సమీక్ష : డిటెక్టివ్ – తన పరిశోధనతో ఆకట్టుకున్నాడు

Detective movie review

విడుదల తేదీ : నవంబర్ 10, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : మిస్కిన్

నిర్మాత : హరి గుజ్జలపూడి

సంగీతం : అర్రోల్ కొరెల్లి

నటీనటులు : విశాల్, ప్రసన్న, అను ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా

హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రతి సినిమా తప్పకుండా తెలుగులోకి అనువాదమవుతూనే ఉంటుంది. ఆయన తాజాగా నటించిన ‘తుప్పరివాలన్’ చిత్రం ‘డిటెక్టివ్’ పేరుతో ఈరోజే తెలుగు ప్రేక్షకుల్ ముందుకొచ్చింది. మరి తమిళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ ను ఎలా అలరించిందో చూద్దాం..

కథ :

పోలీసులకు కూడా సాధ్యం కాని కొన్ని కేసుల్ని సులభంగా పరిష్కరించే ఫేమస్ డిటెక్టివ్ అద్వైత భూషణ్ (విశాల్) ఒక చిన్న కేసును ఇన్వెటిగేట్ చేస్తుండగా అతనికి వరుస హత్యలకి సంబందించిన ఒక లింక్ దొరుకుతుంది. అదే సమయంలో పోలీసులు కూడా ఆ వరుస హత్యల వెనకున్న హంతకుల్ని పట్టుకోవడానికి సహాయం చేయమని అద్వైత భూషణ్ ని అడుగుతారు.

అసలు ఆ వరుస హత్యలు ఎందుకు జరిగాయి, వాటిని ఎవరు, ఎందుకు చేశారు, డిటెక్టివ్ అద్వైత భూషణ్ ఆ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు, హంతకుల్ని ఎలా పట్టుకున్నాడు అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

తెలుగునాట పూర్తిస్థాయి డిటెక్టివ్ సినిమాలొచ్చి చాలా కాలమైంది. కాబట్టి ఇన్వెస్టిగేటివ్ తరహా సినిమాల్ని ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి చాయిస్ గా నిలుస్తుంది. దర్శకుడు మిస్కిన్ డిటెక్టివ్ సినిమాకు స్క్రీన్ ప్లే ముఖ్యమనే సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకుని తీసుకున్న కథ చిన్నదే అయినా కథనాన్ని మాత్రం బాగానే రాసుకున్నాడు. కథనంలో అనవసరమైన పాత్రలకు, సంభాషణలకు చోటివ్వకుండా సినిమాను నడిపి ఆకట్టుకున్నాడు.

ముఖ్యంగా డిటెక్టివ్ వరుస హత్యల మిస్టరీని ఛేదించే పనిలోకి దిగినప్పటి నుండి కథనంలో అనేక మలుపులను ప్రవేశపెట్టి, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సెకండాఫ్ ను బాగా డీల్ చేశాడు. ఇక హీరో విశాల్ కూడా డిటెక్టివ్ పాత్రకు చాలా వరకు న్యాయం చేశాడు. ప్రత్యేకమైన డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్ తో ఇంటెలిజెన్స్ ను ప్రదర్శిస్తూ, యాక్షన్ సన్నివేశాల్లో తన ట్రేడ్ మార్కును చూపిస్తూ మెప్పించాడు. హీరో స్నేహితుడిగా ప్రసన్న నటన కూడా చాలా బాగుంది.

సినిమా ఆరంభంలో, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో డిటెక్టివ్, హంతకుల ప్రతిభను ప్రేక్షకులకి చూపించడానికి మిస్కిన్ రాసిన సన్నివేశాలు బాగున్నాయి. అర్రోల్ కొరెల్లి ఒక పూర్తిస్థాయి డిటెక్టివ్ థ్రిల్లర్ కు ఎలాంటి ప్రత్యేకమైన స్కోర్ కావాలో అలాంటిదాన్నే అందించి ప్రతి చోట మెప్పించాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి అర్థభాగంలో డిటెక్టివ్ పాత్రను, హంతకుల్ని పరిచయం చేయడానికి మిస్కిన్ రాసిన సన్నివేశాలు బాగున్నా వాటిని చూపించడంలో ఆయన ప్లే చేసిన డ్రామా కొద్దిగా కన్ఫ్యూజన్ కు గురిచేసింది. నిజానికి అంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే అవసరం లేదు కూడ. పైగా ఇంటర్వెల్ ముందు వరకు సినిమాలోని ప్రధాన సమస్య ఏమిటో తెలియకపోవడం, డిటెక్టివ్ కూడా అసలు కేసులోకి దిగకపోవడంతో కొంత నిరుత్సాహం కలిగింది.

దర్శకుడు మిస్కిన్ కథనల్లో కొంత ఎక్కువ స్వేచ్ఛనే తీసుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో మిస్కిన్ చూపిన కొన్ని అంశాలతో రాజీ పడటం కొంత కష్టంగానే ఉంటుంది. వారు హత్యలు చేస్తున్న హంతకుల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి, వాళ్ళ లక్ష్యం ఏమిటి అనే విషయాల్ని ఇంకొంత వివరంగా చూపించి ఉంటే బాగుండేది. అలాగే రెగ్యులర్ ఆడియన్సుకి కావాల్సిన కామెడీ, రొమాన్స్ వంటి అంశాలు ఈ సినిమాలు దొరకవు. ఈ చిత్రం ఒక సెట్ ఆఫ్ ఆడియన్సుకి మాత్రమే వర్కవుటవుతుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు మిస్కిన్ ఒక డిటెక్టివ్ సినిమాకు ఎలాంటి ప్లే అవసరమో అలాంటి ప్లే రాసుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. హీరో పాత్రలో ఇంటెలిజెన్స్ ను అను క్షణం ప్రదర్శిస్తూ, ఉతకంఠభరితమైన పరిశోధనా సన్నివేశాలతో ఆకట్టుకున్నారాయన. కానీ ఫస్టాఫ్ చివరి వరకు సినిమా లక్ష్యమేమిటో చెప్పకుండా కొంత కన్ఫ్యూజన్ డ్రామాను నడిపి కొంత నిరుత్సాహపరిచారాయన.

అర్రోల్ కొరెల్లి నైపత్య సంగీతం సినిమాకు చాలా సహాయపడింది. డిటెక్టివ్ సినిమాలకు ఎలాంటి స్కోర్ కావాలో అలంటి స్కోర్ నే అందించారు. ఒకసారి వినిపించిన స్కోర్ ను పదే పదే రిపీట్ చేయకుండా కొత్త కొత్త స్కోర్స్ వాడి ఆకట్టుకున్నారాయన. ఎడిటింగ్ విభాగం ఫస్టాఫ్ కథనంలో ఇంకాస్త క్లారిటీ ఉండేలా వర్క్ చేసుంటే బాగుండేది. కార్తీక్ వెంకట్రామన్ సినిమాటోగ్రఫి బాగుంది. హరి గుజ్జలపూడి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఈ ‘డిటెక్టివ్’ చిత్రం ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే తో కూడిన ఇన్వెస్టిగేషన్ తరహా సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు మంచి చాయిస్ గా నిలబడుతుంది. మిస్కిన్ కథానాన్ని, హీరో పాత్రను రాసుకున్న విధానం, వాటిని స్క్రీన్ పై ఎగిజిక్యూట్ చేసిన తీరు, సెకండాఫ్ ఇందులో మెప్పించే అంశాలు కాగా కొంత కన్ఫ్యూజన్ కు గురిచేసే ఫస్టాఫ్ డ్రామా, రెగ్యులర్ ఆడియన్సుకు కావాల్సిన కమర్షియల్ అంశాలు లేకపోవడం నిరుత్సాహానికి గురిచేసే అంశాలు. మొత్తం మీద ఈ చిత్రం ఇన్వెస్టిగేషన్ తరహా సినిమాల్ని, సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి నచ్చుతుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :