సమీక్ష : ఎఫైర్ – హింసా, రక్తపాతాల జుగుప్సాకర ఎఫైర్..!

సమీక్ష : ఎఫైర్ – హింసా, రక్తపాతాల జుగుప్సాకర ఎఫైర్..!

Published on Nov 28, 2015 3:45 PM IST
Affair-review

విడుదల తేదీ : 27 నవంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

దర్శకత్వం : శ్రీ రాజన్

నిర్మాత : తుమ్మలపల్లి రామసత్యనారాయణ

సంగీతం : శేషు కె.ఎం.ఆర్

నటీనటులు : ప్రశాంతి, గీతాంజలి, శ్రీ రాజన్..


తెలుగులో మొట్టమొదటిసారిగా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడమనే కాన్సెప్ట్‌‌కు థ్రిల్లింగ్ అంశాలను జోడించి తెరకెక్కిన సినిమాగా ప్రచారం పొందిన సినిమా ‘ఎఫైర్‌’. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ రాజన్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి, గీతాంజలి, శ్రీ రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నేడు విడుదలైంది. మరి విడుదలకు ముందు ఒక ప్రత్యేకమైన సినిమాగా ప్రచారం పొందుతూ వచ్చిన ‘ఎఫైర్‌’ ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

సన్నీ (ప్రశాంతి), అలెక్స్ (గీతాంజలి) ఇద్దరు మంచి మిత్రులు. సన్నీ మొదట్నుంచీ తనను తాను ఒక మగవాడన్నట్టుగానే ట్రీట్ చేసుకుంటూ ఉంటుంది. వీరిద్దరి ప్రయాణంలో సన్నీకి అలెక్స్‌పై ప్రేమ కలుగుతుంది. అలెక్స్ మొదట సన్నీ ప్రేమను వ్యతిరేకించినా, ఆ తర్వాత ఆమెకు దగ్గరవుతుంది. ఇక ఒకానొక సందర్భంలో అలెక్స్ ఓ వారం రోజుల పాటు తన తల్లిదండ్రులతో గడిపేందుకు ఒక మారుమూల ప్రాంతంలో అడవిలో ఉండే తమ పెద్ద బంగ్లాకు సన్నీతో పాటు వెళుతుంది.

కాగా అదే అడవిలో సన్నీ, అలెక్స్‌లకు ఓ సైకో ద్వారా అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. తమ కళ్ళ ముందే ఆ సైకో చాలామంది ప్రాణాలను తీసుకుంటాడు. ఈ సైకో నుంచి సన్నీ, అలెక్స్‌లు తప్పించుకున్నారా? వీరిద్దరికి, ఆ సైకోకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే ఎఫైర్.

ప్లస్ పాయింట్స్ :

‘ఎఫైర్’ సినిమాకు చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందీ అంటే అది.. ఇంటర్వెల్ సమయంలో వచ్చే చిన్న ట్విస్ట్, ఇంటర్వెల్ తర్వాత ధన్‌రాజ్ బ్యాచ్ నేపథ్యంలో వచ్చే చిన్న కామెడీ ఎపిసోడ్. అది మినహాయిస్తే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ వెతికినా పెద్దగా దొరకవు.

ప్రధాన తారాగణమైన ప్రశాంతి, గీతాంజలిల నటన బాగానే ఉంది. ప్రశాంతి ఒక విచిత్రమైన క్యారెక్టర్‌లో మంచి నటనే కనబరిచింది. గీతాంజలికి నటించే అవకాశం తక్కువే అయినే ఓకే అనిపించింది. ఇక శ్రీ రాజన్ కొన్నిచోట్ల ఫర్వాలేదనిపించాడు. ఇక ఈ సినిమాలో సైకో చేసే హింసావాదం ఆ తరహా సన్నివేశలను ఇష్టపడే వారికి నచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

సినిమా పరంగా చూసుకుంటే.. ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్ మొదట్లో వచ్చే పదిహేను నిమిషాల బ్లాక్, క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

‘ఎఫైర్’ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ఈ సినిమాకు చేసిన ప్రచారమే! తెలుగులో మొట్టమొదటి ఇద్దరమ్మాయిల ప్రేమకథగా ప్రచారం పొందిన ఈ సినిమాలో అందుకు సంబంధించిన ఎమోషన్‌ను ఎక్కడా చూపించిన దాఖలాలు లేవు. కేవలం ప్రచారాలకే ఈ అంశాన్ని వాడుకొని ఒక నాసిరకం థ్రిల్లర్ సినిమాను బేసిక్ ఎమోషన్ అనేదే లేకుండా తెరకెక్కించిన విధానం చూస్తే దర్శకుడి అభిరుచి తెలిసిపోతుంది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా సినిమాలో ఏ ఒక్క క్యారెక్టర్‌కూ నిర్దిష్టమైన క్యారెక్టరైజేషన్ లేదు. ఏ పాత్ర ఎందుకెలా ప్రవర్తిస్తుందో తెలియదు.

కథ, కథనాల పరంగా ఈ సినిమా మరీ నాసిరకంగా ఉంది. అర్థంపర్థం లేకుండా వరుసగా చంపుకుంటూ పోయే సైకో, దాన్ని జస్టిఫై చేయడానికన్నట్టు ఓ సంఘటన, విపరీతమైన హింస, రక్తపాతం వీటిని బేస్ చేసుకొని అల్లిన అర్థం లేని కథను అంతే అర్థం లేని కథనంతో అతీగతి లేని సినిమాగా ఎఫైర్‌ను నిలబెట్టింది. 101 నిమిషాల నిడివి గల సినిమాలో కట్టిపడేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఒక్కటీ లేక మరీ నిడివి ఎక్కువైపోయిన సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందుగా దర్శకుడు శ్రీ రాజన్ గురించి ప్రస్తావించాలి. శ్రీ రాజన్ చెప్పాలనుకున్న విషయానికి, చెప్తున్న విషయానికి లింక్ ముందే తెంపేసి ఈ సినిమాకు ముందునుంచే ఒక అర్థం లేకుండా చేసేశాడు. కథ, కథనాల విషయంలో శ్రీ రాజన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. దర్శకత్వం పరంగా ధన్‌రాజ్‌తో చేయించిన కామెడీలో దర్శకుడి టైమింగ్ బాగుంది. ఇక ఆ ఒక్క విషయం వదిలేస్తే మరింకెక్కడా శ్రీ రాజన్ దర్శకుడిగా మెప్పించలేకపోయాడు.

శేషు అందించిన మ్యూజిక్ ఫర్వాలేదు. పాటలు ఇంతకుముందు ఎక్కడో విన్నట్టే ఉన్నా, వినడానికి బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో కొత్తదనమన్న మాటే లేదు. థ్రిల్లర్ సినిమా టెంప్లేట్ మ్యూజిక్‌నే వాడేశారు. సినిమాటోగ్రాఫర్ కర్ణా పనితనం ఫర్వాలేదు. లైటింగ్ అన్నదే వాడకుండా సినిమాను న్యాచురల్‌గా తెరకెక్కించే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. సోమేశ్వర్ ఎడిటింగ్ నార్మల్‌గా ఉంది. డైలాగ్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్ డైలాగుల్లా ఈ సినిమా డైలాగ్స్ ఉన్నాయి. తుమ్మల రామసత్యనారాయణ నిర్మాణ విలువల్లో ఓ మోస్తారు నాణ్యత మాత్రమే ఉంది.

తీర్పు :

ప్రతీ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లోకి వెళ్ళాలంటే అందులో ఏదో ఒక అంశం ఆకర్షించేదై లేదా కొత్తదై ఉండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే విడుదలయ్యే ప్రతి సినిమా ప్రచారాల్లో తమ సినిమాలో ఇదీ కొత్తదనం అంటూ, తమ సినిమాలో ఇదీ ఆకర్షించే అంశం అంటూ ముందుకొస్తుంది. ‘ఎఫైర్’ సినిమా, తెలుగులో మొట్టమొదటి ఇద్దరమ్మాయిల ప్రేమకథ అన్న ప్రచారం పొందుతూ మనముందుకు వచ్చింది. అయితే ఏ ప్రచారంతో అయితే ముందుకొచ్చిందో ఆ అంశాన్నే పక్కనపడేసి నాసిరకం హింస, రక్తపాతాలను నమ్ముకున్న సినిమాగా ఎఫైర్ నిలిచింది. కట్టిపడేసే అంశం ఒక్కటీ లేని ఈ సినిమాలో ధన్‌రాజ్ బ్యాచ్ చేసే పదిహేను నిమిషాల కామెడీ తప్ప మరింకేది కూర్చోబెట్టలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయే సినిమాల జాబితాలో నిలిచే ఎ’ఫైర్’ను చూడకపోవడం ద్వారా కోల్పోయేది కానీ, చూసి పొందేది కానీ ఏమీ లేదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు