భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో నేపాల్ అతలాకుతలమవుతోంది. దేశంలోని పలు జిల్లాల్లో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది ఆచూకీ గల్లంతైంది. వరద ఉధృతికి నివాస ప్రాంతాలు మునిగిపోవడంతో పాటు భారీ కొండ భాగాలు నదుల్లోకి కుప్పకూలుతుండటంతో పరిస్థితి భయానకంగా మారింది.
ముస్తాంగ్ జిల్లా లెతే సమీపంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చార్ ధామ్ యాత్రికులు రికార్డు చేసిన దృశ్యాల ప్రకారం, ఒక భారీ కొండ భాగం కేవలం ఆరు సెకన్ల వ్యవధిలోనే నిలువునా కాళీ గండకి నదిలోకి జారిపడిపోయింది. పెను శబ్దంతో మట్టి, బండరాళ్లు నదిలో పడటంతో స్థానికులు, యాత్రికులు భయాందోళనలతో పరుగులు తీశారు. కొండచరియల శిథిలాలు కాసేపు నదీ ప్రవాహాన్ని అడ్డుకోగా, ఆ తర్వాత నీరు మార్గం చేసుకుని ముందుకు సాగింది.
కళ్లముందే లోయలోకి కుంగిపోయిన నివాసాలు
మరో ప్రాంతంలో తీసిన దృశ్యాల్లో ఇళ్లు, చెట్లు నేరుగా లోయలోకి కుంగిపోవడం కనిపించింది. నివాసితులు రోదిస్తూ సహాయం కోసం కేకలు వేయడం అక్కడి విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది. గండకి ప్రావిన్స్‌లో వరుసగా మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు కాళీ గండకి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పర్బత్ జిల్లాలోని ఒక గ్రామంలో వరద ప్రవాహానికి నివాస ప్రాంతం పూర్తిగా కొట్టుకుపోయింది.
కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారులు మూసుకుపోయి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అయినప్పటికీ భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మరోవైపు, మానాంగ్ జిల్లాలోని హిమ్‌లుంగ్ హిమాల్ బేస్ క్యాంప్‌పై హిమపాతం విరుచుకుపడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది ఆచూకీ లభించాల్సి ఉంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


