సమీక్ష : సామి – రొటీన్ యాక్షన్ డ్రామా

Published on Sep 21, 2018 10:37 pm IST
Saamy movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 21, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : చియాన్ విక్రమ్ , కీర్తి సురేష్ , బాబీ సింహ

దర్శకత్వం : హరి

నిర్మాత : శిబూ తమిన్స్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

ఎడిటింగ్ : వెంకటేష్ అనుగురాజ్

చియాన్ విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సామీ స్క్వేర్ . సూపర్ హిట్ తమిళ చిత్రం సామి కి సిక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ‘సామి’ పేరుతో ఈ రోజు విడుదలైయింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

మొదటి భాగం లో ఏం జరిగిందో చూపెడుతూ పర్ఫెక్ట్ గా స్టార్ట్ అవుతుంది ఈ చిత్రం. పరుశురాం సామీ (విక్రమ్) భువన ( ఐశ్వర్య రాజేష్) భార్య భర్తలు. ఆ తరువాత కథ 28 సంవత్సరాలు ముందుకు జరుగుతుంది. ఢిల్లీలో ఐ ఏ ఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న రామసామి (పరుశురాం సామీ కుమారుడు)కు మినిస్టర్ కూతురు దియా (కీర్తి సురేష్) పరిచయం అవుతుంది.

ఆ పరిచయం కాస్త ఇద్దరు మధ్య ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో రామసామి(విక్రమ్) ఇక కలక్టర్ అవుదామనుకొని పోలస్ ఆఫీసర్ అయ్యి ఇంటికి వస్తాడు. ఈ లోగా జరిగిన కొన్ని పరిణామాల మధ్య, రామసామి తన తల్లిదండ్రుల గురించి తెలుసుకొని, డ్యూటీ మీద విజయవాడకు వస్తాడు. ఆ తరువాత తన తల్లిదండ్రులను చంపిన రావణ్ భిక్షు (బాబీ సింహ) మరియు అతని సోదరుల పై రామసామి ఎలా పగ తీర్చుకున్నాడనేదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ నటన ఈచిత్రానికి హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ వయసు లోకూడా ఆయన తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక దియా పాత్రలో నటించిన కీర్తి సురేష్ తన నటనతో , గ్లామర్ తో మెప్పించింది.

ప్రతినాయకుడి పాత్రలో బాబీ సింహ చెలరేగిపోయాడు. మంచి వేరియేషన్స్ ను కనబర్చి తన పాత్ర కు పూర్తిగా న్యాయం చేశాడు. భువన పాత్రలో ఐశ్వర్య రాజేష్ స్క్రీన్ మీద కనపడింది తక్కువ సమయమే అయినా తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది.

ఇక దర్శకుడు హరి సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను బాగా తెరకెక్కించారు. కథనంలో ఎక్కడ వేగం తగ్గకుండా చూసుకున్నారు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. అసలు విక్రమ్ ఒక్కరా ఇద్దరా అనే కన్ఫ్యూజన్ సృష్టించి మంచి ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి పెంచేలా చేశాడు.

మైనస్ పాయింట్స్ :

సీక్వెల్ తీయడంలో దిట్టయినా దర్శకుడు హరి ఈ సారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు. సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నప్పుడు కథ పక్క గా ఉండాలి కాని ఇందులో అది మిస్ అయింది. కథ లేనప్పుడైనా కథనంతో నైనా దాన్ని కవర్ చేయాలి కానీ ఈ సినిమాకు అధి కూడా వర్క్ అవుట్ కాలేదు. ఔట్ డేట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈసినిమాలో చాలా పాత్రలు నిరాశకు గురిచేసాయి.

ముఖ్యంగా నాయకుడు – ప్రతినాయకుడి మధ్యన హోరా హోరి పోరు తప్పదు అనుకునే టైంలో ఆ పాత్రలను నీరుగార్చాడు. రొటీన్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను బోర్ కొట్టించాడు దర్శకుడు హరి.

ఇక ఈ సినిమాకు కామెడీ మరో మైనస్. సూరి తో కామెడీ చేయించాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చాలా చోట్ల విసుగు తెప్పించింది. ఇక హీరోయిన్ పాత్రకూడా చాలా బలహీనంగా వుంది. మహానటి చిత్రం తరువాత ఈ పాత్రను కీర్తి ఎలా ఒప్పుకుందో అర్ధం కాదు.

సాంకేతిక వర్గం :

సినిమాకు మెయిన్ పిల్లర్ అయినా దర్శకుడు హరి మరో మంచి యాక్షన్ డ్రామా ను ప్రేక్షకుల పరిచయం చేద్దామనుకొని పూర్తిగా నిరాశపరిచాడు. కథ లేకుండా రొటీన్ సన్నివేశాలతో హడావిడిగా తీసిన ఈచిత్రం చాల వరకు నిరాశ పరిచింది.

ఇక ఈచిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఎప్పటిలాగా కాకుండా అవుట్ డేట్ సాంగ్స్ తో సరిపెట్టాడు. ఒక చివరిలో వచ్చే పిల్ల నిన్ను చుస్తే అని సాంగ్ తప్ప మిగితావన్ని తేలిపోయాయి. పాటలతో నిరాశ పరిచిన దేవి నేపథ్యం సంగీతంతో ఆకట్టుకున్నాడు.

ప్రియన్ ఛాయాగ్రహణం బాగుంది ప్రతి ఫ్రెమ్ చాల రిచ్ గా అనిపిస్తుంది. విజయన్ ,జై ల ఎడిటింగ్ కూడా పర్వాలేదు. శిబూ తమీన్స్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

తీర్పు :

సింగం సిరీస్ తో తన సత్తా చాటుకున్న డైరెక్టర్ హరి మళ్లీ మరో సూపర్ హిట్ మూవీ కి సీక్వెల్ గా ఈ ‘సామి’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ సీక్వెల్ తో అదే ఒరిజినల్ ఫలితాన్ని రాబట్టే ప్రయత్నంలో విఫలమైయి తీవ్రంగా నిరాశపరిచాడు. పాత కాలపు కథతో, ఆసక్తిలేని కథనంతో, సందర్భం లేకుండా మధ్య మధ్యలో విసిగించే రొటీన్ కామెడీ తో రొటీన్ గా సాగింది ఈ చిత్రం. కానీ చియాన్ విక్రమ్ నట విశ్వరూపం చూడాలనుకునే వారు మాత్రం ఈ సినిమాను చూడొచ్చు. కాకపోతే క్లాస్ ఆడియన్స్ కు, మరియు విభిన్నమైన చిత్రాలను కోరుకొనే ప్త్రేక్షకులను ఈ చిత్రం మెప్పించడం కష్టమే.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :