సమీక్ష – 2 : బాద్ షా – బాక్స్ ఆఫీస్ కా షేర్

విడుదల తేదీ : 05 ఏప్రిల్ 2013
దర్శకుడు : శ్రీను వైట్ల
నిర్మాత : బండ్ల గణేష్
సంగీతం : ఎస్.ఎస్ థమన్
నటీనటులు : ఎన్.టి.ఆర్, కాజల్, బ్రహ్మానందం…

‘దమ్ము’ లాంటి మాస్ ఎంటర్టైనర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ టాప్ టు బాటమ్ తన లుక్ మార్చి చేసిన కామెడీ – యాక్షన్ ఎంటర్టైనర్ ‘బాద్ షా’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. ఎస్.ఎస్ థమన్ అందించిన పాటలు సూపర్ హిట్ అవ్వడం, రిలీజ్ కి ముందే ఇండస్ట్రీలో ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ కి, సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి భారీ అంచనాల నడుమ విడుదలైన ‘బాద్ షా’ సినిమా ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మేరా భారత్ మహాన్’ అనే డైలాగ్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవుతుంది. సాధు భాయ్(కెల్లీ దోర్జీ) గత 20 సంవత్సరాలుగా ఇండియాకి రాకుండా విదేశాల్లో ఉంటూ అండర్ వరల్డ్ మాఫియా ని శాసిస్తూ ఉంటాడు. సౌత్ ఆసియా మొత్తం సాధు భాయ్ కంట్రోల్ లో ఉన్నా ఒక్క హాంకాగ్ ని మాత్రం డాన్ క్రేజీ రాబర్ట్(ఆశిష్ విద్యార్ధి), వయోలెంట్ విక్టర్(ప్రదేప్ రావత్) లు రూల్ చేస్తుంటారు. అలాంటి సమయంలో సాధు భాయ్ కి ఎంతో నమ్మగంగా ఉంటూ తనకి 50% లాభాలను తెచ్చి పెట్టే మాకా కాసినోవాని చూసుకుంటున్న రంజన్(ముఖేష్ రుషి) కొడుకు బాద్ షా(ఎన్.టి.ఆర్) రంగంలోకి దిగి హాంకాంగ్ ని తన కంట్రోల్ లోకి తీసుకుంటాడు. సాధు భాయ్ కింద ఉంటూ తనకే పోటీ ఇస్తూ అంచలంచెలుగా ఎదుగుతున్న బాద్ షా ని, అతని ఫ్యామిలీని అంతం చెయ్యాలని సాదుభాయ్, వయోలెంట్ విక్టర్ తో చేతులు కలుపుతాడు.

అదే సమయంలో ఇండియాలో బాంబ్ బ్లాస్ట్ లు చేసి మారణ హోమం చేసి ఇండియాని ఒక టెర్రరిస్ట్ దేశంగా ముద్ర వేసి కొన్ని వేల కోట్ల లాభాలు ఆర్జించాలని సాధుభాయ్ ప్లాన్ చేస్తాడు. అది తెలుసుకున్న బాద్ షా ఇండియాలో బాంబు బ్లాస్ట్ లు జరగకుండా ఆపాలని నిర్ణయించుకుంటాడు. బాంబ్ బ్లాస్ట్స్ ఆపడం కోసం బాద్ షా జానకి(కాజల్), జై కృష్ణ సింహా(నాజర్), పద్మనాభ సింహా(బ్రహ్మానందం) లను ఎలా ఉపయోగించుకున్నాడు? ఇండియాలో బాంబు బ్లాస్ట్స్ విషయం కాకుండా బాద్ షా కి సాధు భాయ్ కి ఇంకేమన్నా శత్రుత్వం ఉందా? చివరికి విలన్స్ ని బాద్ షా ఎలా అంత మొందించాడు? అనే ఆసక్తికరమైన అంశాలను తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో తన లుక్ మార్చి స్టైలిష్ గా కనపడడమే కాకుండా నటనలో ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఫస్ట్ హాఫ్ లో ఎంతో సీరియస్ గా కనిపించే డాన్ గా, లవర్ బాయ్ గా అలాగే సెకండాఫ్ లో పంచ్ డైలాగ్స్ తో కామెడీని, సెంటిమెంట్ ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా కాజల్, బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణలతో చేసిన ఎపిసోడ్స్ లో ఎన్.టి.ఆర్ హావ భావాలు, పంచ్ డైలాగ్స్ కి అదుర్స్ అనకుండా ఉండలేరు. ఎన్.టి.ఆర్ అంటే అదిరిపోయే డాన్సులు ఉంటాయి, ఇందులో కూడా అన్ని పాటల్లో పాటలకి తగ్గట్టు డాన్సులు అదరగొట్టారు, ముఖ్యంగా ‘రంగోలి రంగోలి’, ‘సైరో సైరో’ పాటల్లో అతని డాన్సులు ఎంతో ఫాస్ట్ గా ఉన్నాయి. కాజల్ అగర్వాల్ సినిమాలో అందంగా కనిపించింది, అలాగే సినిమాలో తను ఉన్నంత సేపూ బంతి అనే ఫిలాసఫీ వాడుకొని కంటిన్యూగా సింగల్ లైన్ పంచ్ డైలాగ్స్ వేస్తూ బాగా నవ్వించింది.

పిల్లి జై కృష్ణ సింహా(నాజర్) ఒక వైపు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా అలాగే, స్ట్రిక్ట్ ఫ్యామిలీ పెద్దగా చాలా బాగా నటించారు. ముఖ్యంగా బ్రహ్మానందంకి అతను చూపించే టార్చర్ సీన్స్ చాలా బాగా చేసారు. పిల్లి పద్మనాభ సింహా పాత్రలో బ్రహ్మానందం సెకండాఫ్ కి ప్రాణం పోశారు. అయన కనిపించే ప్రతి సీన్ లోనూ అతని నటనతో ప్రేక్షకుల్ని పొట్ట పగిలేలా నవ్వించారు. ఒక్కసారిగా తన మనసులో ఉన్న బాధనంతా కోపంగా చేసి నాజర్ పై చూపించే సీన్ లో బ్రహ్మానందం ఆడియన్స్ ని ఓ రేంజ్ లో నవ్వించారు. అలాగే శ్రీను వైట్ల ఎంతో తెలివిగా ‘ఇన్ సెప్చన్’ మూవీలోని ‘లివింగ్ అవుట్ ఎ డ్రీమ్’ అనే కాన్సెప్ట్ కామెడీ కోసం పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. శ్రీను వైట్ల అనుకున్న దానికి బ్రహ్మానందం పూర్తి న్యాయం చేసారు.

సెకండాఫ్ లో వచ్చే పిల్లివారి పెళ్లి సంగీత్ లో నాజర్ భరత నాట్యం, ప్రగతి, సుధ, సురేఖా వాణిలు సీనియర్ ఎన్.టి.ఆర్ సూపర్ హిట్ సాంగ్స్ కి అదిరిపోయేలా డాన్స్ చెయ్యడం, వారికి తోడుగా తారక్ సీనియర్ ఎన్.టి.ఆర్ స్టెప్పులు వేసే ఎపిసోడ్ ఫెంటాస్టిక్ గా వచ్చింది. ఈ ఎపిసోడ్ జరిగేటప్పుడు ఫ్యాన్స్ ఖచ్చితంగా వారి సీట్స్ లో కూర్చొని సినిమా చూడలేరు. ఫస్ట్ హాఫ్ లో డైరెక్టర్ రివెంజ్ నాగేశ్వర రావు పాత్రలో చాలా హార్డ్ గా బిహేవ్ చేసే పాత్రలో ఎం.ఎస్ నారాయణ నటన చాలా బాగుంది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ – కాజల్ – ఎం.ఎస్ నారాయణ మధ్య సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల గురించి వచ్చే సీన్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తుంది. విలన్స్ తో చేతులు కలిపి వృత్తికి ద్రోహం చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నవదీప్ నటన బాగుంది. వెన్నెల కిషోర్, సుహాసిని, నాగబాబు లు పాత్రలకి తగ్గట్టుగా నటించారు.

సిద్దార్థ్ గెస్ట్ రోల్ చేసినా అతని పాత్రే సినిమాకి చాలా కీలకం కావడం చెప్పదగిన విశేషం. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్టైలిష్ గా ఉండడం, సెకండాఫ్ కామెడీ, కలర్ ఫుల్ సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ లతో చాలా వేగంగా ముందుకెళ్ళడంతో ఆడియన్స్ సినిమాలో బాగా లీనమైపోతారు.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా ముందుకెలుతున్న సమయంలో ఇంటర్వల్ ముందు వరుసగా ఫైట్స్ రావడంతో సినిమా ఫ్లో కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ కి పాత శ్రీను వైట్ల సినిమాలను పోలి ఉండడం చెప్పదగిన మైనస్ పాయింట్స్.

సాంకేతిక విభాగం :

ముందుగా టీం మొత్తానికి పెద్దగా ఉండి చాలా గ్రాండ్ గా ‘బాద్ షా’ ని తీర్చిదిద్దినందుకు, అలాగే ఎన్.టి.ఆర్ ని ఫ్యాన్స్ కి సరికొత్తగా చూపించినందుకు శ్రీను వైట్లని మెచ్చుకునే తీరాలి. ఎంత పెద్ద హీరో ఉన్నా కామెడీని మాత్రం ఎక్కడా తగ్గకుండా చూసుకునే శ్రీను వైట్ల ఈ సినిమాలో కూడా అదిరిపోయే కామెడీని ప్రేక్షకులకి అందించారు. ఓవరాల్ గా డైరెక్షన్ బాగుంది. కోనా వెంకట్, గోపీ మోహన్, శ్రీను వైట్ల కలిసి రాసుకున్న బాద్ షా పవర్ఫుల్ డైలాగ్స్, అలాగే సింగల్ లైన్ కామెడీ పంచ్ డైలాగ్స్ సినిమాకే హైలైట్.

ఒకే సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి పనిచేయనందువల్ల ఎవరి పనితనం ఎలా ఉంది అని విడమర్చి చెప్పలేము కానీ సినిమా ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు చాలా గ్రాండ్ విజువల్స్ తో కలర్ ఫుల్ గా ఉంది. కె.వి గుహన్ షూట్ చేసిన ఎన్.టి.ఆర్ ఇంట్రడక్షన్ సీన్ మాత్రం చాలా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్ ప్రకాష్ సెట్స్ బాగున్నాయి. సెకండాఫ్ ని సూపర్బ్ గా ఎడిట్ చేసిన ఎం.ఆర్ వర్మ ఫస్ట్ హాఫ్ మీద కూడా కాస్త శ్రద్ధ తీసుకొని కాస్త కత్తిరించి ఉంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది.

థమన్ మ్యూజిక్ అందించిన పాటలు రిలీజ్ కి ముందే హిట్ అయ్యాయి, అదే కోవలోనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ముఖ్యంగా హీరోయిజం ఎలివేషన్ సీన్స్ లో మ్యూజిక్ చాలా బాగుంది. అన్ని పాటలకీ కోరియోగ్రఫీ బాగుంది. చివరిగా నిర్మాత బండ్ల గణేష్. ఆయన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఎక్కడా ఖర్చుకి వెనుకాడకుండా పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ కి ఎంతో రిచ్ లుక్ ని తెచ్చింది. సినిమా చూసిన తర్వాత అందరూ ఆయన పెట్టిన ఒక్కరూపాయి కూడా వృధా కాలేదని అంటారు.

తీర్పు :

బాద్ షా – ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవర్స్ అని తేడా లేకుండా అందరూ ఈ సమ్మర్లో థియేటర్ కి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేయదగిన సినిమా. ఎన్.టి.ఆర్ వైవిధ్యమైన పాత్రల్లో చూపించిన అద్భుతమైన నటన, కాజల్ వన్ లైన్ పంచ్ డైలాగ్స్, బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ కామెడీ ట్రాక్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ ముందు కాస్త స్లో అవ్వడం, అక్కడక్కడా శ్రీను వైట్ల పాత సినిమాలను పోలి ఉండడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి ఓ పండుగ లాంటి సినిమా. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునే సినిమా ‘బాద్ షా’. ఖచ్చితంగా ఈ సమ్మర్లో బాక్స్ ఆఫీసు ని కొల్లగొట్టి బాక్స్ ఆఫీసు బాద్ షా గా నిలుస్తుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : బాద్ షా చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. మా సమీక్ష చదవండి, మీరే స్వయంగా సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి..

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :