సమీక్ష : పేట – రజిని ఫ్యాన్స్ కు మాత్రమే

సమీక్ష : పేట – రజిని ఫ్యాన్స్ కు మాత్రమే

Published on Jan 12, 2019 7:19 PM IST
Petta movie review

విడుదల తేదీ : జనవరి 10, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రజినీకాంత్, సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష తదితరులు.

దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్

నిర్మాత : కళానిధి మారన్

సంగీతం : అనిరుద్ రవిచందర్

సినిమాటోగ్రఫర్ : యస్ తిరు

ఎడిటర్ : వివేక్ హర్షన్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘పేట’. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

కాళీ (రజిని కాంత్) భారీ రికమండేషన్ ఓ మాములు హాస్టల్ లో వార్డెన్ గా జాయిన్ అవుతాడు. అక్కడ జరిగే ర్యాగింగ్ ని తన స్టైల్ లో ఆపుతాడు. ఆ క్రమంలో ఒక ప్రేమ జంటకి వారి ప్రేమ విషయంలో సహాయం చెయ్యటానికి అంగీకరిస్తాడు. ఆ ప్రోసెస్ లో ప్రాణిక్ హీలర్ గా పనిచేసే సిమ్రాన్ తో రజినికి పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతున్న క్రమంలో కొన్ని ఊహించని సంఘటనల మధ్య రజిని పై, ప్రేమ విషయంలో రజిని సహాయం చేస్తోన్న ఆ కుర్రాడి పై ఒక గ్యాంగ్ దాడి చేస్తోంది. ఆ దాడి అనంతరం జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రజిని గతం గురించి తెలుస్తోంది. ఆ గతం ఏమిటి ? అసలు రజినీకి ఆ కుర్రాడికి ఏమిటి సంబంధం ? రజిని మరియు ఆ కుర్రాడి పై దాడి చేసిన ఆ గ్యాంగ్ ఎవరు? అసలు రజిని వార్డెన్ గా ఎందుకు జాయిన్ అయ్యాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంతో రజినీ మళ్ళీ పాత రజినిని గుర్తుకుతెచ్చాడు. హాస్టల్ వార్డెన్ పాత్రలో నటించిన ఆయన, తన పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, తన మార్క్ యాక్టింగ్ తో స్టయిల్ తో సినిమాకి హైలెట్ గా నిలచారు. అలాగే తన కామెడీ టైమింగ్ తోనూ రజిని అక్కడక్కడ నవ్విస్తారు.

మరో కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో పాటు తన కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో హీరోయిన్స్ గా నటించిన సిమ్రాన్, త్రిష పాత్ర పరిధిలో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించినా తమ నటనతో తమ గ్లామర్ తో ఆకట్టుకుంటారు.

అలాగే విలన్ గా నటించిన నవాజుద్దిన్ సిధ్దిఖి కూడా చాలా బాగా చేశాడు. క్రూరత్వంతో కూడుకున్న ఒక బలహీనమైన విలన్ గా ఆయన నటన బాగుంది. ఇక డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రజినీ స్టైల్ ని, మ్యానరిజం ను పూర్తిగా వాడుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాంతో ఈ చిత్రం రజిని అభిమానులను బాగానే అలరిస్తోంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్నేహానికి,  పగకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. చాలా సన్నివేశాలను ఆయన నెమ్మదిగా నడిపి బోర్ కొట్టించారు. హీరో, విలన్ల మధ్యన వచ్చే పగ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు సినిమాలోని సెకెండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు చాలా సాగతీతగా అనిపిస్తాయి.

మొదటి భాగంలో రజిని – సిమ్రాన్ మధ్య లవ్ ట్రాక్ సరదాగా సాగినప్పటికీ.. సెకెండాఫ్ లో ఆ లవ్ ట్రాక్ ను ఇంకా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో ఆ లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు. యాక్షన్ ప్లో కి అడ్డు అని అనుకున్నా.. కనీసం ఆ లవ్ ట్రాక్ కి సరైన ముగింపు ఇవ్వాల్సింది. కానీ అసలు ముగింపే ఇవ్వలేదు.

పైగా సినిమాలో అక్కడక్కడ తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్ ల దగ్గరనుంచి వారి హావాభావాలు దాకా తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి. మొత్తానికి దర్శకుడు కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. కార్తీక్ సుబ్బరాజు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథా కథనాలని రాసుకోలేకపోయారు. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నే విధంగా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘పేట’. రజినితో పాటు సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. చిత్రంలో కొన్ని మెప్పించే అంశాలు ఉన్నప్పటికీ, ముఖ్యమైన కథనం నెమ్మదిగా సాగడం, సినిమాలో మెయిన్ థీమ్ కు తగట్లు ట్రీట్మెంట్ లేకపోవడం, ఆకట్టుకునే విధంగా సన్నివేశాలను రూపొందించలేకపోవడం, సినిమాలో కొన్ని సన్నివేశాలు తెలుగు నేటివిటీకి కొంచెం దూరంగా అనిపించడం.. వంటి అంశాలు సినిమాకు బలహీనతలుగా నిలుస్తాయి.

అయితే, హీరోహీరోయిన్ల మధ్య కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు రజిని మార్క్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు, కేవలం రజిని అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా చేసినట్లు అనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా మాములు ప్రేక్షకుల్ని పూర్తిగా మెప్పించలేకపోవచ్చు. కేవలం రజిని అభిమానులకు మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు