‘అర్జున్ సురవరం’.. ప్రచారం ఎక్కడ

Published on Nov 13, 2019 10:04 pm IST

యువ హీరో నిఖిల్ చిత్రం ‘అర్జున్ సురవరం’ కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట్లో సినిమాకు ‘ముద్ర’ టైటిల్ పెట్టారు. కానీ కొన్ని కారణాల వలన పేరును ‘అర్జున్ సురవరం’గా మార్చారు. దీంతో ఆ పేరుతో చిత్రాన్ని ప్రమోట్ చేశారు. కానీ విడుదల వాయిదాపడుతూ రావడంతో ఆ ప్రమోషన్లు కూడా మెల్లగా సన్నగిల్లి పూర్తిగా ఆగిపోయాయి.

తర్వాత అడ్డంకులన్నీ తొలగి ఈ నెల 29న విడుదలకు సిద్దమైంది. విడుదలకు ఇంకో రెండు వారాలు మాత్రమే గడువు ఉంది. అయినా చిత్ర టీమ్ ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. ఈరోజుల్లో ఏ సినిమాకైనా ప్రచారం చాలా ముఖ్యం. అవి సరిగ్గా ఉంటేనే ఓపెనింగ్స్ బాగుంటాయి. ఈ వాస్తవం చిత్ర బృందానికి తెలియనిది కాదు. మరి అనేక ఆటంకాల్ని ఎదుర్కొన్న నిఖిల్ అండ్ టీమ్ తేరుకుని ఎప్పుడు ప్రచారం స్టార్ట్ చేస్తారో చూడాలి.

ఇకపోతే ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటించింది. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More