మానవతావాదాన్ని చాటుకున్న సందీప్ కిషన్

Published on May 4, 2021 3:00 pm IST

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉంది. హాస్పిటళ్లల్లో బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడ మానవతావాద దృక్పథంతో స్పందించాల్సిన సమయం ఇది. అందుకే సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. మొదటి వేవ్ సమయంలో విరాళాలు, సేవా కార్యక్రమాలతో తమ వంతు సహాయం అందించిన సెలబ్రిటీలు మరోసారి నడుం బిగిస్తున్నారు.

పలు నిర్మాణ సంస్థలు, స్టార్లు కోవిడ్ ఆసుపత్రులు, ఆక్సిజన్, మెడిసిన్స్ లభ్యత గురించి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందిస్తుండగా యంగ్ హీరో సందీప్ కిషన్ ఇంకో అడుగు ముందుకేశారు. కరోనా కారణంగా చిన్నారులు ఎవరైనా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు అయ్యుంటే వారిని చేరదీయాలని నిర్ణయించుకున్నారు. ‘అనాథలైన పిల్లల బాధ్యతలను నేను, నా టీమ్‌ తీసుకుంటాం. వారిని జాగ్రత్తగా చూసుకుంటాం. రెండేళ్లపాటు వారికి తిండి, చదువు, అవసరమైన వసతులు వాటినన్నింటిని సమకూర్చేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ కష్టకాలంలో అందరం ఒకరికొకరం అండగా నిలబడాలి. అనాథలుగా మారిన పిల్లల వివరాలను sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయండి’ అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో సందీప్ కిషన్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం.

సంబంధిత సమాచారం :