ఈ దసరా బరిలో రాబోతున్న సినిమా ‘రణబాలి’. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటిస్తున్న మొదటి సినిమా. అందుకే, సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అటు ‘టాక్సీవాలా’ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న రెండో చిత్రం కావడం కూడా ఈ సినిమాకి ప్లస్ కానుంది. ఐతే, మొత్తానికి విజయ్ దేవరకొండ అభిమానుల నిరీక్షణకు తెరపడనుంది. ఈ చిత్రం 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.
కాగా విడుదలకు ముందు, విదేశీ మార్కెట్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం తెలిసింది. విడుదల రోజున విదేశాల్లో కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ప్రదర్శించబడుతుందని, డబ్బింగ్ వెర్షన్లు మాత్రం 2026 అక్టోబర్ 23న విడుదలవుతాయని పంపిణీదారులు క్లారిటీ ఇచ్చారు. డబ్బింగ్ కంటెంట్ సిద్ధం చేయడంలో జరిగిన జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మెయిన్ థియేటర్ చైన్‌లలో టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రీ-సేల్స్ 50 వేల డాలర్ల మార్కును దాటాయి. రాబోయే రోజుల్లో ప్రీమియర్ వసూళ్లు ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి. ఈ సినిమాకి ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందించారు.


