సమీక్ష : దొంగ‌ – ఆకట్టుకొనే సస్పెన్స్ థ్రిల్లర్

సమీక్ష : దొంగ‌ – ఆకట్టుకొనే సస్పెన్స్ థ్రిల్లర్

Published on Dec 21, 2019 3:06 AM IST
Donga review

విడుదల తేదీ : డిసెంబర్  20, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు :  కార్తీ, జ్యోతిక, నిఖిల విమల్, సత్య రాజ్,సీత, ఇళవరసు తదితరులు.

దర్శకత్వం : జీతూ జోసెఫ్

నిర్మాత‌లు : రావూరి వి శ్రీనివాస్

సంగీతం :  గోవింద వసంత

సినిమాటోగ్రఫర్ : ఆర్ డి రాజశేఖర్

ఎడిటర్:  వి ఎస్ వినాయక్


కార్తీ హీరోగా జ్యోతిక, సత్యరాజ్ ప్రధానపాత్రలలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్సు అండ్ క్రైమ్ థ్రిల్లర్ దొంగ. తమిళ చిత్రం తంబీ చిత్రానికి తెలుగు అనువాదంగా నేడు ఈ మూవీ విడుదలైనది. కార్తీ గత చిత్రం ఖైదీ సూపర్ హిట్ గా నిలివడంతో దొంగ చిత్రంపై అంచనాలు బాగున్నాయి. మరి కార్తీ దొంగ, ఆ అంచనాలు ఎంత వరకు అందుకుందో సమీక్షలో చూద్దాం…

కథ:

గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ ఫ్రీ బర్డ్ లైఫ్ అనుభవిస్తూ ఉంటాడు విక్కీ(కార్తీ). 15ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం వెతుకుతున్న తండ్రి జ్ఞాన మూర్తి(సత్య రాజ్) అక్క పార్వతి(జ్యోతిక) ల ఒక సంపన్న కుటుంబంలోకి గోవా పోలీస్ అధికారి జీవానంద్(ఇళవరసు) డబ్బుకోసం విక్కీతో కుమ్మకై శర్వాగా అతనిని ప్రవేశ పెడతాడు. మరి శర్వా గా జ్ఞాన మూర్తి కుటుంబంలోకి వెళ్లిన విక్కీ అక్కడ ఎదుర్కున్న పరిస్థితులు ఏమిటి? ఆ కుటుంబం అతనిని నమ్మిందా? అసలు శర్వా ఏమైయ్యాడు? చివరికి విక్కీ, పార్వతి, జ్ఞాన మూర్తిల కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఖైదీ లాంటి సస్పెన్సు థ్రిల్లర్ తో బంపర్ హిట్ అందుకున్న కార్తీ తన తదుపరి చిత్రం కూడా అదే జోనర్ లో ఎంచుకున్నాడు. డబ్బుల కోసం ఒక పెద్దింటికి తప్పిపోయిన కొడుకుగా ప్రవేశించిన దొంగగా, కార్తీ నటన ఆ పాత్రకు రక్తికట్టించింది. ఫస్ట్ హాఫ్ లో కార్తీ తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పంచగా, సెకండ్ హాఫ్ మొత్తం తన మార్క్ యాక్షన్ మరియు ఎమోషన్స్ తో ఆకట్టుకున్నారు.

ఈ మూవీలో హీరో కార్తీ తరువాత ఎక్కువ స్క్రీన్ స్పేస్ కలిగిన శర్వా తండ్రి పాత్ర చేసిన సత్యరాజ్ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. భిన్న షేడ్స్ ఉన్న తన పాత్రకు ఆయన సంపూర్ణ న్యాయం చేశారు. ఇక కార్తీ అక్క పాత్ర చేసిన జ్యోతిక కు మొదటి సగంలో అంత స్క్రీన్ స్పేస్ లభించలేదు. ఐతే పతాక సన్నివేశాలలో వచ్చే ఆమె ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన ఆకట్టుకుంటుంది.

చాలా కాలం తరువాత తిరిగొచ్చిన తన ప్రియుడి కోసం తపించే అమ్మాయి పాత్రలో నిఖిల విమల్ నటన సహజంగా ఉంది. ఐతే సీరియస్ నోట్ లో నడిచే సెకండ్ హాఫ్ లో ఆమె పాత్రకు చోటు లేకుండా పోయింది. గోవా పోలీస్ పాత్ర చేసిన ఇళవరసి కన్నింగ్ పోలీస్ అధికారిగా మెప్పించారు. జ్యోతిక ట్యూషన్ స్టూడెంట్ గా చిన్నాఅనే పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కామెడీ తో ఆకట్టుకున్నాడు.

కొంచెం స్లోగా మొదలైన దొంగ మూవీ ఆసక్తికరంగా సాగుతూ నడిచింది. ఫస్ట్ హాఫ్ లో ఆకట్టుకొనే సస్పెన్సు మరియు కార్తీ అల్లరి, కామెడీ టైమింగ్ తో సాగిన ఈ చిత్రం సెకండ్ హాఫ్ యాక్షన్ సన్నివేశాలు, సస్పెన్సు అంశాలతో ఆకట్టుకొనేలా నడిచింది. అసలు శర్వా ఏమాయ్యాడు అనే సస్పెన్సు రివీల్ కాకుండా క్లైమాక్స్ వరకు కథ నడిపించడం వలన మూవీ ఎక్కడా బోరుకొట్టదు.

విరామానికి ముందు వచ్చే ట్విస్ట్ అలాగే క్లైమాక్స్ ముగించిన విధానం కూడా ఆసక్తిగా సాగాయి. ఇక సీనియర్ నటి షావుకారు జానకి, సీత కూడా తమ పాత్రల పరిధిలో ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

ట్రైలర్ చూసిన కొందరు ఈ మూవీ అక్క జ్యోతిక తమ్ముడు కార్తీ మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా అని భావిస్తారు. కానీ ఈ చిత్రం పూర్తిగా సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. జ్యోతిక పాత్ర మొదటి సగంలో అసలు ప్రాధాన్యం లేకుండా సాగగా సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సన్నివేశాలకే పరిమితం అయ్యారు.

ఫస్ట్ హాఫ్ స్లోగా మొదలవడం అలాగే మహేష్ నటించిన అతడు సినిమా షేడ్స్ లో సాగడం కొంత వరకు మైనస్ అనిచెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో ఫన్ ఎలిమెంట్స్ లేకపోవడం, ఉన్న హీరోయిన్ ని కేవలం మొదటి సగానికే పరిమితం చేయడం మరొక బలహీనత.

సాంకేతిక విభాగం:

గోవింద వసంత పాటలు ఆకట్టుకున్నప్పటికీ బీజీఎమ్ పర్వాలేదు అన్నట్లుగా ఉంది. ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అందమైన హిల్ ఏరియాలో నడిచిన ఈ చిత్ర సన్నివేశాలను ఆయన చక్కగా కెమెరాలో బంధించారు. ఎడిటింగ్ పరవాలేదు.

రెన్సిల్డ్ సిల్వా, సమీర్ అరోరా, జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే మూవీకే ప్రధాన ఆకర్షణ. కథలో పొరలు పొరలుగా వచ్చే ట్విస్ట్స్ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి.

దర్శకుడు జీతూ జోసెఫ్ ఒక క్రైమ్ థ్రిల్లర్ ని తెరకెక్కించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఒక చిన్న పాయింట్ చుట్టూ సస్పెన్సు క్రియేట్ చేసి నడిపిన విధానం బాగుంది. ఆయన చివరి వరకు సినిమాను అలరించే ట్విస్ట్స్ తో నడిపారు. ఐతే జ్యోతిక పాత్రను ఆయన నిర్లక్ష్యం చేశారు. అలాగే సెకండ్ హాఫ్ లో ఆయన కమర్షియల్ అంశాలు విస్మరించారు.
తీర్పు:

మొత్తంగా చెప్పానంటే క్రైమ్ అండ్ సస్పెన్సు థ్రిల్లర్ గా వచ్చిన దొంగ మూవీ చాలా వరకు ప్రేక్షకులను మెప్పించింది. మొదటి సగంలో వచ్చే హాస్యంతో పాటు ఆసక్తికరంగా సాగే మలుపులు, సెకండ్ హాఫ్ లో యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు మూవీని చాలా వరకు ఆసక్తిగా నడిపించాయి. ఐతే జ్యోతిక పాత్రకు ఊహించినంత ప్రాధాన్యం లేకపోవడం, సెకండ్ హాఫ్ లో ఎటువంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం నిరాశ పరిచే అంశాలు. సస్పెన్సు థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి దొంగ నచ్చే అవకాశం కలదు. ఐతే తీవ్ర పోటీ మధ్య విడుదలైన దొంగ ఎంత వరకు కమర్షియల్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు