సమీక్ష : బ్యూటిఫుల్ – బోరింగ్ బోల్డ్ లవ్ డ్రామా !

Beautiful review

విడుదల తేదీ : జనవరి  01, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు :  నైనా గంగూలి, సూరి

దర్శకత్వం : అగస్త్య మంజు

నిర్మాత‌లు : టి నరేష్ కుమార్, టి.శ్రీధర్

సంగీతం :  రవి శంకర్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య స‌మ‌ర్ప‌ణ‌లో నైనా గంగూలి, సూరి హీరోహీరోయిన్లుగా అగస్త్య మంజు దర్శక‌త్వంలో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మాతలుగా నిర్మించిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ బ్యూటిఫుల్ (ట్రి బ్యూట్ టు రంగీలా) అనేది ఉప శీర్షిక. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

 

రిని (నైనా గంగూలీ) ఉన్నంతలోనే ఆనందపడుతూ ప్రస్తుత క్షణాలను ఎంజాయ్ చేస్తూ లైఫ్ ను సంతోషంగా గడిపే స్వభావం గల అమ్మాయి. మయాంక్ (సూరి) జీవితంలో ఎదగాలనే ఆలోచనలతో పాటు తాను ప్రేమించిన అమ్మాయి ముందు తక్కువ అవ్వటం గాని, ఓడిపోవటం గాని ఏ మాత్రం ఇష్టపడని స్వభావం గల (బాధ పడటం తప్ప ఏమి చెయ్యలేని అబ్బాయి). ఇలాంటి పూర్తి భిన్న స్వభావాలు ఉన్న మయాంక్ అండ్ రిని ఒకర్ని ఒకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. అయితే అనుకోకుండానే రినికి సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చి పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనలు కారణంగా మయాంక్ రినికి దూరం అవుతాడు. రిని జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఇంతకీ మయాంక్ రినికి ఎందుకు దూరం అవ్వాలనుకుంటాడు? మయాంక్ ప్రేమ కోసం రిని ఏం చేస్తోంది? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా? లేదా? ఒక్కటైతే వాళ్ళను కలిపిన సంఘటన ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

ఈ సినిమాలో హీరోగా నటించిన హీరో సూరి ఈజ్ తో సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మొదటి భాగంలో సాగే కీలక సన్నివేశాల్లో గాని, హీరోయిన్ తో సాగే ప్రేమ సన్నివేశాల్లో గాని, అతని నటన బాగుంది. మొత్తం మీద మంచి భావోద్వేగాలతో ఎమోషనల్ గా నటించే ప్రయత్నం చేసాడు. డాన్స్ మరియు కొన్ని మెయిన్ సీన్స్ లో అతని హార్డ్ వర్క్ తెర పై స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక రిని పాత్రలో నటించిన నైనా గంగూలీ కూడా తన నటనతోనూ అలాగే తన గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. ఈ సినిమాలో మేనేజర్ పాత్రలో నటించిన నటుడు కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా ప్రతిభావంతమైన కొందరు నటీనటులు ఉన్న ఈ చిత్రంలో వాళ్ళు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్:

 

సినిమా పేరులో ఉన్న బ్యూటీ సినిమాలో లేకుండా పోయింది. యూత్ కనెక్ట్ అయ్యే అంశాలు పెడుతున్నామనుకొని దర్శకుడు ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయించినా కొన్ని షాట్స్ మినహా అది కూడా బోర్ గానే సాగింది. ఉన్నదాన్నే ప్రేమించి హ్యాపీగా బతకొచ్చు అని నమ్మే హీరోయిన్, లేని దాని కోసం ఆరాటపడుతూ హీరోయిన్ క్యారెక్టర్ కు పూర్తి అపోజిట్ లో ఉండే హీరో క్యారెక్టర్.. ఈ కాన్ ఫ్లిట్ చాలు సన్నివేశాలను ఆసక్తికరంగా రాసుకొని సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రస్ట్ పుట్టించడానికి, కానీ దర్శకుడు ఈ పాయింట్ ను బలంగా ఎలివేట్ చేసే సీన్స్ ను రాసుకోకుండా విషయం లేని మరియు ఇంట్రస్ట్ గా సాగని సీన్స్ తో సినిమాని చాల బోర్ గా మలిచాడు. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద కలిగే కనీస ఇంట్రస్ట్ కూడా కలగకుండా చేశారు.

ముఖ్యంగా హీరోహీరోయిన్ల నటన బాగున్నా వాళ్ళ పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు సినిమాని బలహీనపరిచింది. హీరోకి గోల్ ఉన్నా.. దాని కోసం ఆలోచనకే పరిమితం అవ్వటం తప్ప.. చేసేది ఏమి లేదు. అసలు అతనికి ఒక క్లారిటీ కూడా ఉండదు. దాంతో హీరో పాత్ర ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాకపోగా చికాకు కలిగిస్తుంది. పైగా ఈ చిత్రంలో తెర మీద పాత్రల్ని నిలబెట్టి అసలు సంఘటనంటూ సన్నివేశమంటూ ఏది లేకుండా.. ప్రతి సన్నివేశం రొటీన్ వ్యవహారాలతోనే చాలా ఊహాజనితంగా సాగుతుంటుంది.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు అగస్త్య మంజు దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా పరిపూర్ణంగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో ఏ మాత్రం విషయం లేదు. సంగీత దర్శకులు అందించిన పాటలు పర్వాలేదు. ముఖ్యంగా ఓ సాంగ్ ఆకట్టుకుంటుంది. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాతలు టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.

 

తీర్పు:

 

నైనా గంగూలి, సూరి హీరోహీరోయిన్లుగా అగస్త్య మంజు దర్శక‌త్వంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటూ వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. ప్రేమ కథలని డీల్ చేసేప్పుడు కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేసి ఒక ఫీల్ గుడ్ మూవీని చూసిన భావన కలిగించాలి. కానీ ఈ సినిమా వ్యవహారం అలా లేదు. ఇందులో హీరో హీరోయిన్ల నటన, కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఓకే అనిపించినా బలహీనమైన కథాకథనాలు, ఇంట్రస్ట్ గా సాగని సన్నివేశాలు మరియు కనెక్ట్ కాని ప్లే సినిమాను బోర్ కొట్టించే రీతిలో తయారుచేశాయి. మొత్తం మీద ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకోదు.

 

 

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం :