‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ ఇకలేరు !
Published on May 31, 2017 12:53 pm IST


తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థాన్నాన్ని ఏర్పర్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయణరావుగారు. తనకెన్ని పురస్కారాలున్నా పరిశ్రమ ఇచ్చిన దర్శకరత్న బిరుదుతోనే తన ఉనికి సార్థకమైందని పలు సందర్భాల్లో చెప్పుకున్న దాసరి వాస్తవానికి దర్శకరత్న అనే బిరుదుకే తెచ్చారు. కేవలం తన పనేదో తాను చూసుకుపోయే సగటు మంచివాడిగా కాకుండా పరిశ్రమలోని ప్రతి ఒక్కరి కష్టాన్ని తన కష్టంగా భావించి చేతనైన సహాయం చేసి చివరి క్షణం వరకు మహోన్నతుడిగానే బ్రతికారాయన.

తెలుగు సినిమాకు సామాజిక అంశాలనే కమర్షియల్ అంశాలుగా అలంకరించి ఏకధాటిగా 151 సినిమాల్ని డైరెక్ట్ చేసిన దర్శక దిగ్గజం ఆయన. ప్రతిభ చూపడం మాత్రమే కాదు ప్రతిభ ఉన్నవారిని గుర్తించి ప్రోత్సహించడం కూడా ఒక గొప్పతనమే అని నిరూపించిన మహా మనిషి దాసరి. ఒక్కసారి ఆయన జీవితంలోకి తొంగిచూస్తే వ్యక్తిగతం, వృత్తిపరం అనే విడివిడి అధ్యాయాలు కనిపించవు. అంతా ఒకటే అధ్యాయం.. అదే సినీ ఆధ్యాయం.

నాటకమే తొలి అడుగు :

1942 మే 4న పాలకొల్లులోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన తోమిదేళ్ళ వయసు నుండే నాటకాలు రాయడం, వాటికి దర్శకత్వం వహించడం, వాటిలో నటించడం వంటివి చేస్తూ కళే జీవితంగా పెరిగారు. చదువుకునే వయసులో ఫీజులకు, పుస్తకాలకు లేక వండ్రంగి పని, అరటికాయలు అమ్మడం వంటివి చేస్తూ, ఇతరుల సహాయాన్ని పొందుతూ డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత హైదరాబాద్లో కొంతకాలం పనిచేసినా అటుపై మద్రాసు వెళ్లి రచయితగా సినీ ప్రస్థానాన్ని ఆరంభించారు. కేవలం రచయితగానే కాకుండా దర్శకుడిగా, నటుడిగా కూడా రాణించి 24 శాఖల్లో ప్రావీణ్యత సంపాదించి దర్శకుడంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని నిరూపించారు.

తొలి సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు :

దర్శకుడిగా తొలిచిత్రం ‘తాతా-మనవడు’ ను ఎస్వీ రంగారావుతో తీశారు. అప్పట్లో ప్రముఖ నిర్మాత అయిన రాఘవ నిర్మించిన ఈ చిత్రం ఏకధాటిగా 350 రోజులాడి పరిశ్రమే స్వయంగా వచ్చి దాసరికి పరిచయం అయ్యేలా చేసింది. ఆ తర్వాత ఆయన చేసిన ‘సంసారం సాగరం, బంట్రోతు భార్య, బలి పీఠం, స్వర్గం-నరకం’ వంటి చిత్రాలు వరుస హిట్లుగా నిలవడంతో ఇక వెనక్కి తిరిగి చూడలేదు దాసరి. ఎన్టీఆర్ తో ‘సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, మనుషులంతా ఒక్కటే’ లాంటి అద్భుత సినిమాలని తీసిన ఆయన ఏఎన్నార్ తో ‘ ప్రేమాభిషేకం, మేఘ సందేశం’ వంటి సినిమాలతో పాటు స్త్రీ పక్షపాతిగా ‘అమ్మ రాజీనామా, శివరంజని, ఒసేయ్ రాములమ్మ’ వంటి చిత్రాలని రూపొందించి మహిళా లోకపు ఆత్మీయతను సొంతం చేసుకున్నారు.

తనతో పాటే నలుగురు :

వరుస విజయాలు దక్కుతున్నా ఏనాడు గర్వానికి పోకుండా సామాన్యుడిగానే ఉంటూ తాను ఎదుగుతూనే పరిశ్రమను కూడా ఎదిగేలా చేయాలని, దారిలో కనిపించే ప్రతి ఒక్కరికి చేయందించాలనేది దాసరి మనస్తత్వం. ఆ గొప్ప తత్త్వం వలనే మనకు మోహన్ బాబు, నారాయణమూర్తి, జయసుధ, జయప్రద, మురళీ మోహన్, మాధవి వంటి ఆణిముత్యాల్లాంటి నటీనటులు దొరికారు. ఇంకా ఆయన ప్రోత్సాహంతో దర్శకత్వ, రచన, సంగీతం వంటి శాఖల్లో కూడా ఎంతోమంది శిష్యులు తయారయ్యారు.

రాజకీయ రంగంలో ప్రత్యేకత :

ఆరంభం నుండే సామాజిక స్పృహ ఎక్కువగా ఉండే దాసరికి రాజకీయాలంటే అమితాసక్తి ఉండేది. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీసుకురావడనికి విశేష కృషి చేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా భాద్యతలను నిర్వర్తించి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

లెక్కకు మించిన అవార్డులు :

దర్శకుడిగా ఆయన చేసిన తొలి సినిమా ‘తాతా-మనవడు’ నంది అవార్డును అందుకోగా 1982లో వచ్చిన ‘మేఘసందేశం’ జాతీయ అవార్డును, 1998లో వచ్చిన ‘కంటే కూతుర్నే కను’ సినిమా సోయేషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాయి. అలాగే ‘గోరింటాకు, ప్రేమాభిషేకం’ సినిమాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. అంతేగాక ‘మేఘసందేశం’ చిత్రం కేన్స్, మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శితమైంది. 9 నంది, రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ వంటి పురస్కారాల్ని కూడా దాసరి అందుకున్నారు.

ఇన్నేళ్లు తెలుగు పరిశ్రమకు ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ గా వ్యవహరించిన దర్శకరత్న దాసరి నారాయణరావుగారు వ్యక్తి స్థాయి నుండి వ్యవస్థ స్థాయికి ఎదిగి బ్రతికున్నంత వరకు సినిమాని ప్రేమించి, సినిమా చేత ప్రేమించబడి, తెలుగు చిత్ర సీమలో దాసరికి ముందు, దాసరికి తర్వాత అనేలా ఒక ప్రత్యేకాధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించి చివరకు నిన్న మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో అశేషాభిమాన లోకాన్ని శోక సంద్రంలో ముంచి ఇక సెలవంటూ దివికేగిపోయారు.

 
Like us on Facebook