KEY TAKEAWAYS (ముఖ్య అంశాలు)
- సినిమా నిడివి ఎంత ఉందన్నది కాదు, ప్రేక్షకులను ఎంత ఎంగేజ్ చేశామన్నదే ముఖ్యం అని ఈ చిత్రాలు నిరూపించాయి.
- యానిమల్, పుష్ప 2, ధురంధర్ సినిమాలు సేఫ్ గేమ్ ఆడకుండా, డైరెక్టర్ విజన్‌ను నిజాయితీగా తెరపై ఆవిష్కరించి సక్సెస్ అయ్యాయి.
- రొటీన్ ఫార్ములాలు వదిలేసి, బలమైన కథను నమ్ముకుంటే జనాలు మూడు గంటలైనా థియేటర్లలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నారు.
సినిమా అంటే రెండున్నర గంటలే ఉండాలి, అంతకంటే ఎక్కువైతే జనాలు థియేటర్లలో కూర్చోలేరు.. చాలాకాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఇది. కానీ, ఈ రూల్‌ని బ్రేక్ చేస్తూ ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు సరికొత్త ట్రెండ్ సెట్ చేశాయి. 3 గంటల 24 నిమిషాల నిడివితో వచ్చిన ‘యానిమల్’, 3 గంటల 21 నిమిషాల ‘పుష్ప 2: ది రూల్’, అలాగే ‘ధురంధర్’ సిరీస్.. ఈ చిత్రాలన్నీ ఒకే ఒక్క విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రేక్షకులకు భయం నిడివి చూసి కాదు.. సినిమాలో బోర్ కొడితేనే!
పక్కా ఫార్ములాను నమ్ముకోకుండా దర్శకులు తమ విజన్‌ను నిజాయితీగా తెరపై ఆవిష్కరిస్తే, ఆడియన్స్ గంటల తరబడి స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ‘యానిమల్’ సినిమానే తీసుకుంటే, దాని రన్‌టైమ్ ఏమాత్రం అడ్డంకి కాలేదు. పైగా జనాలు మళ్లీ మళ్లీ థియేటర్లకు క్యూ కట్టారు. భారీ సెట్టింగులు, హైప్ మాత్రమే దీనికి కారణం కాదు. ఆ సినిమాలోని ఎమోషనల్ కోర్, దర్శకుడి క్లారిటీ ప్రేక్షకులను అంతలా కనెక్ట్ చేశాయి. కొందరు విమర్శించినా సరే, ఆ ఇంపాక్ట్‌ను ఎవరూ పక్కన పెట్టలేకపోయారు.
కథపై నమ్మకం ఉంటే..
‘పుష్ప 2: ది రూల్’ కూడా దాదాపు ఇదే దారిలో నడిచింది. పుష్ప క్యారెక్టర్‌ను, ఆ ప్రపంచాన్ని మరింత డీటెయిల్‌గా చూపించడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారు. కేవలం రన్‌టైమ్ తగ్గించడం కోసం కథను కుదించే ప్రయత్నం చేయలేదు. ఇక ‘ధురంధర్’ సిరీస్ చిత్రాలు దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. అందరినీ మెప్పించాలనే ఉద్దేశంతో కాంప్రమైజ్ కాకుండా, దర్శకుడు తాను చెప్పాలనుకున్న కథను చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. వాళ్ల నమ్మకమే జనాలకు బాగా కనెక్ట్ అయింది. సేఫ్ గేమ్ ఆడి, అందరినీ శాటిస్‌ఫై చేద్దామనే ఫార్ములాను ఈ చిత్రాలు పక్కన పెట్టేయడం వల్లే ఇంత పెద్ద హిట్లుగా నిలిచాయి.
అయితే ఇక్కడో చిన్న లాజిక్ మిస్ అవ్వకూడదు. ఈ సినిమాలు హిట్టయ్యాయి కదా అని, ఏ కథ పడితే ఆ కథను నాలుగు గంటల పాటు తీస్తే జనాలు చూస్తారనుకోవడం పొరపాటు. రొటీన్ సీన్లు, పాత ఫార్ములాలతో సినిమాను సాగదీస్తే అసలుకే మోసం వస్తుంది. ఒక బలమైన కథ, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే ఉన్నప్పుడు మాత్రమే టైమ్ అనేది మ్యాటర్ కాదు. రెండు గంటల సినిమా అయినా సరే డెప్త్ లేకపోతే తేలిపోతుంది. కాబట్టి దర్శకులు నిడివి గురించి భయపడటం మానేసి, ఆడియన్స్‌ను కట్టిపడేసే కథల మీద పూర్తి ఫోకస్ పెడితే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించవచ్చు.


