సమీక్ష : విజయ్ సేతుపతి – రొటీన్ గా వుండే సేతుపతి  

Published on Nov 16, 2019 3:01 am IST

విడుదల తేదీ : నవంబర్ 15, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేత పెతురాజ్, నాజర్ , రవి కిషన్

దర్శకత్వం : విజయ్ చందర్

నిర్మాత‌లు : రావూరి వి శ్రీనివాస్

సంగీతం : వివేక్ – మెర్విన్

సినిమాటోగ్రఫర్ : ఆర్ వెల్ రాజ్

ఎడిటర్: : ప్రవీణ్ కె ఎల్

 

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన “పేట” చిత్రంతో తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయసేతుపతి తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి పరిచయం అయ్యారు.అలాగే ఇటీవలే మెగాస్టార్ నటించిన “సైరా”తో మరింత సుపరిచితం అయ్యారు.తన నటనతో విలక్షణ నటునిగా గుర్తింపు తెచ్చుకొని ఇటు తెలుగులో కూడా మంచి స్పందనను సొంతం చేసుకొని విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన “విజయ్ సేతుపతి” చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మరి ఈ చిత్రం ఏ మేరకు తెలుగు ప్రేక్షకులను మెప్పించిందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

కథలోకి వెళ్లినట్టయితే చరణ్(విజయ్ సేతుపతి)సినిమాల్లో కమెడియన్ గా అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.మరోపక్క రామాపురం అనే ఊరిలో పేరు మోసిన కార్పొరేటర్ (సంజయ్)రవికిషన్ ఓ కాపర్ ఫ్యాక్టరీను తీసుకురావాలని ప్రయత్నించగా ఆ ఊరి ప్రజలు అడ్డు పడతారు.ఇదే ఊరికి చెందిన రైతే విజయ్ సేతుపతి.అయితే ఆ చరణ్ మరియు ఈ విజయ్ సేతుపతిలు ఒక్కరేనా లేక ఇద్దరా??ఎన్నో అనర్ధాలను కలుగ జేసే ఆ ఫ్యాక్టరీను ఆ ఊరిలో రాకుండా ఎవరు ఆపగలిగారు? ఈ కథకు హీరోయిన్ కమలిని(రాశిఖన్నా)కు ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి?అన్నవి తెలియాలంటే ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మొదటి ప్లస్ పాయింట్ ఏమిటంటే నిర్మొహమాటంగా విజయ్ సేతుపతి నటన అనే చెప్పాలి.ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండాఫ్ లో కానీ వచ్చే యాక్షన్ సీన్స్ లో విజయ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ప్రదర్శించారు.చరణ్ మరియు విజయ్ సేతుపతి ఇలా రెండు షేడ్స్ లో విజయ్ నటన ప్రేక్షకులను తప్పక మెప్పిస్తుంది. అంతేకాకుండా కొన్ని కీలకమైన ఎమోషనల్ ఎపిసోడ్స్ లో సేతుపతి నటనా చాతుర్యం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.అలాగే కొన్ని కామెడీ సీన్స్ లో అయితే విజయ్ టైమింగ్ అదిరింది అనే చెప్పాలి.

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కమెడియన్ సూరి మరియు విజయ్ సేతుపతిల మధ్య నడిచే ప్రతీ కామెడీ ట్రాక్ కూడా హిలేరియస్ గా పండింది.ఈ ట్రాక్స్ అన్ని దర్శకుడు చక్కగా రాసుకున్నారు.అలాగే ఫస్టాఫ్ లోని సేతుపతి కుటుంబాన్ని కూడా ఒక విభిన్నమైన కోణంలో చూపిన విధానం కూడా బాగుంటుంది.అలాగే హీరోయిన్ రాశిఖన్నా చిత్రంలో కీలక పాత్ర పోషించింది.నటన పరంగా మరోపక్క గ్లామర్ పరంగా రాశిఖన్నా తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చింది.

అలాగే సెకండ్ హీరోయిన్ నివేత పెతురాజ్ తన పాత్ర చిన్నదే అయినా పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంటారు.అలాగే నెగిటివ్ షేడ్ పాత్రల్లో కార్పొరేట్ బిజినెస్ మాగ్నెట్ గా కనిపించిన రవి కిషన్ మరియు పొలిటిసియన్ గా అషుతోష్ రానా మరియు మరో కీలక పాత్రలో కనిపించిన నాజర్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.అలాగే విజయ్ ను ఎలివేట్ చేసే సీన్స్ లో కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ లో కానీ వివేక్ – మెర్విన్ లు అందించిన నేపథ్య సంగీతం బాగుంది.అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ట్విస్ట్ ఫస్టాఫ్ కు మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుంది.దీనిని దర్శకుడు విజయ్ చందర్ తెరకెక్కించిన విధానం బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

హీరోగా విజయ్ సేతుపతికి ఇది తెలుగులో ఒక ఫుల్ లెంగ్త్ సినిమా కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక కొత్తగా అంటే ఈమధ్య కాలంలోనే తీసిన సినిమాగా అనిపించకపోవచ్చు.హీరోయిన్స్ ఇతర క్యాస్టింగ్ అంతా కూడా బాగా తెలిసిన వారు కొత్త వారు అయినా సరే మొదటిసారి చూసినపుడు మాత్రం ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఒక రీసెంట్ డబ్బింగ్ సినిమా చూస్తున్న అనుభూతి రాకపోవచ్చు.

అలాగే ముందు అంతా మంచి హిలేరియస్ గా మంచి ట్విస్ట్ తో కొనసాగిన ఫస్ట్ హాఫ్ సెకండాఫ్ కు వచ్చేసరికి అంతే స్థాయిలో నిరుత్సాహ పరుస్తుంది.దీనికి కారణం ఈ టైపు స్టోరీ లైన్ తో గతంలో తమిళ్ ”కత్తి” తెలుగులో “ఖైదీ నెం 150”, అలాగే కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ తెలుగులో మనకి బాగా తెల్సిన కొన్ని సినిమాలు కలిపి తీసినట్టుగా సెకండాఫ్ అనిపిస్తుంది.ఈ విషయంలో దర్శకుడు విజయ్ చందర్ కొత్తగా ఆలోచించి తెరకెక్కించి ఉంటే బాగుండేది.అంతే కాకుండా ఫస్ట్ మరియు సెకండాఫ్ లలో సాగదీత కూడా కాస్త ఎక్కువగానే ఉంది.

ఇది అలా వెళ్తున్న సినిమా ఫ్లోను దెబ్బ తీసే అంశంగా మారింది.అలాగే మోస్ట్ పవర్ ఫుల్ కార్పొరేట్ విలన్ గా చూపించిన రవి కిషన్ పాత్రకు చివర్లో సింపుల్ ఎండింగ్ ఇవ్వడం అంతగా ఆకట్టుకోదు.ఫస్టాఫ్ లో హీరోయిన్ రాశి ఖన్నా పాత్రను ఎంతైతే కీలంగా మలిచారో సెకండాఫ్ కి వచ్చేసరికి చాలా సేపటి వరకు పూర్తిగా పక్కన పెట్టేసినట్టు అనిపిస్తుంది.అంతే కాకుండా సెకండాఫ్ లో వచ్చే నివేత పెతురాజ్ కు కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపించదు.అలాగే రొటీన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్,పాటలు మరియు క్లైమాక్స్ కు ఏమంత మెప్పించవు.

 

సాంకేతిక వర్గం :

మొదటగా దర్శకుడు విజయ్ చందర్ కోసం చెప్పుకున్నట్టయితే విజయ్ ఇది వరకే చూసేసిన తీసిన కాన్సెప్టునే హీరోను ఎలివేట్ చేసే సీన్స్ లాంటి మెళుకువలు జోడించే యత్నం బెడిసికొట్టింది.ఓ మాదిరిగా ఫస్ట్ హాఫ్ ను బాగానే నడిపించిన దర్శకుడు రొటీన్ కథాంశంతో సెకండాఫ్ కు వచ్చేసరికి సినిమా సోల్ ను దెబ్బ తీశారు.కేవలం సేతుపతిని ఎలివేట్ చెయ్యడం కొన్ని కీలక ఫ్యామిలీ మరియు కామెడీ ఎపిసోడ్స్ పైనే దృష్టి పెట్టిన దర్శకుడు సినిమాకు అత్యంత కీలకమైన కథ విషయంలో నిర్లక్ష్యం వహించి రొటీన్ అనిపించారు.అలాగే ఆర్ వేల్ రాజ్ అందించిన సినిమాటోగ్రఫీ ఎక్కడ ఎలా ఉండాలో చాలా సహజంగా బాగుంది.

ఇక సంగీత దర్శకులు వివేక్ మరియు మెర్విన్ లు అందించిన పాటలు పర్వాలేదనిపించినా సేతుపతిని ఎలివేట్ చేసే సన్నివేశాల్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది.సినిమా ఫస్ట్ మరియు సెకండాఫ్ లలో అక్కడక్కడా కొన్ని సాగదీతగా ఉండే సీన్లను ఎడిటర్ ప్రవీణ్ కత్తిరించి ఉంటే బాగున్ను.అది మినహాయించి మిగతా ఎడిటింగ్ పర్వాలేదు. ఇకపోతే నిర్మాణ సంస్థ హర్షిత మూవీస్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.అలాగే తెలుగు వెర్షన్ లో విజయ మూవీస్ వారు మంచి అవుట్ ఫుట్ అందించారు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మరియు ఫ్యామిలీ డ్రామా “విజయ్ సేతుపతి” కి తెలుగులో ఊహించదగ్గ ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు.హిలేరియస్ కామెడీ ట్రాక్స్ మరియు కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫస్ట్ హాఫ్ బాగానే నడిపించినా సెకండాఫ్ కు వచ్చేసరికి రొటీన్ కథాంశంతో అక్కడక్కడా సాగదీతతో నిరాశపరిచారు.ఓవరాల్ గా ఈ విజయ్ సేతుపతి మాస్ ఆడియన్స్ కు ఓ మాదిరిగా ఎక్కినా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించుకుంటాడు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :