ఇంటర్వ్యూ : సమంత అక్కినేని – ‘ఓ బేబీ’ నా కెరీర్‌ లోనే స్పెష‌ల్ మూవీ !

ఇంటర్వ్యూ : సమంత అక్కినేని – ‘ఓ బేబీ’ నా కెరీర్‌ లోనే స్పెష‌ల్ మూవీ !

Published on Jul 4, 2019 4:31 PM IST

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రాని’కి అనువాదంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇరవై ఏళ్ల యువతి 70 ఏళ్ల వృద్ధురాలిగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందనే అంశాలు ప్రధానంగా ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సంద‌ర్భంగా సమంత అక్కినేని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆమె వెల్లడించిన ఆసక్తికర విశేషాలు మీ కోసం.

 

మొదటినుంచీ ఈ సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమాలో మిమ్మల్ని అంత బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటి ?

 

ఈ సినిమా కథే అండి. పర్సనల్ గా నాకు బాగా కనెక్ట్ అయిన కథ. అందరికీ కనెక్ట్ అయ్యే కథ. ప్రతి ఒక్కరికీ వాళ్ళ మదర్ తో ప్రత్యేకమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషనే ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది.

 

అందుకేనా ఈ సినిమా పై బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు ?

 

నేను ఇప్పటివరకీ ఇలాంటి సినిమా చెయ్యలేదు. పైగా నా మనసుకు దగ్గరైన సినిమా.. ఎప్పటికీ నా కెరీర్‌లో స్పెష‌ల్ గా నిలిచిపోయే సినిమా. అందుకే ఈ సినిమా అందరికీ చేరువయ్యేలా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల‌న్నదే నా తాప‌త్ర‌యం.

 

‘ఓ బేబీ’లాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి ?

 

అవును. పైగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అంటే.. ఎక్కువుగా హారర్ అండ్ థ్రిల్ల‌ర్ మూవీసో, లేదా ఏ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలో వస్తాయి. కానీ ఇలాంటి సినిమా మాత్రం రావడం అరుదే. అయితే.. ‘ఓ బేబీ’లో మాత్రం అద్భుతమైన మెసేజ్ తో పాటు కామెడీ, సెంటిమెంట్.. ఇలా అన్నీ క‌మ‌ర్షియ‌ల్‌ ఎలిమెంట్స్ ఉన్నాయి.

 

‘మిస్ గ్రాని’నే ఎందుకు రీమేక్ చేయాలనిపించింది ?

 

మామూల సినిమాలను రీమేక్‌ చేయ‌డం వేరు, ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌డం వేరు. ఈ సినిమాలో అంత గొప్ప ఎమోషన్ ఉంటుంది. పైగా కొరియన్ మూవీని మన తెలుగు వాళ్ళు ఎక్కువమంది చూసి ఉండరు. ఇంత మంచి కథను అందరితో పంచుకోవాలనిపిచింది. పైగా మనందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. అందుకే చాలా జాగ్ర‌త్త‌గా రీమేక్ చేశాం.

 

సినిమాలో మీరు 60 ఏళ్ల బామ్మ‌గా నటించారు. మరి బామ్మగా నటించడానికి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు ?

 

ఈ సినిమా షూట్ చేయడానికి ముందే నేను కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్‌ ల‌కు వెళ్లాను. అక్కడి పెద్దవాళ్ళతో ప్రత్యేకంగా కొంత స‌మ‌యం గ‌డిపాను. వాళ్ళ హావభావాలతో పాటు.. వారి ఆలోచనలను కూడా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆశ్చర్యంగా వాళ్ళు వ‌య‌సు పెరిగే కొద్దీ.. చిన్న‌పిల్ల‌లై పోతున్నారు. అది నిజంగా నాకు కొత్త విషయమే. ఎందుకంటే.. నేను అమ్మ‌మ్మ‌, నాన్న‌మ్మ‌లతో పెరగలేదు. అందుకే ఆ వయసు వాళ్ళ ఆలోచనల పై నాకు ఈ సినిమాకి ముందు పెద్దగా అవగాహన లేదు. ఈ సినిమా తరువాతే తెలిసాయి.

 

నందినిరెడ్డి దర్శకత్వంలో నటించారు. ఓ లేడీ డైర‌క్ష‌న్ లో నటించడం ఎలా అనిపించింది?

 

నందినిరెడ్డి నాకు చాల సంవత్సరాలుగా బాగా తెలుసు. ఆమె కూడా ‘ఓ బేబీ’ లాంటి వ్యక్తే. ఎప్పుడూ ఎంతో ప్యూర్ హార్ట్ తో ఉంటుంది. లేడీ డైర‌క్ష‌న్ విషయానికి వస్తే.. క‌నీసం భ‌విష్య‌త్తులోనైనా ఇలాంటి జండ‌ర్ తేడాలు రాకూడదు అను కోరుకుంటున్నా. ఈ సినిమాకి నందినిరెడ్డి చాలా జెన్యూన్‌ గా వర్క్ చేసింది. చాలా బాగా చేసింది.

 

‘దేవి థియేట‌ర్’ ముందు మీకు అతి పెద్ద కటౌట్ పెట్టారు. ఆ కటౌట్ గురించి తెలిసినప్పుడు మీకెలా అనిపించింది ?

 

క‌టౌట్ల‌ది ఏముంది అండి. సినిమాకి క‌లెక్ష‌న్లు రావాలి. ఇంతకు ముందు నేను చేసిన ‘యు ట‌ర్న్’ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. అందరూ సినిమా చాలా బాగుందని చెప్పారు. మేము కూడా సినిమా సూపర్ హిట్ అనుకున్నాం. అయితే ఆ సినిమాకి అనుకున్నంతగా క‌లెక్ష‌న్లు రాలేదు. అందుకే ఈ సినిమాకైనా భారీగా క‌లెక్ష‌న్లు రావాలి.

 

‘ఓ బేబీ’లో మీరు బాగా క‌ష్ట‌ప‌డి చేసిన సీన్ ఏమిటి ?

 

క‌ష్ట‌ప‌డి చేసిన సీన్ అంటే.. క్లైమాక్సే. ఎందుకో క్లైమాక్స్ లో నేను చాలా క‌ష్ట‌ప‌డి చేశాననే ఫీలింగ్ నాకే వచ్చింది. నిజానికి నేను ఎమోష‌న‌ల్ సీన్స్ .. ఈజీగా చేస్తాను. అయితే ఈ సినిమా క్లైమాక్స్ చేస్తునప్పుడు మాత్రం చెయ్యలేకపోయాను. చివరకి రెండు గంట‌లు బ్రేక్ తీసుకుని ఆ సీన్ చేశాను.

 

‘ఓ బేబీ’ బాగా సక్సెస్ అయి.. భారీ కలెక్షన్స్ సాధించాలని కోరుకుంటున్నాం.

 

థాంక్యూ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు