కానీ నేనెవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మీడియాతో నాకు మంచి రిలేషన్ ఉంది. నన్ను ఎప్పుడు మీడియా సపోర్ట్ చేస్తూనే ఉంది. వైరల్ ఫీవర్‌ కారణంగా పంతం లాస్ట్ ప్రమోషనల్ ఈవెంట్‌ కు నేను హాజరు కాలేకపోయాను. నేను ఇంటర్వ్యూ ఇచ్చానన్నది అవాస్తవం.

అసలు యూఎస్లో జరిగిన నిజాలు ఇవే. మా ఫ్యామిలీతో నేను వాంకోవర్ నుంచి లాస్ వెగాస్‌ కు వీకెండ్ హాలిడే ట్రిప్ కు వెళ్లాను. ఆ సమయంలో నేను ఇమిగ్రేషన్ కోసం వెళ్లినప్పుడు అక్కడి ఆఫీసర్స్ నన్ను తెలుగు హీరోయిన్ గా గుర్తించారు. యూనైటెడ్ స్టేట్స్‌ కు నేను రావడానికి కారణం ఏంటని వారు ప్రశ్నించారు. అప్పుడే నేను చికాగో రాకెట్ గురించి ఆ ఆఫీసర్స్ ద్వారానే విన్నాను. నాకు ఆ వివాదానికి ఎటువంటి సంబంధం లేదని తెలిశాక, వారు నాకు సారీ చెప్పి నా ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూశారు.

ఆ విషయం గురించి అసల వాస్తవం నేను చెప్తేనే మంచిదని చెప్తున్నా. నిజానికి నేనక్కడ కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే, కాని అదంతా నా పర్సనల్ విషయం. ఇండస్ట్రీకి సంబంధం లేదు. తెలుగు సినీ పరిశ్రమ చాలా మంచిది. నావల్ల దాని ఇమేజ్‌ చెడిపోయేలా నేనెప్పటికీ ప్రవర్తించను. ఇక కొందరు చేసిన కొన్ని పనుల వల్ల మొత్తం పరిశ్రమకే బ్యాడ్ నేమ్ వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. అలాంటి వారికి సరైన శిక్ష పడాలని కోరుకుంటున్నా. మళ్లీ ఈ విషయం గురించి ఇంకెప్పుడు మాట్లాడను. మీడియా వారికి నా రిక్వెస్ట్.. దయచేసి నా గురించి వార్తల్ని నన్ను సంప్రదించకుండా రాయ్యొద్దు’ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు