సమీక్ష : నమస్తే నేస్తమా – ఆకట్టుకోని పాతకాలపు రివేంజ్ డ్రామా

Hulchul review

విడుదల తేదీ : జనవరి 03, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు :  శ్రీరామ్, ఈశాన్య మహేశ్వరీ, నాసర్, సాయాజీ షిండే, బ్రహ్మనందం, తాగుబోతు రమేష్ తదితరులు

దర్శకత్వం : కె సి బొకాడియా

నిర్మాత‌లు : బిఎంబి అండ్ మాగ్నటిక్ లిమిటెడ్

సంగీతం :  బప్పీలహరి

హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో సీనియర్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ మరియు దర్శకుడు కె సి బొకాడియా తెరకెక్కించిన చిత్రం నమస్తే నేస్తమా. నేడు ఈ మూవీ విడుదలైంది. నమస్తే నేస్తమా చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..

 

కథ :

ఒక సిన్సియర్ పోలీస్ అధికారి అయిన సంతోష్ ( శ్రీరామ్) రాకీ అనే ఓ కుక్కపిల్లను పెంచి పెద్ద చేయడమే కాకుండా దానికి మంచి పోలీస్ శిక్షణ ఇస్తాడు. స్థానిక పొలిటీషియన్ (సాయాజీ షిండే) చేసే దుర్మార్గాలను సంతోష్ ప్రశ్నించినందుకు అతన్ని చంపివేస్తాడు. తనను ప్రేమగా పెంచిన యజమాని సంతోష్ ని చంపిన వారిపై రాకీ ఎలా పగతీర్చుకుంది అనేది మిగతా కథాంశం…

 

ప్లస్ పాయింట్స్ :

సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో హీరో శ్రీరామ్ అలరిస్తారు. ఒక సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో ఆయన పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నారు. శ్రీరామ్ భార్య పాత్ర చేసిన ఈశాన్య తో అతని కెమిస్ట్రీ మరియు వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి.

ఈశాన్య హీరో భార్య పాత్రలో చక్కని నటన కనపరిచింది. ఆమె గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకున్నారు. భావోద్వేగ సన్నివేశాలలో ఆమె నటన చాలా బాగుంది.

హీరో శ్రీరాం కి సపోర్ట్ ఇచ్చే పోలీస్ అధికారిగా నాజర్, ప్రాముఖ్యం ఉన్న పాత్ర దక్కించుకున్న తాగుబోతు రమేష్ సినిమాకు ఆకర్షణగా నిలిచారు. కొంత గ్యాప్ తరువాత ఈ చిత్రంలో మంచి బ్రహ్మనందం కామెడీ రోల్ చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ లను బాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శక నిర్మాత కె సి బొకాడియాకు ఇన్నేళ్లకు ఓ తెలుగు సినిమా ఎందుకు చేయాలనిపించిందో అంతుపట్టని విషయం. ఆయన ఈ సినిమాను 80ల కాలం నాటి మూవీ మేకింగ్ ఫార్ములా మరియు ఎమోషన్స్ తో తెరకెక్కించారు. ఆయన ఎంచుకున్న సబ్జెట్, ఇచ్చిన ట్రీట్మెంట్ ఒకప్పటి చిత్రాలను తలపిస్తాయి.

తనను ప్రేమగా చూసుకున్న యజమానిని చంపిన వారిపై పగ తీర్చుకొనే జంతువుల సినిమాలు ఇప్పటికే చాలా రావడం జరిగింది. అందుకే ఈ చిత్రం ఎక్కడా కొత్తగా అనిపించదు.

ఎంతో అర్థ బలం, అంగబలం, అధికార బలం ఉన్న ఎం ఎల్ ఏ ఒక కుక్కను చూసి చావు భయం అనుభవించడం నమ్మబుద్ది కాదు. అలాగే ఓ కుక్క బలమైన గుండాలను సులభంగా వెంటబడి చంపివేయడం వంటి సన్నివేశాలు ఆహ్లదం కలిగించకపోగా సిల్లీగా తోస్తాయి.

 

సాంకేతిక విభాగం:

నిర్మాణ విలువలు ఈ మూవీలో రిచ్ గా ఉన్నప్పటికీ పాతకాలపు కథతో తెరకెక్కిన సినిమాకు అవి ఆకర్షణ కాలేకపోయాయి. ఈ చిత్రంలో పాటలు మరియు బీజీఎమ్ పరవాలేదు అన్నట్లుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ కొంత మేర ఆకట్టుకుంటాయి.

మొదటి సగంలో ఎడిటింగ్ విఫలం చెందింది, మాటలు ఆకట్టుకుంటాయి. ఈ ఓల్డ్ స్కూల్ స్టోరీలో జరగబోయే సన్నివేశాలు ప్రేక్షకుడికి తెలిసిపోతుంటాయి. ఇక దర్శకుడు బొకాడియా గురించి చెప్పాలంటే ఆయన ఎంచుకున్న కథ, దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రేక్షకుడికి ఏమాత్రం ఆహ్లాదం కలిగించవు. ఆయన ఎప్పుడో 80ల కాలం నాటి ఓల్డ్ ఫార్మాట్ లో చిత్రం తెరకెక్కించారు. ఐతే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

 

తీర్పు:

మొత్తంగా చెప్పాలంటే నమస్తే నేస్తమా పాతకాలపు రివేంజ్ డ్రామా. దర్శకుడు పాత చింతకాయ పచ్చడి లాంటి కథ, కథనాలతో ప్రేక్షకుడికి పరీక్ష పెట్టారు. ఏమాత్రం ఆసక్తి కలిగించిన సన్నివేశాలతో సాగే ఈ మూవీలోని తర్వాత వచ్చే సన్నివేశాలు తెలిసిపోతూ ఉంటాయి. ట్విస్ట్స్ మరియు లాజిక్స్ లేకుండా సాగే ఈ చిత్రం ప్రేక్షకుడిని నిరాశకు గురిచేస్తుంది. అక్కడక్కగా ఆకట్టుకొనే కొన్ని సన్నివేశాలు మరియు భావోద్వేగ సన్నివేశాలు మినహా ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ అంశాలేమి లేవు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం :