‘నేను లోకల్’ ప్రీమియర్ షోకు రెడీ అవుతోన్న నాని!


న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో, అంచనాలను తారాస్థాయికి చేర్చగా, ఈ సినిమాతో నాని డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టడం ఖాయం అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక నానికి మంచి మార్కెట్స్‌లో ఒకటైన యూఎస్‌లోనూ భారీ ఎత్తున ఈ సినిమా విడుదలవుతోంది.

ఇక సాధారణంగా తన ప్రతి సినిమానూ హైద్రాబాద్‍లోనే అభిమానులతో చూసే నాని, ఈసారి మాత్రం యూఎస్‌లో చూడనున్నారు. తన కొత్త సినిమా షూటింగ్ కోసం యూఎస్ వెళ్ళిన ఆయన, అక్కడే ‘నేను లోకల్’ ప్రీమియర్స్‌కు హాజరుకానున్నారు. అమెరికా కాలమానం ప్రకారం బే ఏరియాలోని సెర్రా థియేటర్లో గురువారం 8 గంటల షోకు నాని వెళుతున్నారు. యూఎస్‌ అభిమానులతో మొదటిసారి సినిమా చూస్తూ ఉండడం ఎగ్జైటింగ్‌గా ఉందని ఆయన అన్నారు. దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాను త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు.