
విభిన్న, విలక్షణ, భావోద్వేగపూరిత సినిమాల ద్వారా దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా నిలిచారు.. మణిరత్నం. ఆయన సినిమాలన్నీ కొత్తగా దర్శకులవ్వాలనుకునే వారికి పాఠాలవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి దర్శకుడు గత కొంతకాలం నుంచి తనదైన ముద్ర వేసే సినిమా చేయలేకపోయారు. ఇప్పుడు తాజాగా ‘మణిరత్నం ఇస్ బ్యాక్’ అన్న స్లోగన్ వినపడుతున్న నేపథ్యంలో వస్తోన్న చిత్రం.. ఓకే కన్మణి. తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం పట్ల తాజాగా ఓ విషయం తెలిసింది.
ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ సహజీవనం చేయాలనుకుంటారని తెలుస్తోంది. సహజీవనం అనేది మన భారతీయ సినిమాల్లో చాలా సున్నితమైన అంశం. ఇప్పటివరకూ ఆ అంశం పట్ల చాలా తక్కువ సినిమాలే డీల్ చేశాయి. మోహన కృష్ణ ఇంద్రగంటి తీసిన ‘అంతకు ముందు.. ఆ తరువాత..’ సహజీవనం నేపథ్యంలో వచ్చినే సినిమానే. ఈ సినిమాకు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు అదే నేపథ్యంతో మరో సినిమా రానుండడం, అందునా మణిరత్నం తెరకెక్కించడం ఆసక్తి రేపుతోంది. ఓకే బంగారం ఆడియోను ఈనెల 27న, సినిమాను ఏప్రిల్ నెల 17న విడుదల చేయనున్నారు.

