సమీక్ష : విచారణ – కథాంశం మెప్పించినా.. సినిమా మెప్పించదు !

Published on Feb 9, 2019 2:19 am IST
Vicharana movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 08, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : దినేష్, ఆనంది, కిషోర్, ఆదుకాలం మురుగదాస్, సముద్రఖని, అజయ్ ఘోష్ తదితరులు.

దర్శకత్వం : వెట్రిమారన్

నిర్మాత : కల్పనా చిత్ర

సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫర్ : ఎస్.రామలింగం

ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం..”విశారణై”. కాగా “ఉత్తమ ప్రాంతీయ చిత్రం”గా జాతీయ అవార్డు అందుకున్న ఈ చిత్రం “విచారణ” పేరుతో “ది క్రైమ్” అనే ట్యాగ్ లైన్ తో తెలుగులో ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నలుగురు అమాయకులైన కుర్రాళ్ళు (దినేష్, ఆనంది, కిషోర్, మురుగదాస్) ఆంధ్ర నుండి జీవనోపాధి కోసం తమిళనాడుకు వలస వెళ్తారు. అయితే పోలీసుల స్వార్ధ పూరిత కారణాలతో ఆ కుర్రాళ్లను తమిళ్ నాడు పోలీసులు పట్టుకుని చిత్రహింసలు పెడతారు. వాళ్లు చేయని తప్పుని ఒప్పుకోమని పోలీసులు చావబాదుతారు.

ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఓ ఆంధ్ర పోలీస్ ద్వారా ఆ కుర్రాళ్ళు తమిళనాడు పోలీసులకు నుండి తప్పించుకుంటారు. ఆ తరువాత అమాయకులైన ఆ కుర్రాళ్లు మళ్ళీ మరో కేసులో ఎలా ఇరుక్కున్నారు ? దాంతో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి ? చివరకి ఆ కుర్రాళ్ళు ఏమైపోయారు ? లాంటి లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

ఓ ఆటో డ్రైవర్ జీవితంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలోని మెసేజ్ ప్రేక్షకుల మనసును కదిలిస్తోంది. పోలీసుల్లో కొంతమంది పోలీసులు ప్రవర్తన, పై అధికారుల ఒత్తిడికితో వాళ్ళు అమాయకులను ఎలా టార్చర్ పెడతారనే అంశాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు. ఇక సినిమాలో అమాయికులైన కుర్రాళ్ళుగా నటించిన నటులు కూడా చాలా సహజమైన నటనతో.. చాలా బాగా నటించారు.

వాస్తవిక కథతో పాటు కథనం కూడా చాలా వాస్తవంగా సాగడంతో సినిమా పై ఆసక్తి పెరుగుతుంది. ఏ తప్పు చెయ్యనివారిని పోలీసులు హింసించే సన్నివేశాలు కూడా చాలా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి.

ఇక కీలక పాత్రల్లో నటించిన సముద్రఖని, అజయ్ ఘోష్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. క్రూరత్వమైన ఆలోచనలు ఉన్న పోలీస్ గా అజయ్ ఘోష్ తన నటనతో మెప్పించగా.. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఎమోషనల్ పాత్రలో సముద్రఖని అద్భుతంగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

మనసును కదిలించే మెసేజ్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో స్క్రీన్ ప్లే చాలా స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

ముఖ్యంగా దర్శకుడు కథనాన్ని పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను పర్వాలేదనిపించిన్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాలను స్లోగా నడుపుతూ విసుగు తెపిస్తాడు.

సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, నలుగురు కుర్రాళ్ళు ఎలాంటి కష్టాల్లో పడతారో, అసలు వాళ్ళు పోలీసులు నుండి ఎలా తప్పించుకుంటారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా సినిమాని నడపలేదు. ఇక సినిమా ఫస్టాఫ్ కథనం కూడ సాదా సీదాగానే గడిచిపోగా సెకెండ్ హాఫ్ కథనం మరింత నెమ్మదిగా సాగుతుంది.

 

సాంకేతిక విభాగం :

మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి.

సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం బాగుంది. ఎస్.రామలింగం సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతలను అభినందించాలి.

 

తీర్పు:

ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నా… పూర్తి స్థాయిలో సినిమా ఆసక్తికరంగా సాగలేదు. దర్శకుడు కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను తగ్గట్లు ఇంట్రస్టింగ్ కథాకథనాలను రాసుకోలేదు. పైగా బాగా కథనం స్లోగా సాగడం, అమాయికులైన కుర్రాళ్ల పై పోలీసులు పెట్టాలనుకున్న కేసులకు సంబంధించి బలమైన కారణాలను అంతే బలంగా చూపించపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

అయితే సినమాలో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుపోతాయి. మొత్తం మీద ఈ చిత్రం ఇలాంటి చిత్రాలను ఇష్టబడే వారికి బాగా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

 

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :