
సంపూర్ణేష్ బాబు.. ఒకప్పుడు సోషల్ మీడియాలో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు ఏకంగా సినీ పరిశ్రమలోనే అందరికీ సుపరిచితమైన పేరు. ‘హృదయకాలేయం’ లాంటి ఒక హిట్ సినిమా తర్వాత సంపూర్ణేశ్కు హీరోగా వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం ఆయన ‘కొబ్బరి మట్ట’, ‘సింగమ్ 123’ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. వీటితో పాటు ఇప్పటికే చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఒక్క యాక్టింగ్తో మాత్రమే సరిపోదని అనుకున్నారో ఏమో ఇప్పుడు ఓ పాట కూడా పాడారు. ఇక ఈ పాటతో సింగింగ్ బాట పట్టిన సినీ హీరోల్లో ఒకరుగా చేరిపోయారు.
కొబ్బరి మట్ట సినిమాకు గాను సంపూ ఈ పాట పాడారు. ‘ఎపుడూ వెలిగే దీపం..’ అంటూ ఈ పాట సాగనుందని తెలుస్తోంది. ఈ పాటను ఈ బుధవారం రోజున విడుదల చేస్తున్నారు. తాను మొదటి సారి పాట పాడిన విషయాన్ని ఆయన తన ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేసి తెలియజేశారు. కొబ్బరి మట్ట షూటింగ్ ఇప్పటికే పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. ఇక మంచు విష్ణు నిర్మిస్తున్న ‘సింగమ్ 123’లో సంపూ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

