దర్శకుడిగా మారనున్న ఫేమస్ టెక్నీషియన్

దర్శకుడిగా మారనున్న ఫేమస్ టెక్నీషియన్

Published on Jul 2, 2015 1:32 PM IST

Resul-Pookutty
సినీ పరిశ్రమలో టెక్నీషియన్‌గా అద్భుతమైన పేరు సంపాదించుకున్నాక చాలామందికి ఆ తర్వాతి టార్గెట్ డైరెక్షన్. ఇప్పటివరకూ సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఇలా రకరకాల విభాగాల్లో మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత దర్శకత్వంలోనూ తమ సత్తా చాటిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో మరో టెక్నీషియన్ చేరనున్నారు.

‘స్లమ్‌డాగ్ మిల్లియనీర్’ అనే హాలీవుడ్ సినిమాకు గానూ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును సాధించి భారత దేశానికి గర్వ కారణంగా నిలిచిన రసూల్ పూకుట్టి త్వరలో దర్శకుడిగా మారనున్నారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కనున్న సినిమా కోసం ఇప్పటికే పలు సంస్థల నుంచి ఫండ్స్‌ను కూడా ఆహ్వానిస్తున్నారట. సుమారు 300 కోట్ల రూపాయలు సమకూర్చుకున్నాక బాలీవుడ్‌ ప్రాజెక్టుగా ఆ సినిమాను మొదలుపెట్టనున్నామని రసూల్ ఈ సందర్భంగా తెలిపారు.

రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రసూల్ తన నిర్మాణ సంస్థను నిర్వహించనున్నారు. ఇక తమిళంలో రూపొంది తెలుగులో డబ్ అయిన రోబో (ఎందిరన్) సినిమాలో ఆయన చేసిన ప్రయోగం ఇక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే! తన మొదటి సినిమా తర్వాత వరుసగా సౌతిండియాలోని ఇతర భాషల్లోనూ సినిమాలు తీయాలని రసూల్ భావిస్తున్నారు.

తాజా వార్తలు