Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : పందెం కోళ్ళు – రియలిస్టిక్ మాస్ ఎంటర్టైనర్.!

pandem-kollu విడుదల తేదీ : 30 జనవరి 2015
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : వెట్రి మారన్
నిర్మాత : శేఖర్ బాబు – కిషోర్ కుమార్ రెడ్డి
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
నటీనటులు : ధనుష్, తాప్సీ


తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘రఘువరన్ బిటెక్’ సినిమా ఈ న్యూ ఇయర్ కానుకగా తెలుగులో విడుదలై తొలి హిట్ గా నమోదైంది. అంతే కాకుండా ధనుష్ కి తెలుగులో మొదటి హిట్ ని అందించింది. ఆ విజయంతో ధనుష్ హీరోగా 2011లో హిట్ అయిన ‘ఆడుకలం’ అనే సినిమాని తెలుగులో ‘పందెం కోళ్ళు’గా రిలీజ్ చేసారు. ఈ సినిమాతో సొట్ట బుగ్గల సుందరి తాప్సీ హీరోయిన్ గా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమాకి తమిళంలో నేషనల్ అవార్డు వచ్చింది. మరి తమిళ ప్రేక్షకులను మెప్పించి నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగువారిని ఎంత వరకూ మెప్పించిందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

మన తాత ముత్తాతల కాలం నుంచి కోడి పందేలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అవి చాలా చోట్ల కనిపించకపోయినా మన ఆంధ్రపదేశ్ లో మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అలా పల్నాడు ప్రాంతంలో కోడి పందేలను ఇంటి పరువుగా భావించే ఒక ఊరి కథ ఇది. అలాగే ఒక గురు శిష్యుల అహం మధ్య జరిగే కథ అని కూడా చెప్పవచ్చు.

పోతురాజు(జయ పాలన్) – రంస్వామి(నరేన్) మధ్య కోడి పందెంల పోరు ప్రతి ఏడు జరుగుతుంది. కానీ రంగస్వామి ప్రతి సారి పోతురాజు చేతిలో ఓడిపోతూ ఉంటాడు. ఎప్పటికైనా పోతురాజు మీద గెలవాలనేదే రంగస్వామి కోరిక. పోతురాజుకి సపోర్ట్ గా దుర్గ(కిషోర్) – లింగం(ధనుష్) ఉంటారు. ఇలా కోడి పందెంలు జరిగే టైంలో లింగం చదువుకున్న ఫ్యామిలీలో పుట్టిన ఐరిన్(తాప్సీ)ని చూసి ప్రేమలో పడతాడు. అదలా ఉండగా పోతురాజు – రంగస్వామి మధ్య జరిగిన ఓ చాలెంజ్ వల్ల ఓ భారీ కోడి పందెలా ఈవెంట్ కి తెరలేస్తుంది. ఈ కోడి పందెలు జరిగే టైంలో పోతురాజుకి లింగంకి మధ్య గొడవ జరుగుతుంది.? అసలు గురు శిష్యులైన పోతురాజు – లింగం మధ్య ఎందుకు గొడవ జరిగింది.? ఆ గొడవ వల్ల వారిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.? వీరిద్దరి మధ్య గొడవకి రంగస్వామికి ఏమన్నా సంబంధం ఉందా అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

టోటల్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో కోడి పందేలను మెయిన్ పాయింట్ గా చేసుకొని ఇలాంటి ఓ కమర్షియల్ చెయ్యడానికి కథ రాసుకున్న వెట్రి మారన్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ధనుష్. ధనుష్ పక్కా విలేజ్ కుర్రాడి లుక్ కి ధనుష్ పర్ఫెక్ట్ గా సరిపోయాడు. సినిమాలో ఎక్కువ భాగం లుంగీలలో కనిపిస్తూ టోటల్ మాస్ లుక్ లో అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ధనుష్ కి నేషనల్ అవార్డు ఇవ్వడంలో తప్పేలేదని అంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే లింగం పాత్రలో ధనుష్ యాక్టింగ్ అదరగొట్టాడు. ఇక తాప్సీ నటించిన మొదటి తమిళ సినిమా ఇది. ఈ మూవీలో తాప్సీ చాలా క్యూట్ గా ఉంది. అలాగే క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకునెలా పెర్ఫార్మన్స్ ఇచ్చింది.

ఇక ఈ సినిమాలో మేజర్ రోల్స్ చేసిన కిషోర్, నరేన్, జయపాలన్ లు తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు కానీ వారు మాత్రం వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. వీళ్ళకంటే ఎక్కువ పాత్రలు ఇందులో లేవు. సినిమాలో మెయిన్ రోల్స్ చేసిన ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలకు బాగా సెట్ అయ్యారు. ఇకపోతే సినిమాకి ఫస్ట్ హాఫ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, ముఖ్యంగా ధనుష్ – తాప్సీ మధ్య జరిగే లవ్ ట్రాక్ అన్ని సెంటర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఒక డిఫరెంట్ ఫీల్ ని కలిగిస్తుంది. ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే మనం కూడా ధనుష్ కలిసి డాన్స్ చెయ్యాలి అనే రేంజ్ లో ఉంటుంది.

ఇది కాకుండా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే కోడి పందేల ఎపిసోడ్ చాలా బాగుంటుంది. చూసే ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది అలాగే ఈ సినిమా అండర్ మిస్టరీగా వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్ క్లైమాక్స్ లో బాగా పేలాయి. సెకండాఫ్ లో హ్యూమన్ ఎమోషన్స్ ని బాగా చూపించారు. ఇవి నిజ జీవితంలో జరిగేవే అయినా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేసాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ సినిమా నిడివి.. సెకండాఫ్ లో ఎక్కువగా హ్యూమన్ ఎమోషన్స్ మీద రన్ చేయడం వలన అక్కడక్కడా బోర్ కొడుతుంది. సెకండాఫ్ లో కొన్ని సాగదీసినట్టు ఉండే సీన్స్ ని కట్ చేసి ఉంటె బాగుండేది. దీనివల్లే సినిమా రన్ టైం బాగా ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో నటించిన మెయిన్ నటీనటులు తెలుగుకి కొత్తవారు కావడం వలన తెలుగు ఆడియన్స్ వారికి కనెక్ట్ అవ్వడానికి బాగా టైం పడుతుంది. అలాగే సినిమా మన నేటివిటీకి కాస్త దూరంగా, తమిళ నేటివిటీకి దగ్గరగా అనిపిస్తుంది. ఇక పోతే ఈ సినిమా పూర్తి రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం వలన మల్టీ ప్లెక్స్ మరియు ఎ సెంటర్ ఆడియన్స్ కి పెద్దగా నచ్చకపోవచ్చు. సెకండాఫ్ లో కాస్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సింది.

సాంకేతిక విభాగం :

ఒక్క ప్రొడక్షన్ టీం తప్ప మిగతా అన్ని డిపార్ట్ మెంట్స్ వారు ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసారు. వెట్రి మారన్ రాసుకున్న కథ – కథనం – దర్శకత్వం మూడు బాగున్నాయి. కోడి పందెం అనే పాయింట్ కి హ్యూమన్ ఎమోషన్స్ ని జోడించి చాలా బాగా కథని రాసుకున్నాడు. కథనం కూడా ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇక దర్శకత్వం పరంగా ఒక్కొక్కరి నుంచి ముక్కు పిండి మరీ పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. అందుకే అందరూ పాత్రల్లో జీవించారు. వెట్రి మారన్ అనుకున్న విజువల్స్ ని తీసుకురావడంలో వేల్రాజ్ ప్రాణం పోస్తే ఆ విజువల్స్ లోని ఫీల్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో జివి ప్రకాష్ కుమార్ ప్రాణం పోసాడు. జివి ప్రకాష్ అందించిన ట్యూన్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయాయి. వనమాలి తెలుగు లిరిక్స్ బాగా రాసాడు. అలాగే ఎం. రాజశేఖర్ రెడ్డి డైలాగ్స్ చాలా బాగా రాసాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాలేవు. ఒక డబ్బింగ్ సినిమాలో ఉండాల్సిన ముఖ్యమైన పాయింట్, తమిళ్ లో ఉన్న వాటిని తెలుగులో చూపించడం, కనీసం అన్ని చూపకపోయినా కథ చెప్పేటప్పుడు కింద వేసే లైన్స్ ని అన్నా తెలుగులో చూపాలి. కానీ దాన్ని కూడా సరిగా చూపలేదు. డబ్బింగ్ వర్క్ బాగుంది.

తీర్పు :

ఈ సంవత్సరం ధనుష్ నుంచి వచ్చిన రెండవ డబ్బింగ్ సినిమా ‘పందెం కోళ్ళు’ కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. మాస్ ఆడియన్స్ కి నచ్చేలా కోడి పందేల చుట్టూ తిరిగే ఈ కథని డైరెక్టర్ వెట్రి మారన్ చాలా పర్ఫెక్ట్ గా డీల్ చేసాడు. ధనుష్ ఎనర్జిటిక్ అండ్ మాస్ పెర్ఫార్మన్స్, తాప్సీ క్యూట్ లుక్స్, సూపర్బ్ అనిపించే లవ్ ట్రాక్, అందరికీ కనెక్ట్ అయ్యే హ్యూమన్ ఎమోషన్స్, కాన్సెప్ట్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ అయితే తమిళ నేటివిటీ ఎక్కువ కనిపించడం, సెకండాఫ్ కాస్త సాగదీసినట్టు ఉండడం, నటీనటులు తెలుగు వారికి పెద్దగా తెలియకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ఫుల్ క్లాస్ సినిమా కావనుకునే వారికి తప్ప మిగతా వారందరికీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చే సినిమా ‘పందెం కోళ్ళు’.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :