Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఒక్క అమ్మాయి తప్ప – ఫర్వాలేదనిపించే కొత్త ప్రయత్నం!

Okka Ammayi Thappa review

విడుదల తేదీ : 10 జూన్, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : రాజసింహా తాడినాడ

నిర్మాత : అంజిరెడ్డి

సంగీతం : మిక్కీ జె మేయర్

నటీనటులు : సందీప్ కిషన్, నిత్యా మీనన్, రవికిషన్


అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై భోగాది అంజిరెడ్డి నిర్మాతగా రాజసింహ తాడినాడని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన రొమాంటిక్ థ్రిల్లర్ ’ఒక్క అమ్మాయి తప్ప’. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించింది. ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో, ఓ ఫ్లై ఓవర్‌పై నడిచే కథ కావడంతో ’ఒక్క అమ్మాయి తప్ప’పై మొదట్నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకునేలానే ఉందా? చూద్దాం..

కథ :

జైల్లో ఉన్న టెర్రరిస్ట్ అస్లాం (రాహుల్ దేవ్)ని విడిపించడానికి ఓ టెర్రరిస్ట్ గ్రూప్ హెడ్ అయిన అన్వర్ (రవికిషన్) హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేసి ఫ్లై ఓవర్ ని బాంబులతో పేల్చివేస్తామని ప్రభుత్వాన్ని బెదిరించాలని ప్లాన్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా రమ్మీ ఆడటంలో ఎక్స్పర్ట్ అయిన కృష్ణ వచన్ (సందీప్ కిషన్) అనుకోకుండా హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ జామ్ లో మ్యాంగో (నిత్యామీనన్) ని కలుస్తాడు. తనే తన చిన్నప్పటి స్నేహితురాలు మ్యాంగో అని తెలుసుకుంటాడు. ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న హీరోకి ఓ అగంతకుడి దగ్గర నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరోకి, ఈ టెర్రరిస్ట్ గ్రూప్ కి సంబంధం ఏంటి? టెర్రరిస్ట్ అస్లాం జైలు నుంచి విడుదల అయ్యాడా? అసలు చివరికి ఏం జరిగింది? అన్నది మిగతా కథ

ప్లస్ పాయింట్స్ :

సందీప్ కిషన్ నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు సీరియస్ సన్నివేశాల్లో కూడా సందీప్ నటన ఆకట్టుకుంటుంది. మంచి ప్రతిభ గల నటిగా పేరుతెచ్చుకున్న నిత్యామీనన్ మ్యాంగో పాత్రలో ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్‌గా నిలిచింది. నిత్యామీనన్ ది చెప్పుకోదగిన పాత్ర కాకపోయినా, తన నటనతో ఆకట్టుకుంది.

స్నేహం, ప్రేమ, టెర్రరిజం ఇలా మూడు అంశాలను ఒక ఫార్ములా కథకు కలిపి చెప్పడం బాగా ఆకట్టుకునే అంశం. ఇక సెకండాఫ్ లోనే అసలైన కథ మొదలవడంతో సినిమా ఆసక్తికలిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచీ చివరి ముప్పయి నిముషాలు ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునే స్థాయిలో లేవు. హీరో, హీరోయిన్ల చిన్నప్పటి లవ్ ట్రాక్ ఎటువంటి ఎమోషన్ కలిగించకపోవడంతో పాటు విసిగిస్తుంది కూడా. ఆలీ పాత్రలో చేసిన కామెడీ ఏమాత్రం ఆకట్టుకోదు. రవి కిషన్ లౌడ్ యాక్టింగ్‍తో విసిగించాడు. అలాగే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గడంతో పాటు సినిమాని అక్కడక్కడా సాగదీశారు. ఇక ఈ సినిమాకు మైనస్ పాయింట్ ఏమిటంటే దర్శకుడు కొత్త థ్రిల్లర్ లైన్ అనుకున్నా, రెగ్యులర్ ఫార్ములా లాగా ప్రేమకథ చుట్టూనే ఎక్కువసేపు కథను నడపడం.

అలాగే కథాంశం బలమైనదే అయినా కొత్తది కాదు. అంతేకాకుండా కథ విషయంలో ఎప్పుడూ కొత్తదనం కోరుకునేవారికి, రెగ్యులర్ కథలను పెద్దగా ఇష్టపడని వారికి కూడా ఈ కథలో తాము కోరుకునే అంశాలు తక్కువ. అంతేకాకుండా ఈ సినిమాలో కామెడీ లేకపోవడం, ఉన్న కామెడీ కూడా పండకపోవడం ఈ సినిమాకి మైనస్ గా మారింది. ఇక ఈ సినిమాలో చాలా చోట్ల లాజిక్ ని పూర్తిగా వదిలేసారు. టైటిల్ కూడా తప్పుదారిపట్టించేలా ఉండటం మరో పెద్ద మైనస్ అని చెప్పవచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందుగా నూతన దర్శకుడు రాజసింహ తాడినాడ ఓ వైవిధ్యమైన కథనే రాసుకుని స్నేహం, ప్రేమ, టెర్రరిజం చుట్టూ నడిపించే ప్రయత్నం చేశారు. కానీ పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయాడు. కథ సింపుల్ పాయింట్ కావడంతో స్క్రీన్ ప్లే చాలా తెలివిగా, ఆసక్తికలిగించే విధంగా రాసుకోవాల్సింది. ప్రధమార్థంలో విసిగించిన దర్శకుడు ద్వితీయార్థంలో మాత్రం ఫర్వాలేదనిపిస్తాడు. ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి మాత్రం రచయితగా, దర్శకుడిగా రాజసింహ మంచి ప్రతిభ చూపాడు.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలో ప్రతి ఫ్రేం చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉండేలా సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. ’ఎగిరెనే ఎగిరెనే…’ పాటలో వచ్చే విజువల్స్ ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా రాత్రి ఎఫెక్ట్ లో తీసిన సన్నివేశాలకు ఇచ్చిన లైటింగ్ బావుంది. గ్రాఫిక్స్ కొద్దిచోట్ల ఫరవాలేదనిపించినా ఎక్కువగా తేలిపోయాయి. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు బాగున్నాయి. కథకు తగ్గట్టుగా మంచి నేపథ్య సంగీతం అందించాడు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

మొదట్నుంచీ ప్రచారం పొందినట్లుగానే ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాకు ఉన్నంతలో కథే బలం. అయితే ఆ కథను పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో తప్పటడుగులు వేయడంతో ఈ సినిమా మంచి థ్రిల్లర్‌గా నిలవలేకపోయింది. సందీప్ కిషన్, నిత్యా మీనన్‌ల నటన, కొత్తగా కనిపించే కథ, సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు పనితనం, ఫర్వాలేదనిపించే క్లైమాక్స్ లాంటి అనుకూలాంశాలతో వచ్చిన ఈ సినిమాలో కథనం బాగోలేకపోవడం, ప్రేక్షకుడిని కట్టిపడేసే సన్నివేశాలు ఎక్కడా లేకపోవడం, ఎంటర్‌టైనింగ్ అంశాలు కూడా లేకపోవడం లాంటివి ప్రతికూలాంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎటువంటి అంచనాలు లేకుండా, కొత్త ప్రయత్నమేదో చేస్తే చూద్దామనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :