లెజెండరీ విలన్ భార్య ఇక లేరు !

లెజెండరీ విలన్ భార్య ఇక లేరు !

Published on Sep 21, 2020 4:01 PM IST

ప్రముఖ కన్నడ సినీనటి సీత గారు ఇకలేరు. దేవదాసు, మాయా బజార్ లాంటి ఎన్నో వందల చిత్రాలలో నటించిన సీతగారు విలన్ నాగ భూషణం గారి సతీమణి కావడం విశేషం. ఆమె వయసు 87 సంవత్సరాలు, వయసు మీద పడటంతో సీత గారు గత కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టం అవ్వడంతో వారి ఇంట్లోనే ఆమె కన్నుమూశారు. మహా ప్రస్థానం లో అంత్యక్రియలు ముగిసాయి.

బాల్యంనుంచే నృత్యాలపట్ల మక్కువ పెంచుకుని అభ్యాసన మొదలెట్టారు. 1946లో కెవి రెడ్డి తొలిసారి దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ రూపొందించిన ‘యోగి వేమన’లో బాలనటిగా కనిపించారు. అలా సీత -కథానాయిక చెల్లిగా కెవి రెడ్డి మనసులో ఉండిపోయింది. అప్పటి నుంచి ఆయన రూపొందించిన అనేక చిత్రాల్లో సీతకు పాత్ర లేకుండా లేదు. మంచి పాత్రలిస్తూ ప్రోత్సహించారు. హాస్యతారగా సరికొత్త మేనరిజమ్స్‌తో సీత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కెవి రెడ్డి రూపొందించిన మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు తదితర చిత్రాల్లో హాస్యపాత్రలు, చెలికత్తె పాత్రలు ధరించారు. అప్పట్లో హాస్య పాత్రధారిణులు ముగ్గురుండేవారు. వారిలో కనకం, సురభి బాలసరస్వతితో పాటు సీత ఎక్కువ చిత్రాల్లో కనిపించారు. 1940 నుండి ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం, 2002లో ‘నేనేరా పోలీస్’ వరకూ సాగింది. దాదాపు 250 చిత్రాల్లో నటించారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే నటుడు నాగభూషణంతో కలిసి రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి లాంటి నాటకాలు దాదాపు 2వేల ప్రదర్శనలిచ్చారు. ముఖ్యంగా నెలలో వారంపాటు వివిధ పట్టణాల్లో రోజుకొక నాటిక ప్రదర్శించేవారు.

నాటకరంగం ఒకవైపు, సినిమారంగం మరోవైపు రెండు కళ్లుగా నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. లవంగి, జయసింహ, పల్లెటూరిపిల్ల, గుణసుందరి కథ, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి, భానుమతి నటించిన గృహప్రవేశం, సతీతులసి, అత్తా ఒకింటి కోడలే, ఋష్యశృంగ, సత్యహరిశ్చంద్ర, సంతోషిమాతవ్రతం, దేవదాసు,మాయాబజార్ వంటి గొప్ప చిత్రాల్లోనటించి తన ప్రతిభ చాటారు. టీవీలో తొలి సీరియల్ ఋతురాగాల్లోనూ నటించి, తరువాత అనేక చానల్స్‌లో ధారావాహికలలో నటించి పేరు తెచ్చుకున్నారు. రక్తకన్నీరు నాటకం అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రదర్శించే సమయంలో నటుడు నాగభూషణాన్ని 1956లో వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక దాదాపు కుటుంబానికే పరిమితమయ్యారు. కూతురు భువనేశ్వరి, కొడుకు సరేందర్. పక్కింటి అమ్మాయి చిత్రంలో అంజలి స్నేహితురాలిగా నటించారు.

తెలుగు పరిశ్రమలో సీనియర్ నటిగా సీతగారుదాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 1956 నుంచి పలు తెలుగు సినిమాల్లో నటించిన సితగారు నాగ భూషణం గారి సతీమణిగా అందరికి సుపరిచితులు. పలువురు తెలుగు సినీ సీనియర్ నటులు సీతగారికి నివాళులు అర్పించారు. 123తెలుగు.కామ్ తరఫున సీత గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు