సమీక్ష : ప్రతి రోజు పండగే – కామెడీ వరకు బాగుంది !

సమీక్ష : ప్రతి రోజు పండగే – కామెడీ వరకు బాగుంది !

Published on Dec 21, 2019 3:07 AM IST
PratiRojuPandaage review

విడుదల తేదీ : డిసెంబర్  20, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు :  సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, విజయ్ కుమార్, నరేష్, సత్య, మహేష్ తదితరులు.

దర్శకత్వం : మారుతి

నిర్మాత‌లు : బన్నీ వాసు

సంగీతం :  ఎస్ ఎస్ థమన్

సినిమాటోగ్రఫర్ : జయ కుమార్

ఎడిటర్:  కోటగిరి వెంకటేశ్వర రావు

 

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.. మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం “ప్రతిరోజూ పండగే”. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

రఘురామయ్య (సత్యరాజ్) లంగ్ క్యాన్సర్ తో బాధపడతుంటాడు. ఇక ఆయన ఎక్కువ కాలం బ్రతకడని డాక్టర్లు చెబుతారు. ఆయన కొడుకులు మనవళ్ళు, మనవరాళ్లు అందరూ యూఎస్, ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయి ఉంటారు. ఈ నేపథ్యంలో తన తాతయ్య ఆఖరి రోజుల్లో గడిపే ఆ కొన్ని రోజులు అయినా సంతోషంగా ఉంచాలని యూఎస్ నుంచి సాయి తేజ్(సాయి ధరమ్ తేజ్) తన ఊరికి వస్తాడు. తన సంతోషం కోసం తన కుటుంబాన్ని ఒకే చోటుకు ఎలా చేర్చాడు ? ఈ క్రమంలో అతని ఎలాంటి ప్లాన్ లు వేశాడు ? ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అసలు ఇంతకీ రఘురామయ్య (సత్యరాజ్)కు నిజంగానే లంగ్ క్యాన్సర్ వచ్చిందా లేదా ప్లానా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ప్ర‌స్తుతం అందరి జీవితాల్లోని ఆ అంశం ఆధారంగా మారుతి ఈ కథను రాసుకోవడం.. ఆ కథకు చక్కని ట్రీట్మెంట్ తో పాటు మంచి ఎమోషనల్ అండ్ కామెడీ స‌న్నివేశాలు బాగా రాసుకున్నాడు. ప్ర‌ధానమైన పాత్ర‌ధారి స‌త్య‌రాజ్ పాత్ర చుట్టూ ఆయన అల్లిన డ్రామా చాల బాగుంది. హీరోగా సాయితేజ్ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో తన పాత్ర‌లో చాల బాగా న‌టించాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాల బాగా ఆకట్టుకుంటుంది.

ఇక రఘురామ‌య్య పాత్ర‌లో సత్యరాజ్ ప‌ర‌కాయం ప్ర‌వేశం చేస్తూ.. తన పాత్రకు తగ్గట్లుగానే మంచి ఎమోష‌నల్ టచ్ ఇచ్చాడు. అలాగే మ‌రో ప్ర‌ధాన‌మైన పాత్ర రావు ర‌మేష్‌ త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశారు. తానూ ఇండియా వచ్చే సన్నివేశంలో ఆయన నటన తీరు, ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా అనిపిస్తోంది.

ఎంజెల్ అర్ణ పాత్ర‌లో నటించిన రాశీఖ‌న్నా తన గ్లామర్ తో బాగా ఆట్టుకుంటుంది. ఆమె పాత్ర కూడా కామెడీగా సాగుతూ బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది, ఇక మిగిలిన నటీనటులు హ‌రితేజ‌, ప్ర‌వీణ్‌, అజ‌య్‌, స‌త్యం రాజేష్‌ అలాగే ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు మారుతి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను మాత్రం రాసుకోలేదు. ముఖ్యంగా కథనం విషయంలో మారుతి మెప్పించలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అలాగే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లు చాల స్లోగా సాగుతాయి. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునే విధంగా లేవు.

అసలు సత్యరాజ్ కుటుంబం ఎంత స్వార్థపూరితమైనప్పటికీ కొన్ని సన్నివేశాలు సహజత్వానికి దూరంగా సాగుతాయి. క్లైమాక్స్ కూడా మరో లోపం. క్లైమాక్స్ లోని ఎమోషన్, మిగిలిన పాత్రలు మారే సీన్ కొంచెం అసంబద్ధంగా అనిపిస్తాయి, మారుతి స్క్రిప్ట్ పై ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే సినిమా అవుట్ ఫుట్ ఇంకా బెటర్ గా వచ్చి ఉండేది.
 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. ముందే చెప్పకున్నట్లు దర్శకుడు మారుతి మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన కథనాన్ని రాసుకోలేకపోయారు. తమన్ పాటలు చాలా బాగున్నాయి. అలాగే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ల నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కామెడీగా సాగుతూ అక్కడక్కడా మంచి ఫీల్ తో బాగానే ఆకట్టుకుంటుంది. అయితే కీలకమైన ఎమోషన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవడం, అలాగే కథనం కూడా కొన్ని చోట్ల ఇంట్రస్టింగ్ గా సాగకపోవడం, కొన్నిచోట్ల కామెడీ పండకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అయితే సాయి తేజ్ అండ్ సత్యరాజ్ యాక్టింగ్, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, అలాగే మారుతి దర్శకత్వ పనితనం సినిమాలో బాగా ఆకట్టుకుంటాయి. మొత్తంమీద కామెడీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పొచ్చు.

 

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు