జీరో గ్రావిటీలో ట్రైనింగ్ తీసుకోనున్న వరుణ్ తేజ్ !


నిన్న 10వ తేదీన రిలీజైన ‘తొలిప్రేమ’ చిత్రంతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న వరుణ్ తేజ్ త్వరలో మరొక విభిన్నమైన చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. ‘ఘాజి’ చిత్రంతో జాతీయస్థాయి గుర్తింపు పొందిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్టక్ చేయనున్నాడు. ఈ చిత్రం పూర్తిగా అంతరిక్షం నైపథ్యంలో ఉండనుంది.

ఈ భారీ ప్రాజెక్టును ‘కంచె’ నిర్మాత రాజీవ్ రెడ్డి నిర్మించనుండగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సహా నిర్మాతగా, సమర్పకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ అంతరిక్ష వ్యామగామిగా కనిపించనున్నాడు. సినిమాలో ఎక్కువ సన్నివేశాలు జీరో గ్రావిటీలో షూట్ చేయాల్సి ఉండటంతో వరుణ్ కృత్రిమ జీరో గ్రావిటీ వాతావరణంలో శిక్షణ తీసుకునేందుకు ఖజకిస్థాన్ వెళ్లనున్నట్లు రాజీవ్ రెడ్డి మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇకపోతే ఏప్రిల్ నుండి మొదలుకానున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. త్వరలో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టుకోనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరులో విడుదల చేయాలని భావిస్తున్నట్టు రాజీవ్ రెడ్డి సదరు మీడియాతో అన్నారు.