Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : నవాబ్ – అన్నదమ్ముల సంఘర్షణమయం

Nawab movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 27, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : శింబు, విజయ్ సేతుపతి, అరవింద స్వామి, జ్యోతిక, అదితి రావు హైదరి, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాజేష్ తదితరులు.

దర్శకత్వం : మ‌ణిర‌త్నం

నిర్మాతల : అశోక్ వల్లభనేని

సంగీతం : ఎ.ఆర్‌. రెహ‌మాన్

స్క్రీన్ ప్లే : మ‌ణిర‌త్నం

ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్

ప్రముఖ దర్శకుడు మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నవాబ్’. అరవింద స్వామి , విజయ్ సేతుపతి , శింబు , అరుణ్ విజయ్ లు హీరోలుగా నటించగా అదితి రావ్ హైదరి, ఐశ్వర్య రాజేష్ , డయానాలు హీరోయిన్లుగా నటించారు. ఎఆర్ రహెమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

భూపతి (ప్రకాష్ రాజ్) నేరచరిత్ర కలిగిన వ్యక్తి. సిటీలోనే ఎదురులేని మోస్ట్ పవర్ ఫుల్ మ్యాన్. భూపతికి భార్య (జయసుధ)తో పాటు ముగ్గురు కుమారులు. పెద్దవాడైన వరద (అరవింద స్వామి)కి భార్య చిత్ర (జ్యోతిక)తో పాటు ప్రియురాలు (అతిథిరావ్ హైదరి) కూడా ఉంటుంది. భూపతి మిగిలిన ఇద్దరు కుమారులు అరుణ్ విజయ్ (త్యాగు), రుద్ర (శింబు). కాగా పోలీస్ ఆఫీసర్ రసూల్ (విజయ్ సేతుపతి) అరవింద స్వామి స్నేహితుడుగా ఉంటాడు. ఈ క్రమంలో భూపతి పై మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. తీవ్రగాయాలతో భూపతి, అతని భార్య ప్రాణాలతో బయట పడతారు. కానీ మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరు అని తెలుసుకున్నే క్రమంలో.. భూపతి హర్ట్ అటాక్ తో చనిపోతాడు. దీంతో భూపతి ప్లేస్ కోసం ముగ్గురు కొడుకుల మధ్య సంఘర్షణ మొదలవుతుంది.

ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవల్లో జరిగిన సంఘటనలు ఏమిటి ? అసలు భూపతి పై ఎవరు దాడి చేశారు ? ఎందుకు దాడి చేశారు ? చివరకి ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరు గెలుస్తారు ? రసూల్ ఎవరకి సాయపడతాడు ? అసలు రసూల్ (విజయ్ సేతుపతి) ఎవరు ? ఏ ఉద్దేశ్యంతో ఈ ముగ్గురితో కలిసి తిరుగుతాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

దిగ్గజ దర్శకుడు మణిరత్నం రాసుకున్న కుటుంబ నేపథ్యంలో సాగే కథే ఈ సినిమాకు ప్రధాన బలం. అన్నదమ్ముల మధ్య సాగే సంఘర్షణతో కూడుకున్న సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.

శింబు, విజయ్ సేతుపతి, అరవింద స్వామి,జ్యోతిక, అదితి రావు హైదరి లాంటి భారీతారాగణం నటించిన ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఒదిగిపోయారు.
అరవింద స్వామి లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించారు. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆయన ఆకట్టుకున్నాడు. చాలా సంవత్సరాల తరువాత శింబు మంచి పాత్రలో కనిపించారు. తన అగ్రీసివ్ క్యారెక్టరైజేషన్ లో.. తన అగ్రీసివ్ పెర్ఫార్మన్స్ తో శింబు తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక సినిమాకే కీలకమైన పాత్రలో నటించిన విజయ్ సేతుపతి, పోలిస్ ఆఫీసర్ రసూల్ గా చక్కగా నటించాడు. తన టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించాడు. ముఖ్యంగా ఆయన ఇంట్రడక్షన్ సీన్ లో చెప్పిన కొన్ని ఇన్నోసెంట్ డైలాగ్స్ బాగా నవ్విస్తాయి. ఇటు సీరియస్ సన్నివేశాల్లో కూడా విజయ్ సేతుపతి తన యాక్టింగ్ తో సీరియస్ నెస్ తీసుకొచ్చాడు. మెయిన్ గా క్లైమాక్స్ లో విజయ్ నటన మొచ్చుకోదగినది.

సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, జయసుధ ఎప్పటిలాగే తమ నటనతో ప్రేక్షకులని మెప్పించారు. హాస్పిటల్ సన్నివేశాల్లో మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ప్రకాష్ రాజ్, జయసుధ అద్భుతంగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

అన్నదమ్ముల మధ్య ఆసక్తికరమైన కథను అల్లుకున్న మణిరత్నం.. అంతే ఆసక్తికరంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. గత తన సినిమాల శైలిలోనే మణిరత్నం ఈ సినిమాని కూడా నడిపారు తప్ప.. కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు.

ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన ఆయన సెకెండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారని అనిపిస్తోంది. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు.

ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయినా, అరవింద స్వామి పాత్ర ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. మరీ అంత క్రూరమైన పనులు చేసే అంతగా ఆ పాత్ర మారడానికి, ఇంకా బలమైన సంఘటనలు ఉండి ఉంటే ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది.

ఓవరాల్ గా నవాబ్ లో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

మణిరత్నం రచయితగా పర్వాలేదనిపించినా, దర్శకుడిగా మాత్రం ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహ‌మాన్ తన స్థాయికి తగ్గ పనితనం కనబర్చకపోయిన, ఆయన అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ప్ర‌తి స‌న్నివేశాన్ని సంతోష్ శివన్ అద్భుతంగా విజువ‌లైజ్ చేశారు.

ఇక శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో కొన్ని సాగతీత సీన్స్ ట్రీమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని అశోక్ వల్లభనేన నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.

తీర్పు :

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద స్వామి, జ్యోతిక, అదితి రావు హైదరి లాంటి భారీ తారాగణం కాంబినేషన్ లో వచ్చిన ‘నవాబ్’ చిత్రం, మణిరత్నం సినిమాల శైలిలోనే సాగుతుంది. అన్నదమ్ముల మధ్యే సాగే సంఘర్షణతో కూడుకున్న సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. కానీ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకపోవడంతో, సినిమా ఫలితం దెబ్బతింది. ఓవరాల్ గా మణిరత్నం సినీ అభిమానులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. కానీ సగటు ప్రేక్షకుడిని మాత్రం ఈ చిత్రం మెప్పించకపోవచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :