డైనమిక్ స్టార్, ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు క్రీడారంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టారు. దేశంలో అసాధారణ ప్రతిభ కలిగిన యువ అథ్లెట్లను ఒలింపియన్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, మోహన్ బాబు విశ్వవిద్యాలయం (MBU) మరియు శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ (SVIS)లలో 100% స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌లను ఆయన ప్రకటించారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి రానున్న ఈ స్కాలర్‌షిప్‌ల ద్వారా ఎంపికైన క్రీడాకారులకు పూర్తి ఉచిత విద్య, శిక్షణ లభిస్తాయి. తొలి దశలో క్రికెట్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ విభాగాల్లో ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తూ, క్రీడాకారుల బంగారు భవిష్యత్తుకు విష్ణు మంచు బలమైన పునాది వేశారు.
ఈ ప్రకటనతో ఎంపికైన విద్యార్థులకు విద్యావేత్తలు, ప్రొఫెషనల్ కోచింగ్, పోషకాహారం, శిక్షణ సదుపాయాలు, వసతి సహా పూర్తి మద్దతు అందనుంది. భారతదేశం, విదేశాల నుంచి అగ్రశ్రేణి కోచ్‌లతో శిక్షణ ఇవ్వడం ద్వారా అథ్లెట్లకు ప్రపంచ స్థాయి మార్గదర్శకత్వం కల్పించనున్నారు.
ఈ మిషన్ భారత క్రీడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకున్నదని విష్ణు మంచు తెలిపారు. 2036 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకుని ఎంబియు నుంచి ఒలింపియన్‌లను తయారు చేయాలన్నదే తన ఆశయమని అన్నారు.
ఆర్థిక అడ్డంకులు, మౌలిక సదుపాయాల లోపం వల్ల ప్రతిభావంతులు అవకాశాలు కోల్పోకుండా ఉండేందుకే ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన చెప్పారు. వివరాలకు ఆసక్తిగల అభ్యర్థులు sports@mbu.asia ను సంప్రదించవచ్చు.


