ఇంటర్వ్యూ : శ్రీను వైట్ల – ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది !

ఇంటర్వ్యూ : శ్రీను వైట్ల – ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది !

Published on Nov 13, 2018 4:35 PM IST

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. కాగా ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటించగా.. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం నవంబర్ 16న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం..

ఈ సినిమా గురించి చెప్పండి. అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా పట్టాలెక్కింది ?

మిస్టర్ సినిమా రిజల్ట్ తరువాత నేను కొంత గ్యాప్ తీసుకున్నాను. ఆ తరువాత సినిమా చెయ్యాలి అనుకున్నపుడు.. ఈ సారి అటెంప్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని దాదాపు ఎనిమిది నెలలపాటు కొత్త రచయితల సహకారంతో ఈ స్క్రిప్ట్ ని తయారుచేశాను. స్క్రిప్ట్ విషయంలో పూర్తి సంతృప్తి కలిగాక రవితేజకు తీసుకువెళ్ళి చెబితే.. తను పాయింట్ విన్న వెంటనే చాలా ఇష్టపడ్డాడు. ఆలా ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. నవంబర్ 16న సినిమా విడుదల కాబోతుంది.

ట్రైలర్ చూస్తుంటే రివెంజ్ సినిమాలా అనిపిస్తోంది. మరి రవితేజాతోనే ఈ సినిమా తియ్యటానికి గల కారణాలు ఎమన్నా ఉన్నాయా ?

నా క్లోజ్ ఫ్రెండ్స్ లో రవితేజ నాకు ఇంకా సన్నిహిత మిత్రుడు అని చెప్పొచ్చు. తనతో పని చెయ్యడం నాకు చాలా ఈజీగా ఉంటుంది. అయినా నేను ఈ కథను రాస్తున్నప్పుడే.. నేను మనసులో రవితేజాని ఊహించుకునే రాశాను. ఇక ఈ సినిమాకి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అని పేరు పెట్టడానికి కూడా చాలా బలమైన రీజన్ ఉంటుంది. అన్నిటికీ మించి నేను కథ చెప్పగానే తను కథ విన్న వెంటనే ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా ‘ఇలియానా’ను తీసుకోవటం అనేది పూర్తిగా మీ ఛాయిసేనా ?

అవును, అది పూర్తిగా నా ఛాయిసే. ఈ పాత్రకు ఇలియానా అయితేనే బాగుంటుందని నాకనిపించింది. నిజానికి తనని దృష్టిలో పెట్టుకొనే హీరోయిన్ పాత్రను డిజైన్ చేశాను. కానీ ఫస్ట్ తనతో కుదరలేదు. బట్, చివరకి తనే ఈ రోల్ చేసింది. తనతో పాటు తన రోల్ కూడా ఈ సినిమాకే ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో కలిసి పని చెయ్యడం ఎలా అనిపించింది ?

ఈ చిత్రానికి కొంచెం బాగానే బడ్జెట్ అయింది. దాంతో పాటు సినిమాలో కీలక సన్నివేశాలు యుఎస్ లో జరుగుతాయి. ఒక విధంగా మైత్రి మూవీ మేకర్స్ కాబట్టే మేం చాలా కంఫర్ట్ బుల్ గా యుఎస్ లో షూట్ చేయగలిగాం. మైత్రి మూవీ మేకర్స్ తో పని చెయ్యడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

మీ ఫెయిల్యూర్స్ నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

ఎవరి జర్నీలో అయిన ఫెయిల్యూర్స్ చాలా కామన్. కానీ నా ఫెయిల్యూర్స్ మాత్రం నన్ను ఇంకా బాగా స్ట్రాంగ్ చేశాయి. అందుకే ఎంతో కేర్ తీసుకోని అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ఆలోచించి ఓ మంచి చిత్రంతో.. మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను చాలా నమ్మకంగా చెప్పగలను.

మీ తదుపరి ప్రాజెక్టులు గురించి చెప్పండి ?

‘తదుపరి’ (నవ్వుతూ) గురించి ఇంకా ఏం ఆలోచించలేదండి. ప్రస్తుతం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి.. తరువాత ఏమి చేయాలో.. ఎలాంటి సినిమా చేయాలో ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు