Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : దృశ్యకావ్యం – అంత ‘దృశ్యం’ లేదు!!

Drusya kavyam review

విడుదల తేదీ : 18 మార్చ్ 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : బెల్లం రామకృష్ణా రెడ్డి

నిర్మాత : పుష్యమి ఫిల్మ్ మేకర్స్

సంగీతం : ప్రాణం కమలాకర్

నటీనటులు : రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి, మధు


రామ్ కార్తిక్, కశ్మీరా కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించగా బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా దృశ్యకావ్యం. తెలుగులో ఈ మధ్యకాలంలో ట్రెండ్‌గా మారిన హర్రర్ జానర్‌ను నమ్ముకొని తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ’దృశ్యకావ్యం’ లాంటి టైటిల్ పెట్టి పెద్ద సాహసమే చేసి మనముందుకు వచ్చిన ఈ సినిమా ఏ స్థాయి వరకూ ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

అఖిల్ (రామ్ కార్తీక్), అభినయ (కశ్మీరా కులకర్ణి) కాలేజీ రోజులనుంచీ ఒకరంటే ఒకరికి ఇష్టంతో ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటారు. ఒక యాక్సిడెంట్‌లో కుటుంబం మొత్తాన్నీ కోల్పోయిన అభినయకి, అఖిల్ అన్నీ తానై చూసుకుంటూంటాడు. అఖిల్, అభినయ, వారికి పుట్టిన పాప అనన్య… వీళ్ళందరి సంతోషాలతో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగానే, ఒకానొక రోజు అఖిల్ ఆఫీస్ పనిపై యూరప్ వెళ్తూ, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళేదారిలోనే యాక్సిడెంట్‌లో చనిపోతాడు.

కాగా చనిపోయిన తర్వాత కూడా అఖిల్ ఆ కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటాడు. అతడి ఇంట్లో ఏవో అదృశ్య శక్తులు తిరుగుతూంటాయి? చనిపోయిన తర్వాత కూడా అఖిల్ ఆ కుటుంబంలోనే ఎప్పట్లానే ఉంటాడు? అసలీ కథేంటీ? చనిపోయిన అఖిల్ మళ్ళీ ఎలా వచ్చాడు? ఆ ఇంట్లోని అదృశ్య శక్తులేంటీ? అన్నదే ‘దృశ్యకావ్యం’ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ఉన్నంతలో ప్లస్ పాయింట్స్ అంటే తండ్రి-కూతుళ్ళ మధ్యన వచ్చే ఎమోషనల్ సీన్స్ గురించి చెప్పుకోవచ్చు. ‘నో ఎండ్ ఫర్ ఫీలింగ్స్’ పేరుతో ముగిసే ఈ సినిమాలో బేసిక్ ఎమోషన్ ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతూంటుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ దగ్గర సినిమాలో వేగం పరిగి మంచి థ్రిల్ ఇస్తుంది. సెకండాఫ్‌లో సస్పెన్స్ రివీల్ అయ్యే ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు మేకింగ్ పరంగా కూడా బాగున్నాయి.

నటీనటుల పరంగా ఈ సినిమాలో అందరూ బాగానే చేశారు. ఎక్కువగా సినిమా అంతా నాలుగు పాత్రల చుట్టూ నడుస్తూంటుంది. హీరో కార్తిక్ బాగానే నటించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. కశ్మీరా గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఫర్వాలేదు. ఓ ప్రధాన పాత్రలో నటించిన మధు బాగా చేశాడు. కీలక సన్నివేశాల్లో మధు సినిమాను అన్నీ తానై నడిపించాడు. ఇక అనన్యగా నటించిన పాప బాగా చేసింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‍లోనే అసలు కథ ఉంటుంది కాబట్టి ఈ సినిమాకు సెకండాఫ్‍నే ఉన్నంతలో ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ఒక్క చిన్న సస్పెన్స్ ఎలిమెంట్‌తో రాసుకున్న క్లారిటీలేని కథ, కథనాల గురించే చెప్పుకోవాలి. ఫస్టాఫ్ అంతా రొమాన్స్, ఫ్యామిలీ అంశాలతో నడిచే ఈ సినిమా సెకండాఫ్ మొదలయ్యాక గానీ హర్రర్ అంశాన్ని టచ్ చేయదు. ఇక అప్పటివరకూ సినిమా ఏమాత్రం ఆసక్తికరంగా లేని సాదాసీదా సన్నివేశాలతో నడుస్తూ విసుగు పుట్టిస్తుంది. ఫస్టాఫ్‍లో తండ్రి-కూతుళ్ల మధ్యన వచ్చే సన్నివేశాలు మినహాయిస్తే ఇంటర్వెల్ వరకూ పెద్దగా ఆకట్టుకునే సన్నివేశాలేవీ లేవు. ఇక ఒక ట్విస్ట్‌ తర్వాత మొదలయ్యే సెకండాఫ్ కూడా మొదలైన వెంటనే గాడి తప్పి ఎటో వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఈ క్రమంలో హర్రర్ అంశాన్ని ముడిపెడుతూ వచ్చే సన్నివేశాలతో మొదలుకొని ప్రతిదీ సిల్లీగా కనిపిస్తుంది. ఇక పాటలు కూడా ఎందుకు వస్తాయో అర్థం కాదు.

సినిమా అంతా అయిపోయాక ఏం చెప్పాలనుకున్నారో కూడా అర్థం కానంత విచిత్ర పరిస్థితికి కారణం కథనంలో బలం లేకపోవడమే అని చెప్పుకోవాలి. ఇక దీనికి తోడు ‘బాహుబలి’ సినిమా తరహాలో హర్రర్ అంశంలోని అసలు కథను ‘దృశ్యకావ్యం 2’లో చెప్తామని చివర్లో ప్రకటించడం ఈ సినిమా విషయంలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. అసలు అప్పటివరకూ ఏమీ లేని సినిమాలో క్లైమాక్స్‌లో అయినా ఏదైనా ఉంటుందీ అనుకుంటే ఒక్క సస్పెన్స్ ఎలిమెంట్ ఏదో చెప్పాం అనిపించి, ఇలా అకస్మాత్తుగా సినిమాను పూర్తి చేయడం నిరాశ కలిగిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్, కాలేజీ ఎపిసోడ్, సెకండాఫ్‌లో నటుడు పృథ్వీ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్, హర్రర్ అంశం.. ఇవన్నీ సిల్లీగా ఉండడమే కాక పరమ బోరింగ్‌గా కూడా ఉన్నాయి. సినిమాలో లాజిక్ అన్న మాటకు సన్నివేశాల పరంగా అటుంచితే, కథ పరంగానూ ఓ అర్థం లేకపోవడం చాలాచోట్ల నవ్వు తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శక, రచయిత బెల్లం రామకృష్ణా రెడ్డి గురించి చెప్పుకుంటే.. ‘దృశ్యకావ్యం’ అన్న టైటిల్ పెట్టి ఆయన రాసుకున్న కథే మొదట్నుంచీ అర్థం లేనిది. బేసిక్ ఎమోషన్ బాగున్నా, పూర్తి కథంతా ఓ అర్థంలేని వ్యవహారంలో నడిపించి రచయితగా రామకృష్ణా పూర్తి స్థాయిలో విఫలమయ్యాడు. దర్శకుడిగానూ ఆయన ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకున్నది లేదు. ఒక్క సస్పెన్స్ ఎలిమెంట్‌ను రివీల్ చేసే సమయంలో దర్శకుడిగా ఫర్వాలేదనిపించాడు.

‘ప్రాణం’ కమలాకర్ అందించిన మ్యూజిక్ ఫర్వాలేదనేలా ఉంది. రెండు పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అంతంతమాత్రమే! సంతోష్ షనమోని సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు మొదట్నుంచీ, చివరివరకూ ఒక ఫీల్ తేవడంలో సినిమాటోగ్రాఫర్ పనితనం చూడొచ్చు. నాగిరెడ్డి అందించిన ఎడిటింగ్ అస్సలు బాగాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి.

తీర్పు :

హర్రర్‌తో పాటు మరో జానర్ కలిసిరావడమనేది ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్. హర్రర్ థ్రిల్లర్, హర్రర్ కామెడీ, హర్రర్ డ్రామా.. ఇలా ఈ ట్రెండ్‌ ప్రకారమే వచ్చిన ‘దృశ్యకావ్యం’, హర్రర్‍కు ఫ్యామిలీ డ్రామాను కలిపి మెప్పించాలనుకొని విఫలమైంది. అసలైన హర్రర్ ఎలిమెంట్ తేలిపోవడం, అర్థం లేని కథ, కథనం, ఎందుకెలా వస్తున్నాయో తెలియని లాజిక్ లేని సిల్లీ సన్నివేశాలు, అసలు కథను చెప్పకుండా చివర్లో పార్ట్ 2 అనడం.. ఇలా ఇన్ని మైనస్‌లతో వచ్చిన ఈ సినిమాలో మధు యాక్టింగ్, ప్రీ క్లైమాక్స్, తండ్రి-కూతుళ్ళ బేసిక్ ఎమోషన్ తప్ప మరింకేమీ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘దృశ్యకావ్యం’ అనేంత స్థాయి టైటిల్‌కి ఏమాత్రం అర్హం కాని ఈ సినిమా ఒక సాదాసీదా సినిమాగా కూడా నిలబడలేకపోయింది.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :