సమీక్ష : హైదరాబాద్ లవ్ స్టోరీ – సెకండాఫ్ పర్వాలేదు

Hyderabad Love Story movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : రాహుల్ రవీంద్రన్, రెష్మి మీనన్, జియా

దర్శకత్వం : రాజ్ సత్య

నిర్మాత : ఎస్.ఎన్. రెడ్డి

సంగీతం : సునీల్ కశ్యప్

సినిమాటోగ్రఫర్ : బి. వి. అమరనాథ్ రెడ్డి

ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ

రాహుల్ రవీంద్ర హీరోగా నూతన దర్శకుడు రాజ్ సత్య డైరెక్ట్ చేసిన చిత్రం ‘ హైదరాబాద్ లవ్ స్టోరీ ‘. పలు వాయిదాల తర్వాత ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో చూద్దాం..

కథ :

భాగ్యలక్ష్మి (రెష్మి మీనన్) తొలిచూపులోనే కార్తిక్ (రాహుల్ రవీంద్రన్)ను ప్రేమిస్తుంది. అతనికి దగ్గరవ్వాలని ట్రై చేస్తుంది. హైదరాబాద్ మెట్రో నిర్మాణంలో ఇంజనీర్ గా పనిచేసే కార్తిక్ కూడ భాగ్యలక్ష్మి ప్రేమలో పడతాడు. అలా వారిద్దరూ ప్రేమికులుగా మారుతుండగా కార్తిక్ పాత ప్రియురాలు వైష్ణవి (జియా) ఎంటరై భాగ్యలక్ష్మి మనసును చెడగొట్టి వారి ప్రేమకు ఆడ్డుపడుతుంది.

అసలు వైష్ణవి ఎవరు, ఆమె కార్తిక్ తో ఎందుకు విడిపోయింది, వారి ప్రేమ కథేమిటి, మళ్ళీ కార్తిక్ జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఏం చెప్పి భాగ్యలక్ష్మి మనసుని మార్చింది, విడిపోయే దశకు చేరుకున్న కార్తిక్, భాగ్యలక్ష్మిలు మళ్ళీ కలిశారా లేదా అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ప్లస్ హీరో రాహుల్ రవీంద్రన్. క్లాస్ లుక్లో కనిపిస్తూ, సెటిల్డ్ పెర్ఫార్మెన్న్ ఇస్తూ వీలైనంత వరకు సినిమాను తన భుజాల మీద మోయడానికి ట్రై చేశాడు రాహుల్. ద్వితీయార్థంలోని ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటన మెప్పించింది. హీరోయిన్ రెష్మి మీనన్ కూడ సింపుల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్యన నడిచే కొన్ని రొమాంటిక్ సీన్స్ పర్వాలేదనిపించాయి.

ఫస్టాఫ్ మొత్తం చాలా సాదా సీదాగానే సాగిన సెకండాఫ్లో రివీల్ అయ్యే హీరో గతం, అతని కుటుంబం, స్నేహం వంటి అంశాలు, వాటి చుట్టూ నడిచే చిన్నపాటి కథ ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్ననాటి స్నేహం మూలాన హీరో ప్రేమ విఫలమవడం అనే పాయింట్ సినిమాలో కొంత ఎమోషన్ ను క్యారీ చేయగలిగింది.

మైనస్ పాయింట్స్ :

చిత్రంలో ప్రాపర్ కథంటూ ఉండదు. బలహీనంగానే మొదలయ్యే ప్రేమ కథ పోను పోను మెల్లగా మెల్లగా నీరుగారిపోయి సహనానికి పరీక్ష పెడుతుంది. సింగిల్ సిట్టింగ్లో రాసుకున్నట్టు ఉండే సన్నివేశాలు పేలవంగా, ఏమాత్రం ప్రభావం చూపలేని రీతిలో ఉంటాయి. ఒకవైపు హీరో రాహుల్ రవీంద్రన్ తన ఇన్నోసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఏదోలా సినిమాను ముందుకు తోద్దామని చూసినా కథా, కథనాలు అతనికి సహకరించలేదు.

దర్శకుడు రాజ్ సత్య ప్రధాన మలుపును ద్వితీయార్థంలో మాత్రమే ఓపెన్ చేయడంతో ఫస్టాఫ్ మొత్తం ఏదో ఉండాలి కాబట్టి ఉన్నట్టే ఉంటుంది. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగల హీరో హీరోయిన్లు ఉన్నా వాళ్ళ మధ్య బలమైన ఎమోషనల్ సన్నివేశాలు లేకపోవడంతో రొమాంటిక్ ట్రాక్ కూడ సరిగా పండలేదు.

చిత్రానికి ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’ అని పేరు పెట్టి మాంటేజ్ షాట్స్ మినహా మిగతా సినిమా మొత్తాన్ని వేరే ఎక్కడో చిత్రీకరించడంతో కనీసం టైటిల్ జెస్టిఫికేషన్ కూడ జరగలేదు. వీటికి తోడు రోటీన్ పాత్రలు, ఊహించదగిన కథనం, వినసొంపుగాలేని పాటలు ఇంకాస్త చిరాకు పెడతాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు రాజ్ సత్య ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’ పేరుతో తీసిన ఈ సినిమా చూడటానికి ఎలా ఉన్నా కనీసం పూర్తిగా హైదరాబాద్ లొకేషన్లో అయినా జరిగుంటే ప్రేక్షకుడికి ఒక సంతృప్తి ఉండేది. పైగా దర్శకుడు రాసిన కథ, కథనాలు కూడ పేలవంగానే ఉన్నాయి.

సునీల్ కశ్యప్ సంగీతం ఎన్త గొప్పగా లేదు. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసరమైన సన్నివేసాలని తొలగించాల్సింది. ఎస్.ఎన్. రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

దర్శకుడు రాజ్ సత్య రచనా శైలి, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు సరిగా లేకపోవడంతో చిత్రం ఆకట్టుకునే రీతిలో బయటకురాలేదు. ద్వితీయార్థంలో వచ్చే హీరో గతం, రాహుల్ రవీంద్రన్, రెష్మి మీనన్ల నటన ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా కథకు సరైన లక్ష్యం లేకపోవడం, కథనంలో ఆసక్తి, బాగున్నాయనిపించే సన్నివేశాలు లోపించడం, ప్రధానమైన లవ్ ట్రాక్ పేలవంగా ఉండటం, టైటిల్ జస్టిఫికేషన్ జరక్కపోవడం నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద సెకండాఫ్ మాత్రమే కొంత పర్వాలేదనిపించే ఈ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను ఇష్టపడేవాళ్ళను గొప్పగా ఇంప్రెస్ చేయలేదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

 
Like us on Facebook