
సగటు సినీ అభిమాని, వరుస సినిమాలతో సినిమా లోకంలో విహరించే రోజులు రానే వచ్చాయి. ఈసారి ఉగాదికి ఒకరోజు ముందునుంచే వేసవి సినిమా పండుగ మొదలవనుంది. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక సినిమాలు కూడా ఈ పండుగ సమయంలోనే రానుండడం విశేషంగా కనిపిస్తోంది. ముందుగా ఈనెల 20న వారాహి చలన చిత్రం ద్వారా వస్తున్న ‘తుంగభద్ర’తో ఈ పండుగ కళ మొదలవనుంది. ఇక ఆ తరువాతి రోజైన (మార్చి 21) ఉగాదిన, నాని నటించిన రెండు సినిమాలు ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘జెండాపై కపిరాజు’ విడుదల కానున్నాయి. ఇక ఈ మూడు సినిమాల తర్వాత మార్చి 27న ‘రేయ్’ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మార్చి నెలతో సినిమా పండుగకు కేవలం ట్రైలర్‌ను చూపించనున్న సినిమాలు ఏప్రిల్‌లో ఏకంగా సినిమా చూపించేందుకే సిద్ధమయ్యాయ్.
ఏప్రిల్ 2న భారీ అంచనాల మధ్య త్రివిక్రమ్, అల్లు అర్జున్‌ల సనాఫ్ సత్యమూర్తి విడుదల కానుంది. ఈ సినిమాను సమ్మర్‌లో వచ్చే మొదటి బిగ్ బడ్జెట్ మూవీగా చెప్పుకోవచ్చు. ఇక మణిరత్నం తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన ఓకే కన్మణి (తెలుగులో ఓకే బంగారం) ఏప్రిల్ 17న విడుదల కానుంది. అదేవిధంగా గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రుద్రమదేవి’, ఏప్రిల్ 23న కానీ, 24న కానీ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సందీప్ కిషన్ ‘టైగర్’ మే నెలలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ సినిమాను మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశముంది.ఇక ఇవన్నీ ఒక ఎత్తు కాగా, తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే సినిమాగా చెప్పబడుతున్న ‘బాహుబలి’ సినిమా మరో ఎత్తు. మే 15న బాహుబలి విడుదలవనున్న సంగతి తెలిసిందే! ఇన్ని సినిమాలు ఒకేసారిలా వచ్చిపడితే సినీ అభిమానికి పండగే కదూ!!

