సమీక్ష : అవును 2 – ‘అవును’ ఫార్ములాతో.. సస్పెన్స్ డ్రామా!

సమీక్ష : అవును 2 – ‘అవును’ ఫార్ములాతో.. సస్పెన్స్ డ్రామా!

Published on Apr 3, 2015 8:00 PM IST
Jil

విడుదల తేదీ : 3 ఏప్రిల్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : రవిబాబు

నిర్మాత : ఫ్లైయింగ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్

సంగీతం : శేఖర్ చంద్ర

నటీనటులు : హర్షవర్ధన్ రానే, పూర్ణ, రవివర్మ తదితరులు…..

విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తాజాగా రూపొందిన సినిమా ‘అవును 2’. 2012లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘అవును’ సినిమాకు రెండో భాగంగా ఈ సినిమా తెరకెక్కింది. హర్షవర్ధన్ రానే, పూర్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్ల ద్వారా ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అవును’లానే ‘అవును 2’ కూడా భయపెట్టిందా? ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకుందా? ఇప్పుడు చూద్దాం.

కథ :

‘అవును 2’ కథ సరిగ్గా అవును సినిమా చివరి షాట్ దగ్గరనుండి మొదలవుతుంది. ‘అవును’ మొదటి భాగంలో హీరోయిన్ మోహిని (పూర్ణ)ను వేధించిన కెప్టెన్ రాజు ప్రేతాత్మ అక్కడితో తమను వదిలి వెళ్ళిపోయిందని హర్ష, మోహినిల జంట భావిస్తుంది. మనశ్శాంతి కోసం ఊరి బయటనున్న తమ ఫ్లాట్ నుండి కొత్తగా సిటీకి దగ్గరలోని మరో ఫ్లాట్‌లోకి మారతారు. వెళ్ళిపోయిందనుకున్న ఆత్మ మళ్ళీ తిరిగి రావడం, మోహిని, హర్షలను మళ్ళీ వేధించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత అతడి భారి నుండి వీరిద్దరూ ఎలా తప్పించుకున్నారు? కాశీకి వెళ్ళినపుడు అక్కడి అఘోరా ఇచ్చిన యంత్రం వీరిని ఎలా కాపాడింది? చివరకు కెప్టెన్ రాజ్ ఏమయ్యాడు? అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు సెకండాఫ్‌ను ప్రధాన బలంగా చెప్పుకోవాలి. సెకండాఫ్‌లోని వేగం సినిమా క్లైమాక్స్ వరకూ కొనసాగుతూ మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. కాశీలో ఒక అఘోరా పూర్ణకు యంత్రం ఇవ్వడంతోనే సినిమాలో అసలైన సస్పెన్స్ ఎలిమెంట్ మొదలవుతుంది. యంత్రాన్ని ధరించినపుడు పూర్ణను ఆత్మ ఏమీ చేయలేకపోవడం, దాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నింటినీ సస్పెన్స్ ఎలిమెంట్స్‌గా జొప్పించి కథను నడిపించడం బాగుంది. సెకండాఫ్‌లో ఈ సస్పెన్స్ ఎలిమెంట్‌ను మరింత ఉత్కంఠకు తీసుకెళ్ళడం సినిమాకు బలమని చెప్పాలి. అవునులో సక్సెస్ అయిన ‘టెక్నాలజీతో భయపెట్టడం’ అనే కాన్సెప్ట్ ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. అవునులో ఆటోమేటిక్ లైటింగ్ సిస్టం ద్వారా భయపెట్టినట్టే, ఇక్కడ ఆటోమేటిక్ మస్కిటో స్ప్రే ద్వారా భయపెట్టే ప్రయత్నం బాగుంది. అవును టెక్నిక్ తెలియని వారిని ఇది చాలా బాగా ఆకట్టుకునే అంశం. సస్పెన్స్ ఎలిమెంట్ ముందే చెప్పి కూడా సినిమా చివరి వరకూ ప్రేక్షకుడికి బోర్ కొట్టించకపోవడం స్క్రీన్‌ప్లే విజయంగా చెప్పుకోవచ్చు. మొదట్నుంచీ అర్థపర్థం లేనట్టుండే ఓ పాత్రను సినిమాలో చూపించి చివరకు గానీ ఆ పాత్ర ఔచిత్యాన్ని భయటపెట్టకపోవడం కూడా సప్సెన్స్‌లో కలిపేయొచ్చు. ‘అవును’ సినిమాను చూడని వారికి కూడా ఏ ఇబ్బందీ లేకుండా సినిమా అర్థం అయ్యేలా ఉండడం ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. అవును చూడనివారు నిరభ్యంతరంగా కొత్త సినిమాలా దీన్ని చూడొచ్చు.

హీరోయిన్ పూర్ణను ఈ సినిమాకు మరో ప్రధాన బలంగా చెప్పుకోవాలి. సినిమా మొదలైనప్పట్నుంచి తన చక్కటి నటన, అందంతో కట్టిపడేస్తుంది. ఫస్టాఫ్‍లో అందంతో, సెకండాఫ్‌లో నటనతో ఆకట్టుకుంటుంది. ఇక హర్షవర్ధన్ రానేకు అవును సినిమాలో కంటే ఇందులో నటించే అవకాశం చాలా దక్కింది. దాన్ని సమర్దవంతంగా పోషించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఫస్టాఫ్ మొత్తంలో విసుగు తెప్పించిన రవివర్మ పాత్ర ప్రీ క్లైమాక్స్‌లో కట్టి పడేస్తుంది. మిగతా నటులంతా తమ పరిధిమేర బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

‘అవును’ సినిమాలోనే విషయమంతా తెలిసిపోయి ఉండడం ఈ సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్. అవును సినిమా ముందే చూసిన వారికి ఈ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ తప్ప హర్రర్ ఎలిమెంట్స్ పెద్దగా కనిపించవు. కథలోని కీ ఎలిమెంట్ మొత్తం మొదటి పావుగంటకే తెలిసిపోవడం మరో మైనస్. మొదటి ఇరవై నిమిషాల నుంచి ప్రీ క్లైమాక్స్ వరకూ ‘అవును’ సినిమానే తిప్పి చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే అవును చూడని వారికి ఈ పార్ట్ ప్లస్ కిందకే వెళ్ళిపోతుంది. ఫస్టాఫ్‌లో కేవలం పూర్ణ అందాల మీదనే శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తోంది. సంజన పాత్ర ఉండి పెద్దగా చేసిందేమీ లేదు. ఆ పాత్రకు మరే ఇతర ఆర్టిస్టు ఉన్నా తేడా ఏమీ ఉండేది కాదు. ప్రీ క్లైమాక్స్‌లో తప్ప నిఖిత పాత్రను పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. సినిమాలో హర్రర్‌ను పక్కనపెట్టి కేవలం సస్పెన్స్ ఎలిమెంట్‌ను మాత్రమే పట్టుకోవడం మైనస్ పాయింట్ అనే చెప్పాలి. అవునుకి కొనసాగింపుగా నడిపిస్తూనే సినిమాలో కొత్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ప్రయత్నించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలు తప్ప ఈ సినిమాలో భయపెట్టే ప్రయత్నం చేసిన చాలా విషయాలు ఎన్నో సినిమాల్లో ఇప్పటికే చూశాం.

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలో అందరికన్నా ఎక్కువ మార్కులు సినిమాటోగ్రాఫర్‌కు దక్కుతాయి. హర్రర్ సినిమాకు కావల్సిన మూడ్‌ను క్రియేట్ చేయడంలో చాలా వరకు సఫలమయ్యారు. లైటింగ్ దగ్గర్నుంచి ఫ్రేమింగ్ వరకూ అన్ని చోట్లా పూర్తి మార్కులు సాధించాడు సినిమాటోగ్రాఫర్. దర్శకుడు రవిబాబు అవును సినిమా ఫీల్‌ను కంటిన్యూ చేయగలిగినా థ్రిల్‌ను మాత్రం మిస్ చేశాడన్న ఫీలింగ్ కలుగుతుంది. కథ పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అవును సినిమాను కొంచెం ముందుకు తీసుకెళ్తే ఏమవుతుందో అన్నదే ఈ సినిమా కథ.

ఇక కథనం కొన్ని చోట్ల బాగున్నా ఓవరాల్‌గా సస్పెన్స్ మాత్రమే క్యారీ చేయగలిగింది. ఈ సస్పెన్స్‌కి తోడు హర్రర్ కూడా తోడయి ఉంటే సినిమా ఎక్కడో ఉండేది. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం సస్పెన్స్‌ను చివరివరకూ నిలపగలిగినా కొన్ని చోట్ల అతి ఎక్కువ అయింది. మార్తాండ్. కె. వెంకటేష్ ఎడిటింగ్‌కు వంకపెట్టలేం. సినిమాను చాలా చోట్ల ఆయనే నిలబెట్టాడు. ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ సినిమాలు తీస్తాడన్న పేరు రవిబాబుకు ఉంది. దాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయనే చెప్పొచ్చు. దర్శకుడి మెరుపులు అవును చూడని వారిని విపరీతంగా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు.

తీర్పు :

అవును సినిమా చూడకపోయినా ఏమాత్రం ఇబ్బందిని కలిగించకపోవడం, చివర వరకూ క్యారీ అయిన సస్పెన్స్, అక్కడక్కడా మెరిపించే కొన్ని సన్నివేశాలు, పూర్ణ అందచందాలు, నటీనటుల పనితీరు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. సస్పెన్స్ తప్ప హర్రర్ లేకపోవడం, ముందే తెలిసిపోయిన కథ, అవును సినిమాను తిప్పి చూపినట్టు అనిపించడం మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. పెద్దగా హర్రర్ ఎలిమెంట్స్ లేకపోయినా సస్పెన్స్ అంశాలను కోరుకునే వారికి బాగా నచ్చే సినిమా ఇది. అయితే అవును సినిమాను చూసి, హర్రర్ కోరుకొని వచ్చిన వారిని సినిమాలో కూర్చోబెట్టగలిగేది కేవలం ఆ సస్పెన్స్ ఎలిమెంట్ మాత్రమే.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు