సమీక్ష : క్రేజీ అంకుల్స్ – స్లోగా సాగే బోరింగ్ రొమాంటిక్ డ్రామా !

Crazy Uncles movie review

విడుదల తేదీ : ఆగస్టు 19, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
తారాగణం: శ్రీ‌ముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, అదుర్స్ ర‌ఘు, గిరిధ‌ర్, హేమ‌
దర్శకత్వం: ఇ. స‌త్తిబాబు
నిర్మాత‌లు: గుడ్ ఫ్రెండ్స్ & బొడ్డు అశోక్
సంగీతం : ర‌ఘు కుంచె
ఎడిటింగ్‌ : నాగేశ్వ‌ర రెడ్డి


శ్రీముఖి కీలక పాత్రలో సింగర్ మనో, భరణి, భరణి, రాజా రవీంద్ర ప్రధానా పాత్ర‌ల్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ “క్రేజీ అంకుల్స్”. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :
స్వీటీ (శ్రీ‌ముఖి) తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ సింగర్. ఆమెకు రెడ్డి (సింగర్ మనో), రావు (భరణి), రాజు (రాజా రవీంద్ర) అనే ముగ్గురు స్నేహితులు పెద్ద అభిమానులు. తమ భార్యలతో సమస్య వచ్చిన ప్రతిసారి ఈ ముగ్గురు స్వీటీ సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతూ ఉంటారు. మరోపక్క ఈ ముగ్గురికి సంసార జీవితంలో సుఖం దొరకదు. దొరకని ఆ సుఖాన్ని పొందే క్రమంలో సింగర్ స్వీటీ (శ్రీ‌ముఖి) పై ఈ ముగ్గురు కన్ను పడుతుంది. రెడ్డి, రాజు, రావు ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెతో గడుపుతారు. ఆ తర్వాత వారి జీవితాల్లోకి స్వీటీ ఎంట్రీ ఇస్తోంది. స్వీటీ కారణంగా ఈ ముగ్గురు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? అసలు స్వీటీ వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు వచ్చింది ? చివరకు ఈ ముగ్గురికి స్వీటీ ఎలాంటి గుణపాఠం చెప్పింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :
సినిమా పేరులోనే ‘క్రేజీ’ ఉన్నట్లు.. ఈ అంకుల్స్ కూడా క్రేజిగానే బిహేవ్ చేస్తారు. స్వీటీ అనే సింగర్ చుట్టే తిరుగుతూ ఈ ముగ్గురు కొన్ని చోట్ల కామెడీతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సింగర్ మనో తన పాత్రకు తగ్గట్లు.. కామెడీ సన్నివేశాల్లో బాగా నటించాడు. అలాగే తనకు వచ్చే కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో వచ్చే సీన్స్ లో లోలోపలే నలిగిపోతున్న ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ బాగా అభినయించాడు. అలాగే రాజా రవీంద్ర, భరణి కూడా తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.

ఇక కీలక పాత్రలో నటించిన శ్రీముఖి అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే బోల్డ్ గా కనిపిస్తూ సినిమాకి హైలైట్ గా నిలిచింది. భార్యలుగా నటించిన హేమ, గాయత్రీ భార్గవి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక సినిమాలో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఈ సినిమాలో ఆకట్టుకునే మరో అంశం సినిమాలో ప్రస్తావించిన మెసేజ్. అలాగే సినిమా మెయిన్ పాయింట్ కూడా బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :
సినిమా ఇంట్రస్టింగ్ గానే మొదలైనా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా దర్శకుడు ఇ. స‌త్తిబాబు స్క్రీన్ ప్లేని రాసుకోలేకపోయారు. సినిమాలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. ఇక శ్రీముఖి మరియు ప్రధాన క్యారెక్టర్స్ మధ్య వచ్చే ట్రాక్ కూడా పేలవంగా ఉంది.
అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే డ్రామాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అదేవిధంగా మెయిన్ పాయింట్ లో ఉన్న కాన్ ఫ్లిక్ట్ ను బలంగా ఎలివేట్ చేయలేదు. మొత్తానికి దర్శకుడు రాసుకున్న కొన్ని కీలక సన్నివేశాలు పర్వాలేదనిపించినప్పటికీ.. సినిమా బలహీనమైన సంఘటనలకు లోబడి బలహీనంగా సాగుతుంది.

 

సాంకేతిక విభాగం :
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. ర‌ఘు కుంచె అందించిన సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని కాస్త స్లో గా సాగే సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు గుడ్ ఫ్రెండ్స్ & బొడ్డు అశోక్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

తీర్పు :
‘క్రేజీ అంకుల్స్’ అంటూ లేటు వయసులో కలిగే ఇబ్బందుల వల్ల, చేసే కొన్ని పొరపాట్లు ఆధారంగా నడిచే ఈ సినిమాలో మెయిన్ పాయింట్, కొన్ని కామెడీ సీన్స్ మరియు నటీనటుల నటన ఆకట్టుకుంటాయి. కాకపోతే రెగ్యులర్ ట్రీట్మెంట్, కొన్ని చోట్ల బోరింగ్ ప్లే అండ్ బలమైన సంఘర్షణ లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ ‘రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్’ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ, మిగిలిన వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోదు.
 

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం :