వివాదంలో “క్రేజీ అంకుల్స్” మూవీ..!

Published on Aug 18, 2021 10:34 pm IST

బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్‌’ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ట్రైలర్‌లో మహిళలను కించపరిచేలా డైలాగ్‌లు ఉన్నాయని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రేపు విడుదల కానున్న ఈ సినిమాను అడ్డుకోవాలంటూ ఆందోళనకు పిలుపునిచ్చాయి. నేడు సోమాజిగూడా ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ మహిళ హక్కుల వేదిక అధ్యక్ష కార్యదర్శులు రేఖ, రత్నాలు మాట్లాడుతూ క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్‌లోనే మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు, మహిళలను ఆట వస్తువుగా చూపిస్తూ, అసభ్య పద జాలంతో కూడిన సినిమా రూపొందించడం సరికాదని అన్నారు.

ఈ సినిమా ట్రైలర్‌లోనే అంత అసభ్యత ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించవచ్చని, గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయని, కేవలం డబ్బు సంపాదన కోసమే యావత్ మహిళ జాతిని కించపర్చడం అన్యాయమని వారు అన్నారు. యావత్ మహిళ లోకానికి ఈ సినిమా నిర్మాత, దర్శకులు, నటీనటులు బహిరంగ క్షమాపణ చెప్పి సినిమా విడుదలను నిలిపివేయాలని హెచ్చరించారు.అయితే రేపే ఈ సినిమా విడుదల కానుండడంతో మహిళా సంఘాల డిమాండ్ మేరకు చిత్ర బృందం సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తారా లేక ఏవైనా సీన్లను తొలగించి సరిపెట్టేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :