సాటిలైట్ రైట్స్ : ‘మజ్ను’తోనూ దూసుకుపోతోన్న నాని!

majnu
నాని ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్తగా అవతరించిన ఓ స్టార్. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని ఈమధ్యే విడుదలైన ‘జెంటిల్‌మన్’ వరకూ ఏడాదిన్నరలో వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకొని దూసుకుపోతోన్న ఈ హీరో, తన కొత్త సినిమా ‘మజ్ను’తో మరోసారి హిట్ కొడతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఉయ్యాల జంపాల’తో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారమే భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలోనే సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేలా టీమ్ ప్రచార కార్యక్రమాలను కూడా వినూత్నంగా జరుపుతూ వస్తోంది.

ఇక వరుసగా నాలుగు సినిమాలు సక్సెస్ సాధించి ఉండడంతో మజ్ను సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరిగింది. అదేవిధంగా మొదట్నుంచీ మజ్ను సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా కూడా ఈ సినిమా సాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ కనిపించింది. తాజాగా ఈ సినిమా సాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ టీవీ చానల్ 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాదే విడుదలైన ఆయన సినిమాలు కృష్ణగాడి వీర ప్రేమ గాధ, జెంటిల్‍మన్‍లు కూడా ఇదే స్థాయి సాటిలైట్ ధర పలికి నాని మార్కెట్ స్టామినాను అమాంతం పెంచేశాయి. ఇక ఇప్పుడు మజ్నుతో కూడా మళ్ళీ ఇదే రిపీట్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.

నాని కెరీర్ మొదట్నుంచీ ఆయన నటించిన సినిమాలన్నింటికీ టీవీల్లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తూ ఉండడం గమనించొచ్చు. అష్టా చమ్మా, అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ, ఎవడే సుబ్రమణ్యం.. లాంటి సినిమాలన్నీ టీవీల్లోనూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే నాని నటించే సినిమాలకు సాటిలైట్ రైట్స్ విషయంలో మంచి బిజినెస్ జరుగుతూంటుంది. ఇప్పుడు మజ్నుతో ఇదే విషయం మరోసారి ఋజువైంది. నాని సరసన అను ఎమ్మాన్యూల్ హీరోయిన్‍గా నటించిన మజ్ను, ఓ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది.