సమీక్ష : జగన్నాటకం – డిఫరెంట్ అటెంప్ట్.!

సమీక్ష : జగన్నాటకం – డిఫరెంట్ అటెంప్ట్.!

Published on Mar 13, 2015 5:20 PM IST
Jagannatakam

విడుదల తేదీ : 13 మార్చి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం :  ప్రదీప్ నందన్ 

నిర్మాత : ఆదిశేషా రెడ్డి

సంగీతం : అజయ్ అరసాడ 

నటీనటులు : ప్రదీప్ నందన్, ఖేనిష చంద్రన్, శ్రీధర్, అభినవ్

స్వతహాగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ప్రదీప్ నందన్ నటన మీద, సినిమా మీద ఉన్న ఆసక్తితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి మొదట చంద్రశేఖర్ ఏలేటి దగ్గర అసిస్టెంట్ గా చేసి, ఇప్పుడు దర్శకుడిగా మరియు హీరోగా మారి చేసిన సినిమా ‘జగన్నాటకం’. ఖేనిష చంద్రన్ హీరోయిన్ గా నటించిగా శ్రీధర్, అభినవ్, ఉషశ్రీ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాని ఆదిశేషా రెడ్డి నిర్మించాడు. డ్రామాకి థ్రిల్లర్ అంశాలను జోడించి చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఫ్రెండ్స్ తో పాటు అల్లరి చేస్తూ, చిన్న చిన్న గొడవల్లో తన హీరోయిజం చూపిస్తూ సినిమాల్లో హీరో అవ్వాలనే కోరికతో నటుడిగా అవకాశాల కోసం ట్రై చేసే కుర్రాడే మన హీరో పృథ్వి(ప్రదీప్ నందన్). పృథ్విని ఎంతో ప్రేమగా చూసుకునే నాన్న రాఘవయ్య, చెల్లెలు దివ్య(ఉషశ్రీ)లే పృథ్వికి ఉన్న ఆస్తి. ఇలా సాఫీగా సాగిపోతున్న పృధ్వీ లైఫ్ లోకి భాను(ఖేనిష చంద్రన్) అనే అమ్మాయి వచ్చి మొదటి చూపులోనే తన మనసుని దోచుకుంటుంది. కట్ చేస్తే కొద్ది రోజులకి ఇద్దరూ లవర్స్ అవుతారు. పృథ్వి వాళ్ళ ఇంట్లో కూడా వీరి ప్రేమకి ఒప్పుకుంటారు.

అదే టైంలోనే పృథ్వికి రాజమౌళి సినిమాలో హీరోగా ఛాన్స్ వస్తుంది. దాంతో ఆ మోమెంట్ ని సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చెయ్యడానికి ఫ్రెండ్స్ తో పాటు బయటకి వెళ్తాడు. వెళ్ళిన కొద్ది సేపటికే నాన్న చనిపోయాడని ఫోన్ వస్తుంది. వచ్చి చూస్తే నాన్న శవం, మరోవైపు చెల్లెలు కనిపించదు. అక్కడి నుంచి అసలు ఏం జరిగింది.? తన చెల్లెలికి ఏమైంది.? అసలు బతికి ఉందా.? లేదా.? పృథ్వి బయటకి వెళ్ళిన టైంలో వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది.? ఉన్నపాటుగా వాళ్ళ నాన్న ఎందుకు చనిపోయాడు.? చివరికి ఈ తన నాన్న చావు, చెల్లెలి మిస్సింగ్ వెనుక ఉన్న మిస్టరీని చేధించగలిగాడా.? లేదా.? అన్నది మీరు ఈ జగన్నాటకం చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

రెగ్యులర్ ఫ్యామిలీ రివెంజ్ డ్రామాకి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి తీసిన ఈ సినిమాలో సెకండాఫ్ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాల ఎపిసోడ్ ఆడియన్స్ ఆకట్టుకుంటుంది. అప్పటి వరకూ నిజం కోసం వెతుకుతున్న హీరోకి నిజం తెలిసాక హీరోని ఎలివేట్ చేసే పాయింట్ ని బాగా చూపించారు. ఆ ఎపిసోడ్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫైనల్లో వచ్చే ఖుషీ స్టార్టింగ్ సీన్ ఆడియన్స్ ఫేస్ మీద ఒక చిన్నపాటి నవ్వు తెప్పిస్తుంది. ఇంటర్వల్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది.

ఇక నటీనటుల వివరాలకి వస్తే.. హీరో ప్రదీప్ నందన్ లో మంచి ఈజ్ కనిపిస్తుంది. ఎక్కడా ఎనర్జీ లెవల్స్ తగ్గకుండా చేసాడు. క్లైమాక్స్ సీన్ బాగా చేసాడు. కానీ నటుడిగా తనకిదే మొదటి సినిమా, నటుడిగా తను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందనేది మనకు కొన్ని చోట్ల అర్థమవుతుంది. హీరోయిన్ ఖేనిష చంద్రన్ ని తెలుగమ్మాయిలా బాగా చూపించారు. ఖేనిష రొమాంటిక్ సీన్స్ బాగా చేసింది. మిస్టర్ థీఫ్ పాత్ర చేసిన అవినాష్ మాత్రం తెలంగాణ స్లాంగ్ తో నవ్వించాడు. అమాయకత్వం ఉన్న దొంగగా తను చేసే కొన్ని పనులు ఆడియన్స్ ని నవ్విస్తాయి. శ్రీధర్ కూడా తన పాత్రకి న్యాయం చేసాడు. అల్లరి ప్లస్ అమాయకత్వం మిక్స్ చేసిన చెల్లెలి పాత్రలో ఉషశ్రీ పెర్ఫార్మన్స్ బాగా చేసింది. విలన్ ట్రూప్ లో జీవ పెర్ఫార్మన్స్ బాగుంటుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మైనస్ పాయింట్ అంటే సింపుల్ స్టొరీ పాయింట్ ని 144 నిమిషాలు చెప్పాలనుకోవడం. ఇదొక రెగ్యులర్ రివెంజ్ డ్రామా. దాన్ని థ్రిల్లింగ్ గా చెప్పాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఆడియన్స్ కి అర్థమయ్యేలా పాయింట్ బై పాయింట్ వెళ్తే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే సామాన్య ప్రేక్షకుడికి కాస్త టిపికల్ గా అనిపించడమే కాకుండా, పాస్ట్ ఎపిసోడ్ లో సీన్ సీన్ కి పెద్దగా పొంతన కుదరదు. దాంతో ఆడియన్స్ కి ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్. స్క్రీన్ ప్లేని ప్రస్తుతం – గతం అనే ఫ్లేవర్ లో రాసుకున్నా కొంతమందికి ఫస్ట్ హాఫ్ సగం అయ్యేలోపు, ఆ కొంతమంది ఇంటర్వల్ లో క్లామక్స్ ఏంటనేది ఊహించేయగలరు. కావున సెకండాఫ్ కాస్త ఊహాజనితంగా వెళ్తుంటుంది.

ఇకపోతే సినిమాలో చాలా పాత్రలకి సరైన ఎస్టాబ్లిష్ మెంట్ లేదు. ఉదాహరణకి హీరో వచ్చి సినిమాల్లో యాక్టర్ గా ట్రై చేస్తున్నా అంటాడు, ఆ పాత్రని జస్టిఫై చేసేలా ఒక్క సీన్ కూడా లేదు. ఇదే మిస్టేక్ పలు పాత్రలకి కూడా జరిగింది. ఫస్ట్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వరుసగా పాటలు వచ్చి కాస్త ఇబ్బంది పెడతాయి. అలాగే సినిమాని తెలుగు ఆడియన్స్ కి నచ్చని ఒక ఫార్మాట్ లోముగించారు. ఈ మధ్య రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ సినిమాల ఎఫెక్ట్ అనుకుంటా చాలా ఫోర్స్ గా కామెడీని ఇరికించాలని ట్రై చేసాడు. ఉదాహరణకి వెన్నెల రామారావు ఎపిసోడ్స్, హీరో చెల్లెలికి చెప్పే స్టొరీ ఎపిసోడ్ లాంటివి. ఇక రన్ టైం కూడా సినిమాకి చాలా ఎక్కువే.. ఇదే సినిమాని 2 గంటల్లో చెప్పగలిగి ఉంటే సినిమా ఇంకా వేగవంతంగా, ఆసక్తికరంగా ఉండేది. విలనిజం ని స్ట్రాంగ్ గా చూపిస్తేనే హెఒయిజమ్ పండుద్ది అనటారు. ఆ లెక్క ప్రకారం విలనిజం ని ఈ సినిమాలో ఇంకాస్త బెటర్ గా రాసుకోవాల్సింది.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్ కి టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో బాగా హెల్ప్ అయ్యింది రెండు.. అవే మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేసిన ప్రతి ఫ్రేంని చాలా బాగా చూపించాడు. ఇక అజయ్ అరసాడ అందించిన పాటలు పెద్దగా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్. చాలా వరకూ ఆడియన్స్ ని సినిమాతో పాటు తీసుకెళ్ళేది రీ రికార్డింగ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి 20 నిమిషాలు చాలా బాగా ఆర్ఆర్ చేసాడు. ఎడిటర్ చంద్ర శేఖర్ డైరెక్టర్ చెప్పిన స్క్రీన్ ప్లే ప్రకారమే కట్ చేసినా, ఓవరాల్ గా ఓ సారి చూసాక సీన్స్ అన్ని చల్లినట్లుందని డైరెక్టర్ కి చెప్పి ఇంకాస్త బెటర్ మెంట్ చేసి ఉంటే బాగుండేది. రవి కంపిజ్ చేసిన స్టంట్స్ బాగున్నాయి.

ఇకపోతే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – పాటలు – దర్శకత్వం డిపార్ట్ మెంట్స్ ని సింగల్ హ్యాండ్ తో డీల్ చేసింది ప్రదీప్ నందన్. కథ – స్టొరీ పాయింట్ కొత్తదేమీ కాదు, కానీ నేపధ్యం కొత్తగా ఉండాలని ట్రై చేసాడు. కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే – ప్రజంట్ – పాస్ట్ ఫార్మాట్ లాంటి టిపికల్ స్క్రీన్ ప్లేని చెప్పడం కష్టం, ఫస్ట్ హాఫ్ లో ఇదే ఇబ్బందిని ప్రదీప్ కూడా చేసినట్లు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. కాస్త కన్ఫ్యూజన్ ఎక్కువ చేసేస్తాడు. డైలాగ్స్ – బాగున్నాయి. పాటలు – జస్ట్ ఓకే. డైరెక్షన్ – మొదటి సినిమా పరంగా పాస్ అయ్యాడనే చెప్పాలి. కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చాలా సీన్స్ లో ఈ సీన్ తీయడానికి ప్రదీప్ కి ఇంకాస్త మెచ్యూరిటీ కావాల్సింది. ముఖ్యంగా ఇదే సినిమాని వేరే ఎవరన్నా ఎస్టాబ్లిష్ అయిన యంగ్ హీరో తో తీసి ఉంటే తనకి ఇంకా మంచి సక్సెస్ వచ్చి ఉండేది. సినిమా విజయం సాధించాలి అనుకుంటే మనమనుకున్నదే కరెక్ట్ అని కాకుండా ఆడియన్స్ పాయింట్ అఫ్ వ్యూలో కూడా వెళ్ళాలి, అలా వెళ్తే విజయం తప్పక వరిస్తుంది. ఆదిశేషరెడ్డి నిర్మాణ విలువలు చాలా బాగా రిచ్ గానే ఉన్నాయి.

తీర్పు :

డిఫరెంట్ ప్రజంటేషన్ తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జగన్నాటకం’ సినిమా ప్రేక్షకులను ఓ మేరకు మెప్పిస్తుంది. ప్రజంట్ – పాస్ట్ అనే స్క్రీన్ ప్లే ఫార్మాట్ లో వచ్చిన ఈ సినిమా మొదటి అర్థ భాగంలో ఆడియన్స్ ని కాస్త ఇబ్బంది పెట్టినా ఇంటర్వెల్ నుంచి కాస్త బెటర్ గా మారుతూ క్లైమాక్స్ లో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు ఈ సినిమాకి హైలైట్ అయితే, బోరింగ్ మరియు కన్ఫ్యూజన్ గా అనిపించే మొదటి 30 నిమిషాలు, అనవసరమైన సాంగ్స్, ఇరికించిన కామెడీ ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. డిఫరెంట్ సినిమాలు కావాలని కోరుకునే వారు ఈ సినిమాని చూడచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు