సమీక్ష : మా అబ్బాయి – యాక్షన్ మోతాదు ఎక్కువైంది

Maa Abbai movie review

విడుదల తేదీ : మార్చి 17, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : కుమార్ వట్టి

నిర్మాతలు : బలగా ప్రకాష్ రావ్

సంగీతం : సురేష్ బొబ్బిలి

నటీనటులు : శ్రీ విష్ణు, చిత్ర శుక్

‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో మంచి నటుడిగా విమర్శకుల ప్రసంశలు అందుకున్న నటుడు శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం ‘మా అబ్బాయి’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడు కుమార్ వట్టి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎంతమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూద్దాం…

కథ :

అమ్మ, నాన్న, అక్క లతో కూడిన అందమైన కుటుంబంతో సంతోషంగా జీవితం గడిపే కుర్రాడు (శ్రీ విష్ణు) తమ కాలనీలోనే ఉండే అమ్మాయి (చిత్ర శుక్ల)ని ప్రేమిస్తూ ఆమెతో పరిచయం పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అలా సరదాగా గడిచిపోతున్న అతని జీవితంలో ఒకరోజు అనుకోని సంఘటన జరుగుతుంది.

ఆ సంఘటనతో అతని జీవితమే తలకిందులైపోతుంది. అలా తన జీవితం దుర్భరంగా తయారవడానికి కారణమైన వారిని పట్టుకొని శిక్షించాలని నిర్ణయించుకుంటాడు శ్రీ విష్ణు. అసలు అతని జీవితం తలకిందులయ్యే ఆ సంఘటన ఏమిటి ? దాని వలన హీరో ఏం కోల్పోయాడు ? దానికి కారణమైన వారు ఎవరు ? వాళ్ళను అతను ఎలా పట్టుకున్నాడు ? ఎలా శిక్షించాడు ? అతని ప్రేమ కథ ఏమైంది ? అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ అంటే ముందుగా చెప్పాల్సింది దర్శకుడు కుమార్ వట్టి గురించి. అతను తీసుకున్న పాయింట్ కాస్త రెగ్యులర్ దే అయినా దాన్ని ఒక కుటుంబానికి ఎమోషనల్ గా లింక్ చేసి సినిమాను నడపడం, హీరో చుట్టూ కుటుంబపరమైన భావోద్వేగాలు అల్లడం బాగున్నాయి. ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ మనసును తాకే విధంగా ఉంది. ఫస్టాఫ్లో హీరో హీరోయిన్ ల లవ్ ట్రాక్ ఆరంభమయ్యే విధానం కాస్త ఫ్రెష్ ఫీల్ ను ఇచ్చింది. శ్రీ విష్ణు, చిత్ర శుక్ల ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

హీరోయిన్ చిత్ర శుక్ల ఫస్టాఫ్ నుండి సినిమా చివరి వరకు చాలా సన్నివేశాలలో కనిపిస్తూ తన నటనతో, అందంతో మెప్పించింది. ‘గుచ్చి గుచ్చి చూడొద్దంటే..’ బీచ్ సాంగ్లో అందాలు చిలికి ఆకట్టుకుంది. హీరో కూడా వీలైనంత వరకు తనలోని మాస్ ఫేస్ ని బయటికి తీయడానికి ట్రై చేసి కష్టపడ్డాడు అనిపించాడు. ఇక ఫస్టాఫ్, సెకండాఫ్లలో హీరో తన శత్రువుల్ని వెతుక్కుని వెళ్లి, వాళ్ళను పట్టుకునే ప్రయత్నాలు కొన్ని లాజికల్ గా ఆకట్టుకున్నాయి. హీరో సమస్యను మొదట్లో వ్యక్తిగతంగా తీసుకుని ఆ తర్వాత దాన్ని సొసైటీ పరంగా చూస్తూ పరిష్కరించడం ఆకట్టుకుంది. శ్రీ విష్ణులోని మాస్ యాంగిల్ ను ఆవిష్కరిస్తూ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్లు కొన్ని బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని ప్రధాన మైనస్ పాయింట్ హెవీ సబ్జెక్ట్ హీరో శ్రీ విష్ణుకు సరిగా సెట్టవ్వకపోవడం. అతను చాలా చోట్ల కథను క్యారీ చేయలేకపోయాడు. ముఖ్యంగా కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల్లో అయితే ఆ లోటు స్పష్టంగా కనిపించింది. హీరో తన శత్రువుల్ని వెతికే సందర్భంలో చేసే కొన్ని పనులు లాజికల్ గా బాగానే ఉన్న ఇంకొన్ని మాత్రం వాస్తవానికి కాస్త దూరంగా ఉన్నాయి. హీరో పెద్దగా కష్టపడకుండా చాలా పరిస్థితులు ఎక్కడికక్కడ చక్కబడిపోతూ అతనికి దారివ్వడం కాస్త ఓవర్ గా ఉంది.

ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉన్న క్రిమినల్స్ హీరోకి చాలా సులభంగా దొరికిపోతూ పలుమార్లు ఓడిపోతుండటం వలన సినిమా చాలా వరకు హీరో చేస్తున్న వన్ మ్యాన్ షో మాదిరి తయారైంది. ఇక సినిమా పాటలు కొన్ని బాగున్నా అవి బలవంతంగా ఉన్నట్టుండి కథనం మధ్యలోకి దూసుకొచ్చేయడం, హీరో సీరియస్ సిట్యుయేషన్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కుటుంబపరమైన సరదా సన్నివేశాలు రావడం నిప్పులపై నీళ్లు చల్లినట్టు ఉంది. దర్శకుడు తన రచనా తృష్ణతో మంచిదే అయినా కూడా కథనానికి అంతగా అవసరంలేని కొంత ఫ్యామిలీ డ్రామాను కథనంలో ఇరికించి మరీ నడపడం ఏమంత బాగోలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు, రచయిత అయినా కుమార్ వట్టి తీసుకున్నది రోటీన్ పాయింటే అయినప్పటికీ దానికి ఒక కుటుంబాన్ని లింక్ చేసి సినిమా నడపాలనే అతని ఆలోచన బాగుంది. డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల ఆకట్టుకున్నాయి. కుమార్ రూపొందించిన ఫస్టాఫ్ పర్లేదనిపించినా సెకండాఫ్లో కథ సీరియస్ మోడ్లోకి వెళ్లిన కాసేపటికి కొన్ని ఓవర్ అనిపించే, అసందర్భపు సన్నివేశాలు, పాటలతో కథనాని నెమ్మదించేలా చేయడం, కథను హీరో మోయలేనంత హెవీగా తయారవడం వంటి అంశాల వలన అతను గొప్ప ఫలితాన్నైతే రాబట్టలేకపోయాడు.

ఇక థ‌మ‌శ్యామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదు. మార్తాండ్.కె.వెంక‌టేష్ ఎడిటింగ్ బాగుంది. సెకండాఫ్లో ఇంకొన్ని అనవసరమైన సీన్లను తొలగించాల్సింది. హీరోకి కొంచెం ఎక్కువే అయినా యాక్షన్ సన్నివేశాల కంపోజింగ్ మాత్రం బాగుంది. బ‌ల‌గా ప్ర‌కాష్ రావు నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

శ్రీ విష్ణు ఫుల్ లెంగ్త్ మాస్ హీరోగా కనబడాలని ట్రై చేసిన ఈ ‘మా అబ్బాయి’ చిత్రం ఏమంత గొప్పగా విజయవంతం కాలేదు. ఇందులో మంచి ఫ్యామిలీ సెంటిమెంట్, ఆకట్టుకునే లవ్ ట్రాక్, కొన్ని మైండ్ గేమ్ ఎపిసోడ్స్, హీరోయిన్ గ్లామరస్ పెర్ఫార్మెన్స్ వంటి బలాలు ఉన్నా కూడా హీరో స్థాయికి మించిన బరువైన సబ్జెక్ట్, ఓవర్ ఎగ్జైట్మెంట్ మూలంగా దర్శకుడు బలవంతంగా కథనంలోకి జొప్పించిన అనవసరమైన సన్నివేశాలు, కొన్ని పాటలు, అసహజంగా అనిపించే కొన్ని కీలక సన్నివేశాలు వంటి అంశాలన్నీ కలిసి ఈ చిత్రాన్ని బిలో యావరేజ్ అనేలా తయారుచేశాయి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :