నూతన సంవత్సరం సందర్భంగా ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా హారర్ కామెడీ చిత్రం ‘రుక్మిణి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. జి సినిమా బ్యానర్‌పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సింహాచలం గుడుపూరి దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియాంక, దీప్తి శ్రీరంగం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నిర్మాత గంగాధర రావుతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చిన్న సినిమాలు విజయం సాధించినప్పుడే పరిశ్రమ బాగుంటుందని, ఈ చిత్రం మంచి విజయం అందుకోవాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ‘మల్లీశ్వరి’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన గ్రీష్మ నేత్రికా, ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కావడం విశేషం.
కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ హారర్ కామెడీని రూపొందించామని హీరో నిరంజన్ పేర్కొన్నారు. చిత్ర టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విఖ్యాత్, జయంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.


