ఈ వారమే విడుదలవుతోన్న మురుగదాస్ సినిమా!

akira
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ సినిమా ‘అకిరా’ విడుదలకు సిద్ధమైంది. బాలీవుడ్‌లో ‘గజిని’, ‘హాలిడే’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురుగదాస్, మూడో సినిమాగా ‘అకిరా’ పేరుతో సోనాక్షి సిన్హాతో ఓ లేడీ ఓరియంటడ్ సినిమా చేశారు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 2న) పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే ‘అకిరా’ టీమ్ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తోంది. మురుగదాస్ కూడా రేపట్నుంచి ప్రమోషన్స్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి మురుగదాస్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాపై నార్త్ ఇండియా మార్కెట్లో మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్, పోస్టర్స్ కూడా సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తిస్తూ వస్తున్నాయి.